Mar 03,2021 07:22

మునిసిపల్‌ సంస్థలు స్వయంపాలన దిశగా అభిóవృద్ధి చెందాలని, అవి పెట్టుబడులను ఆకర్షించేవిగా తయారు కావాలని నేషనల్‌ అర్బన్‌ రెన్యువల్‌ మిషన్‌ లక్ష్యాలను నిర్దేశించింది. ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం అటువంటి ఆకర్షణీయమైన కబుర్లనే తిరిగి చెప్తూ పబ్లిక్‌-ప్రైవేట్‌ భాగస్వామ్యం గురించి, మునిసిపల్‌ బడ్జెట్‌ విధానాన్ని ఆధునీకరించడం (?) గురించి, జాతీయ మునిసిపల్‌ రుణ విధాన వ్యవస్థ (?) గురించి అదనంగా జోడించింది. అంతేగాక మునిసిపల్‌ సంస్థలకు కూడా ఎఫ్‌ఆర్‌బిఎం చట్టంతో దీటుగా ఉండే చట్టాన్ని తేవాలని కూడా చెప్పింది. ఇవన్నీ తీపి పూత పూసిన నయా ఉదారవాద విధానపు విష గుళికలే.
మునిసిపాలిటీలు స్వయంపాలన సాధించాలన్న పాలకులు 90 శాతం మునిసిపాలిటీలు తమ ఉద్యోగుల జీతాలనే చెల్లించలేని దీన స్థితిలో ఉన్నాయన్న చేదు నిజాన్ని గుర్తించగలిగే స్థితిలో లేరు.
పెరుగుతున్న పట్టణ పేదలు
దేశ జనాభాలో పట్టణ వాసులు 34 శాతం ఉన్నారు. అయితే జిడిపిలో 67 శాతం పట్టణాల నుండే వస్తోంది. ఆక్స్‌ఫామ్‌ సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం ఇటీవలి కాలంలో పట్టణాల్లో పేదరికం, ధనిక-పేద తారతమ్యాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఏ ఉద్యోగమూ లేనివారు, నెలలో కొన్ని రోజులు మాత్రమే పనులు దొరుకుతున్నవారు, రోజుకు కొన్ని గంటలు మాత్రమే పని దొరుకుతున్నవారు, కనీస వేతనాలు లభించనివారు విపరీతంగా పెరిగిపోయారు. గృహ వసతి చాలా తీవ్ర సమస్య అయింది. నివాస ప్రాంతాల్లో కనీస వసతులు బొత్తిగా లేకుండా పోతున్నాయి. ఇక కాలుష్యం సమస్య గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇటువంటి పట్టణాల్లో బతుకుతున్న పేదలు తమ ఉపాధికి గండి పడితే ఎంత అన్యాయమైన పరిస్థితుల్లో పడతారో లాక్‌డౌన్‌ కాలంలో లక్షలాది వలసకూలీల కాలినడకల ప్రయాణాల హృదయవిదారక దృశ్యాలను ఇటీవలే ప్రపంచమంతా చూసింది.
పట్టణ ఉపాధి హామీ ఏదీ?
ఈ నేపథ్యంలో ఆర్థిక సంఘం ఆ పట్టణ పేదల స్థితిగతులను మెరుగు పరిచేందుకు తోడ్పడే సిఫార్సులను ఏమైనా చేస్తుందేమోనని ఎదురు చూసినవారికి తీవ్ర ఆశాభంగమే ఎదురైంది. పుండు మీద కారం చల్లినట్టు ఆ పేదలపైనే మరిన్ని భారాలను మోపే సిఫార్సులనే చేసింది ఆర్థిక సంఘం. చాలా కాలంగా పట్టణ పేదలు పట్టణ ఉపాధి హామీ పథకం చేపట్టాలని కోరుతున్నారు. కాని 15వ ఆర్థిక సంఘం అటువంటి ప్రతిపాదనను కూడా చేయలేదు.
అవసరాలకు చాలని గ్రాంట్లు
పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 2011లో చేసిన సిఫార్సుల ప్రకారం పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన కోసం జిడిపిలో 0.75 శాతం నిధుల కేటాయింపుతో ప్రారంభించి 2032 నాటికి 1.5 శాతం నిధులను కేటాయించాలి. కాని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసినది 0.07 శాతం మాత్రమే!
పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కోరినది చూడండి. ''రాబోయే ఐదేళ్ళ కాలానికీ మునిసిపాలిటీల ఖర్చులకు, వాటికి వచ్చే ఆదాయానికి మధ్య తేడా రూ.12.27 లక్షల కోట్లు ఉంటుంది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన గ్రాంట్ల మొత్తానికి ఈ మారు 4 రెట్లు పెంచుతూ 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేయాలని కోరుతున్నాం.''
మునిసిపాలిటీలకు ఆర్థిక లోటు రూ.12.27 లక్షల కోట్లు అని అంచనా వేసిన పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కోరిన గ్రాంటు రూ. 3,48,575 కోట్లు మాత్రమే. ఇక 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసినది మాత్రం కేవలం రూ.1,21,055 కోట్లు మాత్రమే. అంటే అవసరమైన మొత్తంలో పదో వంతు మాత్రమే! పైగా గత ఏడాది రూ. 25,098 కోట్లు ఇస్తే ఈ ఏడాది రూ.22,144 కోట్లే ఇవ్వనున్నారు.
