Jun 15,2023 20:24

మున్సిపల్‌ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న మున్సిపల్‌ కార్మికులు

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
మున్సిపల్‌ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులందరినీ రెగ్యులర్‌ చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎమ్‌డి.అంజిబాబు, తాలూకా కార్యదర్శి బి.రాముడు డిమాండ్‌ చేశారు. గురువారం మున్సిపల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నాలుగేళ్ల క్రితం జగన్మోహన్‌రెడ్డి సంకల్ప యాత్రలో మున్సిపల్‌ కార్మికులను 6 నెలల్లోపు రెగ్యులర్‌ చేస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మంత్రి మండలిలో మున్సిపల్‌ కార్మికుల రెగ్యులేజర్‌ గురించి ప్రస్తావనే లేదని, మున్సిపల్‌ కార్మికులను ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. తక్షణమే అన్ని విభాగాల్లో పని చేసే కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులు, పారిశుధ్యం, ఇంజినీరింగ్‌, క్లాప్‌ వేదర్‌, కంప్యూటర్‌ ఆపరేటర్లను రెగ్యులర్‌ చేయాలని కోరారు. లేకపోతే దశలవారీగా ఉద్యమాలను చేపడతామని హెచ్చరించారు. పింఛను, మెడికల్‌ లీవ్‌లు, 2వ శనివారం సెలవు, క్లాప్‌ డ్రైవర్లకు కనీస వేతనం రూ.18 వేలు, మృతి చెందిన కార్మికుని స్థానంలో కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని ఇన్‌ఛార్జీ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. నాయకులు జె.నాగరాజు, కె.సాల్మాన్‌, ఇస్మాయిల్‌, ముణీంధ్ర, అల్తాఫ్‌, ఈరన్న, కేశన్న, నాగప్రసాద్‌, హరీష్‌, స్వామి, రంగస్వామి, రాజు పాల్గొన్నారు.