Sep 22,2023 21:28

నిరసన చేపడుతున్న మున్సిపల్‌ కార్మికులు, నాయకులు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : మున్సిపల్‌ కార్మికులకు సిఎం జగన్‌ ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర నాయకులు ఎ.జగన్మోహనరావు ఆధ్వర్యాన శుక్రవారం రాజీవ్‌ స్టేడియం వద్ద క్లాప్‌ వాహన డ్రైవర్లు, కార్మికులు నిరసన చేపట్టారు. విజయవాడలో ధర్నా చౌక్‌ వద్ద మున్సిపల్‌ కార్మికులు చేపడుతున్న దీక్షలకు సంఘీభావంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం క్లాప్‌ వాహన డ్రైవర్లకు 18500 జీతం ఇస్తామని విడుదల చేసిన జిఒ 7ను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్‌ రద్దు చేస్తానని, ఆరు నెలల్లో కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికుల అందర్నీ పర్మినెంట్‌ చేస్తానని చెప్పి నాలుగేళ్లు గడుస్తున్నా చర్యలు తీసుకోకుండా కార్మికులకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. మున్సిపల్‌ కార్మికులందరినీ పర్మినెంట్‌ చేయకపోతే సమ్మెకు సిద్ధం కాబోతున్నామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నెల 25న కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఫెడరేషన్‌ కార్పొరేషన్‌ కార్యదర్శి బి.భాస్కరరావు, నాయకులు రామచంద్రరావు, కృష్ణ, రామారావు, రాఘవ, కుమారి, రమ, లక్ష్మణరావు, సూరి, చిన్ని, పైడిరాజు తదితరులు పాల్గొన్నారు.