కేంద్రం లోనూ, రాష్ట్రం లోనూ ప్రభుత్వాలు కొలువు తీరి రెండేళ్లయిన సందర్భంగా రెండు ప్రభుత్వాలూ తాము సాధించిన విజయాల గురించి గొప్పగా చెప్పుకుంటున్నాయి. అయితే ఈ కాలంలో ఈ ప్రభుత్వాల వలన ఉత్తరాంధ్రకు ఒరిగిందేమిటో చూద్దాం.
ప్రత్యేక హోదాతో సహా విభజన చట్టంలోని అనేక అంశాలు ఏడేళ్లయినా ఇప్పటికీ సంపూర్ణంగా అమలుకు నోచుకోలేదు. ఐఐఎం, పెట్రో యూనివర్సిటీ వంటి సంస్థల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. విశాఖ మెట్రో రైలు అటకెక్కింది. గిరిజన యూనివర్సిటీ నిర్మాణమే ప్రారంభం కాలేదు. రైల్వే జోన్ కాగితాలకే పరిమితమై, శతాబ్దపు పైగా చరిత్ర కలిగిన రైల్వే డివిజన్‌ను మాత్రం ఎత్తివేశారు. ఇక ఉత్తరాంధ్ర ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఒక ప్రహసనమే. జిల్లాకు 50 కోట్ల రూపాయల చొప్పున మూడు సంవత్సరాలిచ్చి ఆపేశారు. ఈ 150 కోట్లతో ఎలా అభివృద్ధి సాధ్యమో మెడకాయ మీద తలకాయ వున్నవారిని ఎవరినడిగినా ఇట్టే సమాధానం చెబుతారు. కానీ అదేం విచిత్రమో కానీ, మన కేంద్ర పాలకులు మాత్రం నిస్సిగ్గుగా ఏదో చేసేశామని జబ్బలు చరుచుకుంటున్నారు మినహా మరొకటి లేదు. ఫలితంగా ఈ ఏడేళ్ళ కాలంలోనూ ఉత్తరాంధ్ర మరింత వెనుకబాటు లోకే నెట్టబడింది. పేదరికం, వలసలు మరింతగా పెరిగాయి. ఇవన్నీ చాలవన్నట్లు ఇప్పుడేకంగా రాష్ట్రానికే తలమానికంగా నిలిచి, ఉత్తరాంధ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంటును పూర్తిగా ప్రైవేటీకరిస్తామని నిర్ణయించడం ఈ ద్రోహానికి పరాకాష్ట.
రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రిపోర్టు కార్డుగా తాము ఇచ్చిన హామీలలో 94.5 శాతం అమలు చేసినట్లు, తమ ఈ రెండేళ్ల పాలన సంతృప్తికరంగా ఉన్నట్లు ప్రకటించారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుకు ప్రధాన కారణం నిరక్షరాస్యతతో పాటు, గ్రామీణ పేదరికం, ఉపాధి లేమి. వ్యవసాయం లాభసాటిగా మారేలా నీటి ప్రాజెక్టుల నిర్మాణం, ఉపాధి కల్పించే పారిశ్రామికీకరణ అభివృద్ధికి కనీస అవసరాలు. వీటి గురించి జగన్ పాదయాత్ర సందర్భంగా హామీ కూడా ఇచ్చారు. అయితే, ఈ రెండేళ్ల కాలంలోనూ ఒక్క నీటి ప్రాజక్టు నిర్మాణం కూడా జరగలేదు. ఉత్తరాంధ్రకు జీవనాడిగా నిలిచే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రకటనలకే పరిమితమైంది తప్ప అంగుళం కూడా ముందుకు కదల లేదు. ఉత్తరాంధ్ర లోనే అతి పెద్ద నదిగా ఉన్న వంశధారపై రెండవ దశ నిర్మాణం, మహేంద్ర తనయపై ఆఫ్ షోర్ ప్రాజెక్టు ప్రభుత్వ ప్రాధాన్యతల లిస్టులో ఉన్నా పని మాత్రం ఆ దిశలో లేదు. వంశధారపై ఇటీవల మన ముఖ్యమంత్రి ఒడిషా ముఖ్యమంత్రికి లేఖ రాయడం మినహా పనిలో పురోగతేమీ లేదు. వాస్తవంగా ఈ రెండవ దశ నిర్మాణానికి కేంద్ర ట్రిబ్యునల్ గ్రీన్ సిగల్ ఇచ్చేసింది. అయినా జాప్యం ఎందుకో అర్ధంకాదు. విజయనగరం జిల్లాలో అనేక సంవత్సరాలుగా పెండింగులో ఉన్న జంఝావతి, తారకరామ తీర్థ సాగర్ ప్రాజెక్టుల ఊసే ప్రభుత్వం ఎత్తడం లేదు. జిల్లాలోని తోటపల్లి కాలువల నిర్మాణం కూడా కడవరకు పూర్తి కాలేదు. ఇలా నీటి ప్రాజెక్టులలో ఈ రెండేళ్ల కాలంలోనూ పురోగతేమీ లేదు.
