Jul 30,2023 21:43

13,764 మంది వరద బాధితులు
బియ్యం, కూరగాయలు, వంటనూనె పంపిణీ
కొండ గుట్టలపైన ఉన్నవారికి సహాయక చర్యలు
విలేకరుల జెసి లావణ్యవేణి
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

గోదావరి వరదకు కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 45 నివాసిత ప్రాంతాలు ముంపుబారిన పడ్డాయని, 4,779 కుటుంబాలకు చెందిన 13,764 మంది వరదబారిన పడ్డారని జాయింట్‌ కలెక్టర్‌ బి.లావణ్యవేణి తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లోని గౌతమి సమావేశ మందిరంలో ఆదివారం మీడియా సమావేశంలో వరద పరిస్థితి, సహాయక చర్యలపై జెసి మాట్లాడారు. భద్రాచలంలో వరద ప్రవాహం ప్రస్తుతం తగ్గుముఖం పట్టి రెండో ప్రమాద హెచ్చరికలో ఉందన్నారు. వరదలకు వేలేరుపాడులో 35, కుక్కునూరులో పది నివాసిత ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయన్నారు. రెండు మండలాల్లో 12 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 4,275 మందికి పునరావాసం కల్పించామన్నారు. మిగిలిన 9,489 మంది బంధువుల ఇళ్లకు కొంతమంది, మరికొంతమంది కొండలు, గుట్టలపైకి వెళ్లారన్నారు. ప్రతిఒక్కరికీ ఆహారం, తాగునీరు, శానిటేషన్‌ వంటి సదుపాయాలు సమకూర్చామన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 36 మెడికల్‌ క్యాంపుల ద్వారా 464 మందికి వైద్య సదుపాయం కల్పించామన్నారు. 119 మంది గర్భిణులను గుర్తించామని, వారిలో నాలుగు వారాల్లో ప్రసవానికి సిద్ధంగా ఉన్నవారిలో తొమ్మిది మందిని సమీప సిహెచ్‌సికి తరలించామని చెప్పారు. మిగిలిన 110 మందిని వారి సమీప బంధువుల ఇంటిలో, ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో ఉంచారన్నారు. రైస్‌ డిపోల ద్వారా మూడు నెలలకు సరిపడు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశామన్నారు. వరద సహాయక చర్యల్లో భాగంగా రెండు పెద్ద బోట్లను, దేశీయ బోట్లను, తొమ్మిది మోటార్‌ బోట్లతో పాటు రెండు ఎస్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలు, ఒక ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందం, ఫైర్‌ సర్వీస్‌కు చెందిన రెండు రెస్క్యూ బోట్లను సిద్ధం చేశామన్నారు. అత్యవసర పరిస్థితిలో వినియోగానికి పది జెనరేటర్‌లు సిద్ధం చేశామన్నారు. 11 లక్షల 69 వేల వాటర్‌ ప్యాకెట్‌లను పంపిణీ చేశామన్నారు. రేషన్‌ బియ్యంతో పాటు సిఎం జగన్‌ ఆదేశాల మేరకు మరో 25 కేజీల బియ్యం, కేజీ చొప్పున కందిపప్పు, ఆయిల్‌పామ్‌, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు ప్రజలకు అందిస్తున్నామన్నారు. వరద సహాయక చర్యల కోసం సబ్‌ కలెక్టర్‌, ఐటిడిఎ ప్రాజెక్ట్‌ అధికారి, ఆర్‌డిఒలు, జెడ్పి సిఇఒ, డిఆర్‌డిఎ పీడీ, డ్వామా పీడీ, జిల్లా పంచాయతీ అధికారి, ఇతర అధికారులను నియమించామన్నారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో డిప్యూటీ తహశీల్దార్‌, విఆర్‌ఒ, పంచాయతీ కార్యదర్శి, గ్రామ సచివాలయ సిబ్బంది రాత్రిసమయంలోనూ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని తెలిపారు. జిల్లా, డివిజన్‌ స్థాయిలో కంట్రోల్‌ రూములు నిరంతరం పనిచేస్తున్నాయన్నారు.
దెబ్బతిన్న కచ్చా, పూరి గుడిసెలకు రూ.పదివేలు సాయం
వరదలకు దెబ్బతిన్న కచ్చా, పూరిగుడిసెలకు సిఎం జగన్‌ ఆదేశాల ప్రకారం రూ.పదివేలు చొప్పున అందిస్తామని, వరద తగ్గిన వెంటనే మండల స్థాయి ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో విఆర్‌ఒ, పంచాయతీ కార్యదర్శి, సచివాలయ సిబ్బందితో కూడిన బృందం ఇంటింటి సర్వే చేస్తారన్నారు. పునరావాస కేంద్రం నుండి బాధితులు తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో ప్రతీ కుటుంబానికి రూ.రెండు వేలు చొప్పున అందిస్తామన్నారు. ఇందుకు గ్రామసభలు ఏర్పాటు చేసి బాధితుల పేర్లు వెల్లడించి పారదర్శకంగా అందిస్తామని చెప్పారు. వేలేరుపాడుకు చెందిన 19 నివాసిత ప్రాంతాల వారు, కొండ ప్రాంతాల్లో ఉన్నారని వారికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తామన్నారు. జనరేటర్‌లు కూడా ఏర్పాటు చేశామన్నారు. టార్పాలిన్లు కూడా అందిస్తున్నామన్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి భోజన సౌకర్యం కల్పిస్తున్నామని, అయితే కొంతమంది బయటకు వెళ్లి కూలి పనులు చేసుకుంటున్నారని, అలాంటి వారు తమకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందిస్తే వండుకుంటామని కోరారని, ఆ మేరకు వారికి కూడా అందించామన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.