పుట్టపర్తి అర్బన్ : సమస్యల పరిష్కారం, 24న నిర్వహించనున్న చలో విజయవాడను విజయవతం చేయాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు సోమవారం నాడు పుట్టపర్తిలో బైక్ ర్యాలీ చేపట్టారు. హనుమాన్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. పుట్టపర్తిలో నిరసన ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతులు లేవంటూ సిఐ బాలసుబ్రమణ్యం రెడ్డి ఆధ్వర్యంలో నాయకులను అరెస్టు చేశారు. సాయంత్రం వరకు పోలీసు స్టేషన్‌లో ఉంచుకుని అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అరెస్టుల సందర్భంగా కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సమస్యల పరిష్కరించమని శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే ఇలా పోలీసులు అడ్డుకుని అరెస్టులు చేయడం దుర్మార్గం అని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికుల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించాలంటూ పలుమార్లు అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదన్నారు. కార్మికులందరినీ పర్మనెంట్ చేసి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. గ్య్రాడ్యూటీ సౌకర్యం కల్పించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న పీఎఫ్, ఈఎస్‌ఐ సమస్యలు పరిష్కరించాలన్నారు. హెల్త్ మరియు రిస్క్ అలవెన్స్‌లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలు అమలుతోపాటు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలన్నారు. క్లాప్ ఆటో డ్రైవర్లకు 18,500 వేతనం ఇవ్వాలన్నారు. ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించకుంటే దశలవారీగా ఆందోళనలు ఉధతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నాయకులు రామయ్య, గోవిందు, నాగార్జున, పెద్దన్న, ఇంజనీరింగ్ నాయకులు, రమణ, గణేష్, రామదాసు, సురేంద్ర, సత్యం, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.










