మునగ మొక్కే కదాని మనం చాలా తేలిగ్గా అనుకుంటాం. కానీ, అది మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. మునగలో దండిగా పోషకాలే కాదు! మెండుగా ఔషధాలూ ఉన్నాయి. మునగ ఆకు, పువ్వు, బెరడు, కాయలు ఇలా ఆపాదమస్తకం సర్వం శ్రేష్టమే. మొరింగేసి కుటుంబానికి చెందినది ఇది. ఇది విస్తత ప్రయోజనాలున్న కూరగాయ చెట్టు. ఇవి సన్నగా పొడవుగా సుమారు 10 మీటర్ల ఎత్తు పెరిగి, కాండం నుండి కొమ్మలు వేలాడుతుంటాయి. వాటి చివర వేలాడుతూ కాయలు కాస్తాయి. అందుకే వీటిని ములగ కాడలు అంటారు.
దీని శాస్త్రీయ నామం మొరింగా ఓలీఫెరా. భారత దేశానికి చెందిన ఈ మొక్క ప్రస్తుతం ప్రపంచం అంతటా విరగ కాస్తోంది. మునగని తోటలుగా వేసుకుని ఫలసాయాన్ని పొందడమే కాదు, ఇంటి పెరటిల్లోనూ, కుండీల్లోనూ, మిద్దె తోటల్లోనూ పెంచుకోవచ్చు. మనసుంటే మునగ మొక్కను ఇంటిలో ఎక్కడైనా పెంచుకునే వెసులుబాటు ఉంది.
మునగలో ఇప్పుడు అనేక హైబ్రీడ్ రకాలు అందుబాటులోకి వచ్చేశాయి. నాటిన మరుసటి రోజు నుంచి, కేవలం మూడడుగుల ఎత్తులో కాసే సరికొత్త మొక్కలూ ఇప్పుడు లభిస్తున్నాయి. సాధారణంగా మనకు చెట్టు ఏడాదికి రెండు సార్లు కాపు కాస్తుంది. మార్చి నుంచి ఏప్రిల్ వరకు ఒక దఫా, జులై నుంచి సెప్టెంబర్ వరకు మరోసారి కాయలు కాస్తాయి. అయితే ఇటీవల వస్తున్న సరికొత్త రకాలు.. చిన్నదో పెద్దదో నిత్యం ఏవో కాయలు కాస్తూనే ఉంటున్నాయి. మునగ దాదాపు అన్ని రకాల నేలల్లోు చక్కగా పెరిగి, కాపుకాస్తుంది.
పోషకాలు..
మునగలో విటమిన్ ఎ, విటమిన్ సి, క్యాల్షియం, పొటాషియం, పీచు పదార్థం మెండుగా ఉంటాయి. అలాగే మునగ ఆకుల్లో క్యాల్షియంతో పాటు విటమిన్ ఎ, బీటా కెరోటిన్, ఇనుము పుష్కలంగా ఉంటాయి.
ఉపయోగాలు..
మునగ కాడలను కూరలకు, పచ్చళ్లకు, సాంబారు వంటి రసాల్లో వాడతారు. వీటి గుజ్జును సౌందర్య సాధనాల్లోకి, నీటిని వడకట్టే యంత్రాల్లో వాడుతున్నారు. అలాగే మునగ ఆకును కూడా కూరలకు, రసానికి వాడతారు. మునగ చెట్టు బెరడు, కాడలను, ఆకులను ఔషధాల తయారీకి, నూనెలు తయారీకి వినియోగిస్తారు.
ఉత్పత్తి..
మునగ మొక్కలను విత్తనాల ద్వారా, అంటుకట్టడం ద్వారా ఉత్పత్తి చేస్తారు. విత్తనాల ద్వారా మొలిచిన మొక్కల కంటే అంటు ద్వారా ఉత్పత్తి చేసిన మొక్కలు త్వరగా ఫలసాయాన్ని ఇస్తాయి. మునగ చెట్ల నుంచి జాగ్రత్తగా కొమ్మలు కత్తిరించి, మట్టిలో నాటి, మనం కూడా కొత్త మొక్కలు తయారుచేసుకోవచ్చు.
మొక్క సంరక్షణ..
