ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
మున్సిపల్ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని సిఐటియు తాలూకా కార్యదర్శి బి.రాముడు డిమాండ్ చేశారు. గురువారం సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు జె.నాగరాజు అధ్యక్షత ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు హామీఇచ్చారని తెలిపారు. నాలుగేళ్లు పూర్తయినా హామీ నెరవేరలేదన్నారు. ఆప్కాస్ పేరుతో మున్సిపల్ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ కార్మికులను మోసం చేశారని విమర్శించారు. కరోనా వల్ల కార్మికులు మరణిస్తే నేటికీ కారుణ్య నియామకాలు చేపట్టలేదన్నారు. పిఎఫ్ డబ్బులకు భద్రత లేకుండా పోయిందన్నారు. కార్మికులకు న్యాయం జరగకపోతే దశలవారీ పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. మున్సిపల్ కార్మికులు, నాయకులు ఇస్మాయిల్, తిమోతి, ముణీంద్ర, వీరేష్, పల్లవి రాజు, కేశన్న, ఉరుకుందు, మల్లికార్జున, సాల్మన్, తిక్కయ్య పాల్గొన్నారు.
మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న నాయకులు










