Mar 31,2023 23:50
మాట్లాడుతున్న కౌన్సిలర్‌ సూరగాని లక్ష్మి

ప్రజాశక్తి-చీరాల: ఆక్రమించటంలో.. తగ్గేదేలే అన్న శీర్షికన ప్రజాశక్తిలో వచ్చిన కథనంపై శుక్రవారం జరిగిన చీరాల మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో కౌన్సిలర్లు మున్సిపల్‌ రెవెన్యూ అధికారుల తీరుపై ధ్వజమెత్తారు. కౌన్సిల్‌ సమావేశం అజెండాలోని అంశాలపై చర్చ అనంతరం అధికార పార్టీ కౌన్సిలర్‌ సూరగాని లక్ష్మి చీరాల పట్టణ నడిబొడ్డున టౌన్‌ హాల్‌ స్థలాన్ని ఆక్రమించుకొని అక్రమంగా నిర్మించిన మూడు దుకాణాలకు మున్సిపల్‌ అధికారులు పన్ను వేయడం పట్ల తీవ్రస్థాయిలో ఆక్షేపణ వ్యక్తం చేశారు. పట్టణంలోని ముఖ్యమైన కూడలిలో జరిగిన స్థల ఆక్రమణ గురించి సామాన్యులకు కూడా తెలుసని అన్నారు. ఇది ఆక్రమణ అని తెలిసినప్పటికీ మున్సిపల్‌ అధికారులు పన్ను ఎలా వేశారని నిలదీశారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అధికారపక్ష కౌన్సిలర్‌ మామిడాల రాములు, గుంటూరు ప్రభాకరరావు, పాపిశెట్టి సురేష్‌ తదితరులు సూరగాని లక్ష్మి వాదనను బలపరిచారు. పట్టణంలోని పొలిమేర రోడ్డు మాస్టర్‌ప్లాన్‌లో ఉన్న రహదారి స్థలాన్ని కొందరు ఆక్రమించి అడ్డగోలుగా షాపులు నిర్మిస్తే దీన్ని అడ్డుకోవాల్సిన మున్సిపల్‌ అధికారులు సదరు స్థల అంశం కోర్టులో ఉన్నప్పటికీ పన్ను వేసి హక్కులు కల్పించడాన్ని తప్పుపట్టారు. తక్షణమే సదరు షాపులకు వేసిన పన్నులు ఉపసంహ రించి షాపులు తొలగించాలని డిమాండ్‌ చేశారు. పట్టణంలోని ఖాళీస్థలాలను అక్రమించ డం లాంటి చర్యలను అడ్డుకోకపోతే పురపాలక సంఘానికి చెడ్డపేరు వస్తుందని కౌన్సిలర్లు సూరగాని లక్ష్మి, మామిడాల రాములు కౌన్సిల్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మున్సిపల్‌ చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావు జోక్యం చేసుకొని ఈ విషయమై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పట్టణంలోని మురుగునీటి వల్ల సుమారు 17 వందల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లుతుం దని, తక్షణమే మున్సిపల్‌ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్‌ కీర్తి వెంకట్రావ్‌ కోరారు. పట్టణ మురుగు తరలించే వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, అధికారులు పట్టనట్లు ఉండటం సరికాదని అన్నారు. పట్టణంలో పారిశుధ్య కార్యక్రమాల అమలు పనులు సక్రమంగా లేవని, ఎన్నిసార్లు చెప్పినా శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ పట్టనట్లు ఉండటం సరికాదని కీర్తి వెంకట్రావ్‌ ఆక్షేపణ తెలిపారు. పురపాలక శాఖల అధికా రులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని ఛైర్మన్‌ జంజనం శ్రీనివాస రావు హెచ్చరించారు. కాగా పట్టణంలోని పేద, బలహీనవర్గాల వారికి త్వరితంగా నివేశన పట్టాలు ఇవ్వాలని కౌన్సిలర్‌ పాపిశెట్టి సురేష్‌ కోరారు. మున్సిపల్‌ చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కౌన్సిల్‌ సమావేశం అజెండాలోని అంశాలకు కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ రామచంద్రారెడ్డి, డిఇ పి ఏసయ్య, టిపివో రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.