భారీగా చేరుతున్న గోదావరి వరద
కుక్కునూరులో 20 గ్రామాలకు నిలిచిన రాకపోకలు
జలదిగ్బంధంలో వేలేరుపాడు మండలం
సురక్షిత ప్రాంతాలకు తరలుతున్న బాధితులు
కుక్కునూరు - భద్రాచలం రోడ్డులో నిలిచిన ప్రయాణాలు
ప్రజాశక్తి - కుక్కునూరు
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుల్లో సామర్థ్యానికి మించి ఉన్న నీటిని దిగువకు వదలడం, శబరి నది పొంగడం, కాపర్ డ్యామ్ బ్యాక్ వాటర్ ప్రభావంతో గోదావరికి భారీగా వరద చేరడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. కుక్కునూరు - దాచారం మధ్య గుండేటివాగుపై ఉన్న కాజ్‌వే వారంరోజులుగా ముంపులో ఉండటంతో 14 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి వరదల కారణంగా ముందస్తు చర్యల్లో భాగంగా గొమ్ముగూడెం గ్రామంలోని 253 కుటుంబాలను వారం రోజుల క్రితం అధికారులు రావికుంటపునరావాస కేంద్రానికి తరలించారు. గురువారం ఉదయం భద్రాచలంలో 50 అడుగులకు చేరుకుని రెండో ప్రమాద హెచ్చరికను దాటి గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మండలంలోని ముత్యాలంపాడు, వింజరం, సీతారామనగరం ప్రధాన రహదారులపైకి వరద చేరడంతో ఆరు గ్రామాలకు రాకపోకలు పూర్తిగానిలిచాయి. వేలేరు, బూర్గంపాడు మధ్య ప్రధాన రహదారిని వరద ముంచెత్తడంతో కుక్కునూరు - భద్రాచలానికి రహదారి లేకపోవడంతో ఆర్‌టిసి బస్సులు, బస్సులు, లారీలు, ఇతర ప్రయివేటు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచి కుక్కునూరు నుండే వెనుదిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోదావరి వరద పెరిగి కుక్కునూరు 'ఎ' బ్లాక్‌ని ముంచెత్తడంతో అక్కడ ఉన్న 200 కుటుంబాలవారు సామగ్రిని తీసుకుని ట్రాక్టర్లపై కివ్వాక పునరావాస కేంద్రానికి తరలివెళ్లారు. వరద పెరిగితే కౌండిన్యముక్తి, ఎల్లప్పగూడెం, బెస్తగూడెం ఎస్‌సి కాలనీ గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం ఉంటుంది. భద్రాచలంలో ప్రస్తుతం గోదావరి తగ్గుముఖం పట్టినా శబరి నది ఉధృతి, పోలవరం కాపర్ డ్యామ్ బ్యాక్ వాటర్ ప్రభావంతో వరద క్రమంగా పెరుగుతుండటంతో మండల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
వరద ప్రాంతాలను సందర్శించిన ఐటిడిఎ పిఒ
గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో కెఆర్.పురం ఐటిడిఎ పిఒ సత్యనారాయణ సందర్శించారు. మండలంలోని లోతట్టు ప్రాంతమైన కౌండిన్యముక్తి గ్రామంలో పర్యటించి గ్రామస్తులతో మాట్లాడారు. అప్రమత్తంగా ఉండాలని, వరద పెరిగితే ముందుగానే తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, ఆందోళన చెందొద్దని తెలిపారు. అనంతరం కివ్వాక పునరావాస కేంద్రంలో వరద బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులకు పిఒ సూచించారు.
వేలేరుపాడు:ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఆయా ప్రాజెక్టుల్లోకి చేరిన అదనపు జలాలను గోదావరిలోకి వదలడంతో ఉగ్రరూపం దాల్చింది. దీంతో మండలం చుట్టూ వరదనీరు చేరడంతో గ్రామాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇప్పటికే వేలేరుపాడు, రేపాకగొమ్ము, రుద్రంకోట, వసంతవాడ, వేలేరుపాడు, కన్నాయిగుట్ట, బోళ్లపల్లి, ఎడవల్లి గ్రామాల్లోని ప్రధాన రహదారులను వరద ముంచెత్తడంతో వారంరోజులుగా 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బోళ్లపల్లి, ఎడవల్లి గ్రామాల ప్రజలు అత్యవసరపరిస్థితుల్లో నాటుపడవల్లో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే రేపాకగొమ్ము గ్రామానికి చెందిన 200 కుటుంబాలను రావికుంటపునరావాస కేంద్రానికి అధికారులు తరలించారు. భద్రాచలంలో గోదావరి వరద 54 అడుగులకు చేరింది. వేలేరుపాడు మండలంలోని గ్రామాల చుట్టూ వరద చేరుతుండటంతో రహదారి సౌకర్యం లేని నార్లవారం గ్రామంలోని 120 కుటుంబాలను నాటుపడవల్లో సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించారు. మండలంలోని తాట్కూరుగొమ్ము, రుద్రంకోట, చిగురుమామిడి, కోయిదా, కట్కూరు, ఎడవల్లి, టెకూరు, చిత్తిరెడ్డిపాలెం, ఎర్రతోగు గ్రామాల చుట్టూ వరద నీరు చేరడం, రహదారి సదుపాయం లేకపోవడంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఈ గ్రామాలకు చెందిన కుటుంబాలు దగ్గరలోని కొండ గుట్టలమీద గుడారాలు వేసుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాయి. మండల కేంద్రం వేలేరుపాడులోకి వరద నీరు చేరుతుండటంతో గ్రామస్తులు సురక్షిత ప్రాంతాలకు వెళుతున్నారు. గుట్టలమీద ఉంటున్న వరద బాధితులకు కరెంటు లేకపోవడంతో అంధకారంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరికి సరైన వైద్య సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. వరద అంతకంతకూ పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంతాలబాధితులను ఎన్‌డిఆర్‌ఎఫ్ ప్రత్యేక బలగాల సహాయంతో పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తహశీల్దార్ రమేష్ తెలిపారు.










