ప్రజాశక్తి- కంచరపాలెం : హెల్త్ అలవెన్స్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని, అవసరమైన కార్మికులకు సెలవులను వార్డులోనే ఇవ్వాలని, కార్మికుల ఇతర పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జ్ఞానాపురంలోని జోన్ 5 కార్యాలయం వద్ద మున్సిపల్ కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు పి.వెంకటరెడ్డి మాట్లాడుతూ, హెల్త్ అలవెన్స్ ఇచ్చేవరకూ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టంచేశారు. పనిముట్లు, సేఫ్టీ పరికరాలు రెగ్యులర్‌గా ఇవ్వాలని, డెత్, సిక్, లాంగ్ ఆబ్‌సెంట్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జోన్ 5 మున్సిపల్ కార్మిక సంఘం జోన్ సెక్రటరీ ఒ అప్పారావు, అధ్యక్షులు మహేశ్వరి, నాయకులు సీతాలక్ష్మి, కన్నతల్లి, బి.అప్పారావు, నూకరాజు, సిహెచ్ అప్పారావు, సత్యవతి, ధన, మహేశ్వరి, రామప్పడు, అప్పలరాజు, సత్యారావు, జగన్ తదితరులు పాల్గొన్నారు.
గాజువాక: జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యాన గాజువాక జోనల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం గాజువాక జోన్ కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ, ఆరు నెలలుగా బకాయి ఉన్న హెల్త్ అలవెన్సు వెంటనే ఇవ్వాలని, చీపుర్లు, పారలు, మాస్కులు, గ్లౌజులు, సబ్బులు, నూనెలు పంపిణీచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గొలగాని అప్పారావు, కిరీటం, కెవి.రవణ, నాగరాజు, రాము, గణేష్, మీనాక్షి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.










