
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : 'అయ్యప్పనగర్ నుంచి ప్రధాన రహదారిపైకి వచ్చే చోట స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో నెల రోజుల్లో ముగ్గురు మరణించారు. అయినా మున్సిపల్ అధికారుల్లో చలనం లేదు. ఇంకెంత మంది ప్రాణాలు పోవాలో అధికారులే సమాధానం చెప్పాలి' పట్టణ పౌర సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకరరావు, అయ్యప్పనగర్ పోరాట కమిటీ కన్వీనర్ యుఎస్ రవికుమార్ ప్రశ్నించారు. శనివారం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి వారు మాట్లాడుతూ గత రెండేళ్లుగా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటుచేయాలని అనేక మార్లు అధికారులకు వినతి పత్రాలు సమర్పించామన్నారు. చివరికి డిప్యూటీ స్పీకర్ కాలనీకి వచ్చి, తమ ముందే కార్పొరేషన్ డిఇకి చెప్పినా అధికారుల నుంచి స్పందన కరువైందని ఆవేదన వ్యక్తంచేశారు.
వెంటనే అధికారులు స్పందించి, అయ్యప్పనగర్ మెయిన్ రోడ్, హనుమాన్ నగర్ వద్ద వెంటనే స్పీడ్ బ్రేకర్లు వేయాలని, లేకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం మేనేజర్‌కి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి పి.రమణమ్మ, సిఐటియు నగర కార్యదర్శి బి.రమణ. అయ్యప్పనగర్ అసోసియేషన్ కార్యదర్శి ఎన్.సుదీర్, అయ్యప్పనగర్ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.