Oct 16,2022 23:38

రామకృష్ణాపురంలో ముంపు ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి - ఆరిలోవ : విశాఖ కేంద్ర కారాగారం ఎదురుగా ముంపునకు గురవుతున్న రామకృష్ణాపురం కాలనీలో సిపిఎం నాయకులు ఆదివారం పర్యటించారు. ముంపునకు కారణమవుతున్న కాలనీని ఆనుకొని ఉన్న చెరువును తలపించే క్వారీని సందర్శించారు. ముంపునకు గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్‌కెఎస్‌వి.కుమార్‌ మాట్లాడుతూ, రామకృష్ణాపురంలో జీవిస్తున్న వారందరూ రోజువారి పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్న అంఘటిత కార్మికులేనన్నారు. అద్దెలు కట్టలేక చిన్నపాటి నివాసాలు ఏర్పాటుచేసుకొని జీవిస్తునఆనరని తెలిపారు. ఇటువంటి కాలనీలో చిన్న పాటి వర్షం వచ్చినా ఇళ్ళలోకి నీరు చేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాలనీని ఆనుకొని ఉన్న క్వారీ కారణంగానే ఈ ముంపు తలెత్తుతుందని వివరించారు. క్వారీ పూర్తిగా నిండిపోతే నీరు కిందికి పోయేందుకు జివిఎంసి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ఆరిలోవ జోన్‌ కార్యదర్శి వి.నరేంద్రకుమార్‌, నాయకులు ఈశ్వరరావు, వి.కృష్ణమూర్తి, ఐసి.నాయుడు, ఆదినారాయణ, గ్రామ సంఘం నాయకులు భవిరీడు, బాబూరావు, బంగారయ్య, అబ్బులు తదితరులు పాల్గొన్నారు.