రైతు సంఘం నాయకులు మర్లపాటి నాగేశ్వరరావు
ప్రజాశక్తి-విఆర్.పురం
పోలవరం ముంపు ప్రాంత రైతుల సమస్యలను ప్రత్యేక కోణంలో చూసి సానుకూలంగా స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని రైతు సంఘం జిల్లా నాయకులు మర్లపాటి నాగేశ్వరరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మండలంలోని రేఖపల్లిలో కుంజా నాగిరెడ్డి అధ్యక్షతన ఏపీ రైతు సంఘం ఐదవ మండల మహాసభ జరిగింది. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ పోలవరం ముంపు మండలాల్లో రైతులు వరదల వల్ల తీవ్రంగా నష్టపోయారని, పంటలు వేయలేని స్థితిలో ఉన్నారని, వారిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరారు. పంట నష్టపోయిన రైతులకు నేటికీ పరిహారం అందలేదన్నారు. పోలవరం పరిహారం ఇవ్వకుండా అడ్డుకుంటున్నారన్నారు. రైతులకు ఉచితంగా ఇచ్చే వ్యవసాయ బోర్లకు మీటర్ల అమర్చి ఉచిత విద్యుత్తును ఎత్తేవేసి దుర్మార్గమైన చర్యలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగుతున్నాయని మండిపడ్డారు.
నూతన కమిటీ ఎన్నిక
ఈ మహాసభలో 15 మందితో నూతన కార్యవర్గం ఎన్నికైంది. సంఘం మండల అధ్యక్షులుగా ఫంకు సత్తిబాబు, కార్యదర్శిగా వడ్లది రమేష్, కమిటీ సభ్యులుగా సీరపు తాతబాబు, సున్నం నాగయ్య, కారం సత్యం, కుకునూరి నాగరాజు, సోయం చినబాబు, చిక్కాల రామారావు, తుర్రం బాబూరావు, సున్నం నాగయ్య, గుహల శ్రీను, దారోగి బాబూరావు, నల్లారపు చంద్రరావు, జల్లి సత్యనారాయణ, ముసలి సత్యనారాయణ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు మేకల నాగేశ్వరరావు పాల్గొన్నారు.










