కడప అర్బన్ మున్సిపల్ ఆప్కాస్ చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు కామనూరు శ్రీనివాసులు రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు సుంకర రవి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పనికి తగ్గ వేతనం ఇవ్వాలని కోరారు. సిపిఎస్ రద్దుచేయాలని పేర్కొన్నారు. క్లాప్ డ్రైవర్లకు రూ.18,500 ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలోనూ, పాదయాత్రలోనూ మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులకు అనేక హామీలిచ్చారని తెలిపారు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు, ఉద్యోగులకు మెరుగైన పిఆర్‌సి. ఇస్తానన్నారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని 6 నెలల్లో రెగ్యులర్ చేస్తామని, మున్సిపాలిటీలలో దళారివ్యవస్థ రద్దు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. సిఐటియు నగర అధ్యక్షుడు చంద్రారెడ్డి మాట్లాడుతూ దళారి వ్యవస్థద్వారా క్లాప్ డ్రైవర్లను నియమించి కనీస వేతనాలు ఇవ్వడం లేదని విమర్శించారు. మున్సిపల్ స్కూళ్ళను విద్యాశాఖలో విలీనం చేసి 2 వేల మంది స్వీపర్లను ఇళ్లకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న ప్రభుత్వం అందరికి శఠగోపం పెట్టిందని తెలిపారు. 100 శాతం హామీలు అమలు చేసిన ప్రభుత్వం మాదని ఢాంభికాలు పలుకుతున్నారని విమర్శించారు. 100 శాతంలో మున్సిపల్ కార్మికులు ఉన్నట్టా ? లేనట్టా ? అని ప్రశ్నించారు. దీక్షలో మహిళా కార్మికులు కూర్చున్నారు. కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు కంచుపాటి తిరుపాల్, ఇత్తడి ప్రకాష్, ఆనందరావు, గోపి, కిరణ్, ఆదాం, పుల్లయ్య, కొండయ్య, బాబు, నాగరాజు, హిమాలయ పుల్లయ్య, కార్మికులు, నాయకులు పాల్గొన్నారు.










