Jul 12,2023 23:35

ఐటిడిఎ పిఒ సూరజ్‌ గనోరేకు వినతిపత్రం ఇస్తున్న సిపిఎం నాయకులు, ఆ పార్టీ ప్రజాప్రతినిధులు

ప్రజాశక్తి-కూనవరం
మండలంలో పోలవరం ముంపునకు గురవుతున్న గ్రామాల సమస్యలపై సిపిఎం నాయకులు బుధవారం ఐటిడిఎ పిఒ సూరజ్‌ గనోరేకు వినతిపత్రం అందజేశారు. ముంపునకు గురైన సుమారు 12 గ్రామాల ప్రజలకు భూమి ప్యాకేజీ ఇవ్వలేదని, ఇందులో అధిక శాతం గిరిజనుల భూమి మునిగి పోతుందని, భూమి ప్యాకేజీ తక్షణమే ఇవ్వాలని కోరారు. తరచూ వరదలు వస్తుండడంతో పంటల సాగుకు వీలు లేకుండా సకాలంలో వ్యవసాయం చేయలేదని పరిస్థితి ఉందని, అందువలన భూమికి నష్టపరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వరదలు సంభవిస్తే మండలంలోని శబరి ఏరియాకు సంబంధించి సుమారు 20 గ్రామాలకు కరెంటు సౌకర్యం నిలిచిపోతుందని, గతేడాది వరదల సమయంలో నెల రోజుల పాటు కరెంటు లేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. అందువల్ల విద్యుత్‌ లైన్‌ను ఆర్‌ అండ్‌ బి రోడ్డు వెంట వేయాలని కోరారు. దీనిపై గతంలో కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్ళామని గుర్తు చేశారు. బొజ్జరాయిగూడెంలో మిగిలి ఉన్న 22 మంది యువతీ యువకులను ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీకి అర్హులుగా గుర్తించి ప్యాకేజీ ఇవ్వాలన్నారు. భూమికి భూమి ఇంకా చూపించలేని ఏడుగురు రైతులకు వెంటనే భూమిని చూపించాలని విజ్ఞప్తి చేశారు. మిగతా వారందరికీ ఇచ్చిన భూమిలో ఉన్న రాళ్లు, చెట్లను తొలగించి చదును చేసి సాగునీటి సదుపాయం కల్పించాలని కోరారు. 2022 వరదల్లో మునిగిన ట్రాన్స్‌ఫార్మర్ల వలన విద్యుత్‌ సరఫరాలో లోవోల్టేజీ వస్తుందని, కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు వేసి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. 2018లో జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా మండలంలో మంజూరు చేసిన 60 బోర్లకు సోలార్‌ పేట్లుగాని, విద్యుత్‌లైన్‌గాని ఏర్పాటు చేయాలన్నారు. వీటికి సానుకూలంగా స్పందించిన పిఒ సమస్యల పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ కొమరం పెంటయ్య, పెద్దార్కూర్‌ ఎంపీటీసీ ధర్మల అమ్మాజీ, సర్పంచ్‌ మడకం నాగమణి, కూటూరు సర్పంచ్‌ బొగ్గ వెంకమ్మ, సిపిఎం మండల కార్యదర్శి పాయం సీతారామయ్య, జిల్లా కమిటీ సభ్యులు మేకల నాగేశ్వరరావు, జిల్లా నాయకులు యర్రంశెట్టి శ్రీనివాసరావు, మండల కమిటీ సభ్యులు బాబు బొర్రయ్య, నాయకులు నానుపల్లి వెంకటేశ్వరరావు, పాండురామయ్య, సోడే సుమన్‌ పాల్గొన్నారు.