
ప్రజాశక్తి -నర్సీపట్నం టౌన్ :స్థానిక మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలపై రాజకీయ నేతలు, ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. మునిసిపల్ ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల కమిషన్ నుండి ఆదేశాలు రావడంతో మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయో చూడాలి. మున్సిపల్ చైర్మన్ రాజీనామా వ్యవహారంలో ఆ పార్టీలో కౌన్సిలర్లు మధ్య సఖ్యత లేదన్న విషయం రాజకీయ వర్గాలను విస్మయానికి గురి చేసింది. ముందుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా జరిగిన రాజకీయ ఒప్పందం ప్రకారం రెండేళ్ల కాల పరిమితి మేరకే మాట ఇచ్చినప్పటికీ, చైర్మన్‌తో రాజీనామా చేయించిన విధానం సక్రమంగా లేదని, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఓ వర్గంలో అసంతృప్తి నెలకొంది. రాజీనామా చేసిన మూడు నెలల తర్వాత, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు నోటిఫికేషన్ రావడంతో ఒక్కసారిగా మున్సిపల్ రాజకీయాలు వేడెక్కాయి.
మున్సిపాలిటీలో మొత్తం 28 వార్డులు ఉన్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 14, తెలుగుదేశం 12, జనసేన ఒకటి, స్వతంత్ర అభ్యర్థి ఒకరు, కౌన్సిలర్ లుగా ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జనసేన, టిడిపి సభ్యులు కలిస్తే 13 మంది సభ్యుల బలం ఉంటుంది. నర్సీపట్నం మున్సిపాలిటీలో చైర్పర్సన్ ఆదిలక్ష్మి, వైస్ చైర్మన్ గొలుసు నరసింహమూర్తి ముందుగా ఆ పార్టీలో అంతర్గతంగా జరిగిన రాజకీయ ఒప్పందం ప్రకారంగా రెండు సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత రాజీనామా చేశారు. వీరి స్థానంలో 12 వార్డు కౌన్సిలర్ బోడపాటి సుబ్బలక్ష్మి చైర్మన్‌గా, 8వ వార్డు కౌన్సిలర్ కోనేటి రామకృష్ణ వైస్ చైర్మన్ గాను ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ గతంలోనే ప్రకటించారు. రెండు సంవత్సరములు మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పని చేసినప్పటికీ పూర్తి సంతృప్తి చెందలేదని ప్రజలకు సేవలు అందించే సమయంలో రాజీనామా చేయవలసి వస్తుందంటూ పలువురు వద్ద మాజీ చైర్పర్సన్ ఆదిలక్ష్మి బాధపడటం తెలిసిందే. కొంతమంది కౌన్సిలర్‌ల ఒత్తిడి మేరకే ఆమె రాజీనామా చేసినట్లు కూడా తెలుస్తోంది. ఆదిలక్ష్మి రాజీనామా చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొనకపోవడం ఇప్పుడు ఈ ఎన్నిక సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న లుకలుకలు బయట పడుతున్నారు. ఈ నేపథ్యంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో ఏ మేరకు ఈ ప్రభావం చూపిస్తుందోనని పలువురు ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.
టిడిపి, జనసేన కలిస్తే 13 మంది సభ్యుల బలం ఉన్నప్పటికీ, ఎస్సీ కౌన్సిలర్ లేక పోవడంతో చైర్పర్సన్‌కు పోటీ పెట్టకపోవచ్చునని వైసిపి వర్గాలు ధీమాతో ఉన్నాయి. కీలకమైన వైస్ చైర్మన్ పదవి విషయంలో కోనేటి రామకృష్ణ అభ్యర్థిత్వాన్ని వైసీపీలోని ఒక వర్గం వ్యతిరేకిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జనసేన కౌన్సిలర్ వైస్ చైర్మన్గా నామినేషన్ వేస్తే, టిడిపి కౌన్సిలర్లతో పాటు, వైసీపీలో కోనేటి రామకృష్ణని వ్యతిరేకించే ఒక వర్గం కౌన్సిలర్లు, మద్దతు తెలియజేస్తారా లేదా వేచి చూడాలి. మరోవైపు ఒకవేళ టీడీపీ వైస్ చైర్మన్ గా పోటీ చేస్తే భవిష్యత్తులో టిడిపిలో చేరాలనుకుంటున్న ఒకరిద్దరు వైసిపి కౌన్సిలర్లు ఉన్నారని, వారు లోపాయి కారిగా మద్దతు ఇచ్చే అవకాశం ఉంది.