Sep 19,2023 22:20

నిరుపయోగంగా ఉన్న జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌కు కేటాయించిన భూమి

సాలూరు: ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన జగనన్న స్మార్ట్‌ టౌన్‌ షిప్‌ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మిగిలింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించి ఆరు నెలలు కావస్తున్నా ఇంతవరకూ అతీగతిలేని విధంగా తయారైంది. ఈ ఏడాది మేలో డిప్యూటీ సిఎం రాజన్నదొర, బుడా చైర్‌పర్సన్‌ ఇంటి పార్వతితో సహా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో ఆడంబరంగా జగనన్న స్మార్ట్‌ టౌన్‌ షిప్‌ను ప్రారంభించారు. ఇంతవరకు 30మంది మాత్రమే ప్లాట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. లేఅవుట్‌-1లో 109 ప్లాట్లు, లేఅవుట్‌ -2లో 75ప్లాట్లు వేయాలని అధికారులు నిర్ణయించారు. జాతీయ రహదారి బైపాస్‌ రోడ్డును ఆనుకుని ఉన్న లేఅవుట్‌ కోసం 9.47ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. దీనిలో 150 చదరపు అడుగుల విస్తీర్ణంలో 39 ప్లాట్లు, 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో 35 ప్లాట్లు, 240 చదరపు అడుగుల విస్తీర్ణంలో 3 ప్లాట్లు రూపకల్పన చేశారు. ఈ లేఅవుట్‌లో చదరపు గజం విలువ రూ.5వేలుగా నిర్ణయించారు. దీనిలో పార్కు కోసం 94 సెంట్లు భూమి కేటాయించారు. సుమారు రూ.ఐదు కోట్లతో ఈ లేఅవుట్‌లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రతిపాదించారు. దుగ్దసాగరం లేఅవుట్‌ కోసం 5.4ఎకరాల భూమి సేకరించారు. దీనిలో 75ప్లాట్లు వేయాలని నిర్ణయించారు. దీనిలో చదరపు గజం విలువ రూ.4,800గా నిర్ణయించారు. దీనిలో 54సెంట్లు భూమిలో పార్కు కోసం కేటాయించారు. ఇంటర్నల్‌ రోడ్లు, డ్రెయినేజీ వ్యవస్థ, తాగునీటి, విద్యుత్‌ వంటి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రూ.3.46కోట్లతో ప్రతిపాదించారు. లేఅవుట్ల కోసం రైతుల నుంచి భూములు కొనుగోలు చేసిన తర్వాత బుడా అధికారులు దాన్ని చదును చేసి వదిలేశారు. దీనిలో వంద రూపాయల పని కూడా చేయలేదు. రెండు లేఅవుట్లలో 184 ప్లాట్లకు గాను 30మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. అంటే 50శాతం కూడా దరఖాస్తు చేసుకోలేదు.
బుడా తీరుపై అనుమానాలు
జగనన్న స్మార్ట్‌ టౌన్‌ షిప్‌ ప్రారంభించి ఆరు నెలలు కావస్తున్నా ఇంతవరకు లేఅవుట్లలో ఏ విధమైన అభివృద్ధి పనులు చేపట్టకపోవడంపై దరఖాస్తుదారుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం ప్లాట్‌ విలువలో పది శాతం డబ్బులు దరఖాస్తు సమయంలో చెల్లించారు. దరఖాస్తుదారుల్లో నమ్మకం కలిగించేందుకైనా కనీసం లేఅవుట్లలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టడం లేదు. దీంతో ఈ ప్రాజెక్టు ముందుకు సాగుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.