Jun 09,2023 00:23

ప్రమాణ స్వీకారం చేస్తన్న చైర్‌ పర్సన్‌ బోడపాటి సుబ్బలక్ష్మి

ప్రజాశక్తి -నర్సీపట్నం టౌన్‌: స్థానిక మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నికలు ఏకగ్రీవంగా .జరిగాయి. రెండు సంవత్సరాల క్రితం ఏర్పడిన మున్సిపల్‌ పాలకవర్గం ముందస్తు ఒప్పందం మేరకు చైర్‌ పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ ఆదిలక్ష్మి, నరసింహమూర్తి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన నోటిఫికేషన్‌ ఆధారంగా నూతన మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలను నర్సీపట్నం ఆర్డిఓ జయరాం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. గతంలో ఎమ్మెల్యే గణేష్‌ ఇచ్చిన హామీ మేరకు పాలకవర్గంను మార్పు చేశారు. వైసిపి కౌన్సిలర్లు అందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలియజేయడంతో ఈ మేరకు చైర్‌ పర్సన్‌ గా బోడపాటి సుబ్బలక్ష్మి, వైస్‌ చైర్మన్‌గా కోనేటి రామకృష్ణను ఎన్నుకున్నారు.ఎన్నిక అనంతరం పదవి బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా ఎన్నికైన చైర్‌ పర్సన్‌, వైస్‌ చైర్మన్‌లు ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.ఎమ్మెల్యే వారిని అభినందించి పురపాలక సంఘానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా చైర్‌ పర్సన్‌ బోడపాటి సుబ్బలక్ష్మి, వైస్‌ చైర్మన్‌ రామకృష్ణ మాట్లాడుతూ, పురపాలక సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని, ముఖ్యంగా పారిశుద్ధ్య సమస్యను పరిష్కరిస్తామన్నారు. కొత్త పాలకవర్గం ఎన్నికకు తెలుగుదేశం, జనసేన పార్టీ కౌన్సిలర్లు దూరంగా ఉన్నారు.