మురికివాడలపై ఆస్తిపన్ను వల
ఆ గ్రాంట్లను కూడా పొందాలంటే మునిసిపాలిటీలు 2021-22లో ఆస్తిపన్ను విధానాన్ని మార్చుతూ నోటిఫై చేయాలి (మన రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేసేసింది). ఆ తర్వాత 2022-23 నుండీ ఆస్తి పన్ను వసూళ్ళు రాష్ట్ర జిఎస్‌డిపి వృద్ధి రేటుతో సమానంగా పెరుగుతూ వుండాలి. అలా పెరుగుతూ వుంటేనే గ్రాంట్లు విడుదలౌతాయి. ఈ కొలబద్దను పాటించకపోతే 2023-24 నుండీ గ్రాంట్లు నిలిచిపోతాయి. రాష్ట్ర స్థాయిలో ఆర్థిక సంఘం ఏర్పాటు చేసి ఆ సంఘం చేసే సిఫార్సులను మునిసిపాలిటీలు అమలు చేయాలి. ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక సంఘం గనుక ఏర్పాటు కాకపోతే అప్పుడూ గ్రాంట్లు నిలిచిపోతాయి.
ఆస్తి విలువ ఆధారంగా పన్ను రేటు నిర్ణయించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశ సూత్రాన్ని చూస్తే ఇంత కాలమూ ఆస్తి పన్ను నుండి మినహాయింపు పొందుతున్న గుడిసె వాసులు, చిన్న చిన్న రేకు షెడ్లు నిర్మించుకున్నవారు అందరూ ఇప్పుడు ఆస్తిపన్ను కట్టాల్సి వస్తుంది. వారుండేది గుడిసే అయినా, పెరిగిన భూముల విలువను బట్టి వాటికి పన్ను కట్టాల్సి వస్తుంది. లక్షలాది పట్టణ పేదల నుండి ఆస్తి పన్ను గుంజబోతున్నారు. ఇక అద్దె ఇళ్ళల్లో ఉండేవారు చెల్లించవలసిన అద్దెలు ఎన్ని రెట్లు పెరుగుతాయో ఊహించుకోవలసిందే.
ఇక పిపిపి మోడల్‌, ద్రవ్యలోటు నియంత్రణ వంటి సిఫార్సులు చూస్తే ఇకపై ఏ విధమైన పౌర సేవలు మునిసిపాలిటీ నుండి ఆశించినా అందుకు అదనంగా చెల్లించుకోవలసి వుంటుంది.
స్థానిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేసి వాటి ద్వారా ప్రజలకు వైద్య, ఆరోగ్య సేవలను అందించాలన్న సిఫార్సు ఒక్కటే కాస్త ఊరట కలిగించేదిగా ఉంది. బహుశా కేరళలో వామపక్ష ప్రభుత్వం కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో స్థానిక సంస్థలు పోషించిన కీలక పాత్ర ఆర్థిక సంఘాన్ని కాస్త ప్రభావితం చేసినట్లు ఉంది. ఆచరణలో ఏం చేయనున్నారో చూడాల్సిందే. ఈ ఆరోగ్య కేంద్రాలను కూడా పిపిపి మోడల్‌ కింద ప్రైవేటు రంగానికి అప్పజెప్పినా ఆశ్చర్యపడనవసరం లేదు.
గడిచిన సంవత్సరం పట్టణ పేదలు పడిన ఇక్కట్లు చూసిన తర్వాతనైనా వారిపై భారాలను తగ్గించే దిశగా సిఫార్సులు ఉంటాయని ఎవరైనా ఆశిస్తారు. కాని అందుకు భిన్నంగా ఈ సిఫార్సులు ఉన్నాయి. అమెరికా దేశంలో సైతం బైడెన్‌ పదవి చేపట్టగానే నిరుద్యోగ భృతిని వారానికి 400 డాలర్లు చేశాడు. తక్కువ ఆదాయ వర్గాలవారికి 2000 డాలర్ల వరకూ పన్ను మినహాయింపు ప్రకటించాడు. కనీస వేతనాన్ని పెంచాడు. రోజూ అమెరికా భజన చేసే మోడీ ప్రభుత్వం పట్టణ పేదల విషయంలో మాత్రం అమెరికాను అనుసరించలేదు.
సంక్షేమ పథకాలే సర్వస్వమా?
ఇక రాష్ట్ర ప్రభుత్వం తీరు చూస్తే ''కేంద్రం ఈ విధంగా నిర్ణయిస్తే ఇక మేమేం చేయగలం? కేంద్రం చెప్పినట్లు చేయకపోతే ఆ కాస్త నిధులు కూడా రావు కదా'' అన్న వైఖరి తీసుకుని పట్టణ పేదలపై తన వంతు భారాలను కూడా మోపే దిశగానే ఉంది. తను అమలు జరిపే సంక్షేమ పథకాలే సర్వస్వం అని, వాటితోటే పట్టణ పేదల పేదరికం, నిరుద్యోగం తొలగిపోతాయని ప్రజలను భ్రమలో ఉంచే యత్నం చేస్తోంది. సంక్షేమ పథకాలు ఊరట కలిగిస్తాయే తప్ప అసలు సమస్యను పరిష్కరించలేవు. పట్టణ పేదలు సంక్షేమ పథకాలను స్వాగతిస్తున్నారు. కాని వారు వాస్తవంగా కోరుకుంటున్నది తమ వాస్తవ సమస్యలకు పరిష్కారాన్ని. పాలకులు ఈ వాస్తవాన్ని విస్మరిస్తే అది రాజకీయంగా వారికి రానున్న కాలంలో పెను సవాలు కాక తప్పదు.

                                                                                                                    - ఎం.వి.ఎస్‌. శర్మ