మునగ మొక్కకు పెద్దగా ఎరువులు అవసరం లేదు. పశువుల పెంట అప్పుడప్పుడు వేస్తే సరిపోతుంది. వీటికి తెగుళ్ళను తట్టుకునే గుణం ఉంది. అప్పుడప్పుడు గొంగళి పురుగులు మునగ మొక్కలకు పడుతూ ఉంటాయి. అలాంటి సమయాల్లో వేపనూనె పిచికారీ చేయాలి.
నేల స్వభావం..
మునగ మొక్కలు రాతి నేల తప్ప, ఎలాంటి నేలలోనైనా బాగానే పెరుగుతాయి. కాకపోతే ఇసుక, ఎర్రమట్టి నేలలో అయితే కాపు ఘనంగా ఉంటుంది. అలాగే కాయలు కూడా రుచిగా ఉంటాయి. మునగ చెట్టుకు నీళ్లు సరిసమానమైన మోతాదులో ఇవ్వాలి. చెట్టు మొదట నీళ్లు ఎక్కువగా నిల్వ ఉంటే ఆకులు పండిపోయి, రాలిపోతాయి.. మొక్క కుళ్లిపోతుంది. నేలలో పిహెచ్ విలువ 6.2 నుంచి 7.0 వరకూ ఉంటే మునగ బాగా పెరిగి, కాపునిస్తుంది.
రోహిత్ 1
మొక్క పది అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. నాటిన ఐదారు నెలలకే కాపు మొదలవుతుంది. ఏడాదికి రెండు సార్లు ఫలసాయాన్ని ఇస్తుంది. కాయలు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. రుచి కూడా మధురంగా ఉంటుంది. ఒక్కో చెట్టు నుంచి దాదాపు 100 నుంచి 150 వరకు కాయలు కాస్తాయి. దీని అంటు ధర వంద రూపాయల వరకూ ఉంటుంది. మూడు అడుగుల ఎత్తు పెరిగే, కాయలు కాస్తుంది. దాదాపు పదేళ్ల వరకూ ఈ మొక్క ఫలసాయం అందిస్తుంది. ఇళ్లలో పెంచుకోవడానికి ఇది అనువైన మొక్క.
కోయంబత్తూర్- 2
కోయంబత్తూరు- 2 రకం మునగ మొక్కనూ ఇళ్లలో పెంచుకోవచ్చు. ఈ మొక్క కాస్త పొట్టిగా, గుబురుగా ఉంటుంది. కాయలు కూడా పొట్టిగా, ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఈకాడలు రుచి లోనే కాదు, కాపులో కూడా ఘనాపాటే. ఏటా సగటున మూడు వందల నుంచి 400 వరకు మునగకాడలు కాస్తుంది. చెట్టు ఐదేళ్ల వరకూ కాపు బానే ఉంటుంది. దీని ధర కూడా 100 రూపాయల వరకూ ఉంటుంది.
పీకేఎం -1
పీకేఎం-1 మునగ అధునాతనమైన రకం. ఇది విపరీతంగా కాయలు కాస్తుంది. కాయలు చాలా పొడవుగా ఉంటాయి. నాటిన ఎనిమిది తొమ్మిది నెలల్లోనే ఈ మొక్క కాపు కాస్తుంది. మార్కెట్లో ఈ కాయలకు మంచి గిరాకీ ఉంటుంది. ఈ మొక్క పెంచడానికి ఎక్కువ స్థలం అవసరం. ఒక్కోసారి 15 అడుగుల ఎత్తు వరకూ మొక్క పెరుగుతుంది. ఈ హైబ్రీడ్ మొక్క ధర 150 రూపాయలు వరకూ ఉంటుంది.
పీకేఎం -2
ఇది కూడా మేలైన మునగ రకం. కాయలు చాలా పొడవుగా ఉంటాయి. దాదాపు 300 నుంచి 400 వరకు కాయలు కాస్తాయి. కాయ రుచి కూడా ఎంతో మధురంగా ఉంటుంది. చెట్లు బాగా ఎత్తుగా, గుబురుగా పెరుగుతాయి. కాయల బరువుకి కొమ్మలు విరిగి పోతుంటాయి. ఈ మొక్కకు నీటి వసతి ఎక్కువ అవసరము. ఈ మొక్కలు పెరగడానికి విశాలత ఎక్కువ కావాలి.