Mar 04,2023 23:33

ఆందోళన చేస్తున్న బిసి కాలనీ ప్రజలు

తహశీల్దారు కార్యాలయం ఎదుట బిసి కాలనీ వాసుల ఆందోళనలు
ప్రజాశక్తి -విఆర్‌.పురం

మండలంలోని ముంపు గ్రామాలపై ప్రభుత్వానికి అశ్రద్ధ తగదని బాధితులు మండిపడ్డారు. స్థానిక బిసి కాలనీ ప్రజలు శనివారం తహశీల్దార్‌ కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ 2022 సంవత్సరంలో వచ్చిన గోదావరి వరదల్లో గృహాలు ముంపునకు గురై సర్వం కోల్పోయామని తెలిపారు. 41.5 కాంటూర్‌లో బిసి కాలనీని చేర్చి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ప్రతి ఏడాది వచ్చే వరదలకు పూర్తిగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక తహశీల్దార్‌ ఎన్‌.శ్రీధర్‌కు వినతిపత్రం అందజేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాశిత లబ్ధిదారుల వివరాలను పైస్థాయి అధికారులకు తెలియజేసి న్యాయం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.