ప్రజాశక్తి-రేపల్లె: మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరుతూ ఏపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం మస్టర్ పాయింట్ దగ్గర కార్మికులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో 120 మున్సిపల్ పట్టణాల్లో, కార్పొరేషన్ నగరాల్లో 40 వేల మంది అప్కాస్‌లో, ఔట్ సోర్సింగ్‌లో మున్సిపల్ కార్మికులు ఉంటే ఆ కార్మికులను అప్కాస్ బోర్డులో చేర్చడం ద్వారా కార్మికులు పర్మినెంట్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మోసం, దగా చేసిందని అన్నారు. 60 సంవత్సరాలు నిండితే పనిలో నుంచి తొలగిస్తున్నారని, ఎటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ ఇవ్వటం లేదని అన్నారు. 2024 ఎన్నికల ముందే ప్రతి మున్సిపల్ కార్మికుడిని పర్మినెంట్ చేయాలని, లేకపోతే మున్సిపల్ కార్మికుల సత్తా చూపుతామని హెచ్చరించారు. దీనికోసం ఆగస్టు 7వ తేదీ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాలు, ఆగస్ట్ 17వ తేదీ చలో విజయవాడ నిర్వహిస్తామని అన్నారు. ఈ నిరసనలో రేపల్లె మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సీఐటీయూ అధ్యక్షుడు డి శివ, కార్మికులు జాని, వెంకటేశ్వరరావు, రెబ్బాని, రాజ్యలక్ష్మి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.










