Jul 16,2023 21:37

నిరసన చేపడుతున్న కార్మికులు, నాయకులు

ప్రజాశక్తి-పార్వతీపురం టౌన్‌ : మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆదివారం మున్సిపల్‌ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యాన నిరసన చేపట్టారు. అనంతరం ప్రధాన రహదారిలో ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి జి.వెంకటరమణ మాట్లాడుతూ ఈ నెల 20, 21 తేదీలలో జరిగే నిరాహార దీక్షలను జయప్రదం చేయాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్రలో భాగంగా మున్సిపల్‌ పారిశుధ్య కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్‌ చేస్తానని హామీ ఇచ్చి విస్మరించారన్నారు. నాలుగేళ్లు గడిచినా నేటికీ హామీని నెరవేర్చలేదన్నారు. ఆప్కోస్‌ విధానంలోనున్న కార్మికులందరినీ పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. దీనిపై దశలవారీగా పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ నెల 27న మున్సిపల్‌ కార్యాలయం ముట్టడి, ఆగస్టు 7న చలో కలెక్టరేట్‌ కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు వి.ఇందిర, పట్టణ నాయకులు బంకురు సూరిబాబు, కార్మికులు ఎన్‌.శంకర్రావు, సిహెచ్‌.సింహాచలం, ఎన్‌.మల్లేషు, తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
పాలకొండ రూరల్‌ : మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ ఎండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ జిల్లా కార్యదర్శి ఎన్‌.వై.నాయుడు, సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పడాల భాస్కరరావు అధ్యక్షతన జరిగిన మున్సిపల్‌ కార్మికుల సమావేశంలో వీరు మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్రలో భాగంగా కార్మికులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్మికులందరినీ పర్మినెంట్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. సిపిఎస్‌ రద్దు చేయాలని, ఒపిఎస్‌ అమలు చేయాలని, మున్సిపల్‌ పర్మినెంట్‌ ఉద్యోగులకు రెండేళ్ల సరెండర్‌ లీవ్‌ వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్మికులకు హెల్త్‌ అలవెన్స్‌ బకాయి విడుదల చేయాలన్నారు. ఇంజనీరింగ్‌ కాంట్రాక్ట్‌ కార్మికులందరికీ హెల్త్‌ రిస్క్‌ అలవెన్స్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో చింతల సంజీవి, సురేష్‌, పడాల వేణు, శ్రీదేవి, విమల, తదితరులు పాల్గొన్నారు.