ప్రజాశక్తి- కూనవరం
నాలుగు ముంపు మండలాల సమస్యలపై ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి స్పందించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం డిమాండ్ చేశారు. స్థానిక ఆవుల నాగమయ్య భవన్‌లో పల్లపు వెంకట్ అధ్యక్షతన బుధవారం జరిగిన నాలుగు మండలాల సిపిఎం నాయకుల సమావేశంలో సీతారాం మాట్లాడారు. ముంపు మండలాల ప్రజలు వరదల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ప్రస్తుతం గోదావరి వరద ప్రవాహం పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురువుతున్నారని, పునరావాస కేంద్రాలకు పరుగులు తీస్తున్నారని తెలిపారు. గోదావరి ముంపు సమస్యపై సిపిఎం పాదయాత్ర నిర్వహించి, ముందస్తుంగానే రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్, అధికారుల దృష్టికి తీసుకెళ్లిందని, అయినా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్ మాట్లాడుతూ ఆరు రోజుల క్రితం గోదావరి శబరి నదులు పొంగిపోవడంతో కూనవరం, విఆర్.పురం మండలాల్లోని లోతట్టు గ్రామాల వారిని పునావాస కేంద్రాలకు తరలించి అధికారులు చేతులు దులుపుకున్నారని, వారికి నిత్యావసరాలు, బరకాలు, దోమతెరలు ఏమీ ఇవ్వకుండా గాలికొదిలేశారని తెలిపారు. గోదావరి వరద ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉందని, ఇప్పటికైనా అధికారులు సహాయ కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. పార్టీ కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా నాయకులు మేకల నాగేశ్వరరావు, పూనెం సత్యనారాయణ, మర్లపాటి నాగేశ్వరరావు, సీసం సురేష్, కుంజ రాధా, నాలుగు మండలాల కార్యదర్శులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.