ఉపాధి కల్పించే పారిశ్రామికీకరణ కూడా ఈ కాలంలో ఏమీ లేకపోగా, వీరు హామీ ఇచ్చిన మూతబడ్డ, ముఖ్యంగా జూట్, సుగర్ పరిశ్రమలను తెరిపించడం కూడా జరగలేదు. సరికదా వీరి మంత్రే దగ్గరుండి విశాఖ జిల్లాలోని చిట్టివలస జూట్ మిల్లును పూర్తిగా మూసేసేలా సెటిల్మెంటు చేశారు. నెల్లిమర్ల జూట్ మిల్లు యాజమాన్యం ఇటీవలే లాకౌట్ విధించింది. ఉత్తరాంధ్రలో వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ప్రధాన రంగమయిన జూట్ నేడు పూర్తిగా చతికిలబడిపోయింది. ఉపాధి కల్పన హుష్ కాకే అయింది. పర్యావరణాన్ని నాశనం చేస్తున్న ఫార్మా, రసాయన పరిశ్రమల నుండి రక్షణకు చర్యలేమీ ఈ కాలంలో లేవు. ఇవన్నీ చాలవన్నట్లు ఉత్తరాంధ్ర ప్రజలు మాకొద్దు బాబోరు అని మొర పెట్టుకుంటున్నా వినకుండా గత ప్రభుత్వాల వలె ఈ ప్రభుత్వం కూడా శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో అణు విద్యుత్ ప్లాంటు నిర్మాణానికి ముందుకు సాగుతోంది.
రాష్ట్ర మూడు రాజధానుల ప్రకటనతో విశాఖలో పరిపాలనా రాజధాని వస్తుందని ఇక్కడి ప్రజలు కొంతమందైనా హర్షించారు. అయితే అదింకా కార్య రూపం దాల్చలేదు కానీ, విచిత్రంగా భూ వ్యవహారాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. గత ప్రభుత్వం విశాఖ బీచ్ లో 13.83 ఎకరాల భూమిని లులు మాల్ కు ఇచ్చిన కేటాయింపును రద్దు చేసిన జగన్ ప్రభుత్వం నేడు ఆ భూమిని ఏకంగా వేలానికే పెట్టేసింది. దీనికి తోడు విశాఖ నగరంలోని తహశీల్దార్ కార్యాలయం, ప్రభుత్వ కంటి ఆసుపత్రి, వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం, ప్రభుత్వ ఉద్యోగుల క్వార్టర్స్ వంటివన్నీ ఖాళీ చేయించి మరీ ఆ 15 ఎకరాల భూమిని వేలానికి పెట్టాలని నిర్ణయించింది. గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికున్న 10.39 శాతం వాటాను అదాని సంస్థకు అమ్మేయాలని నిర్ణయించింది. ఇలా చేయడమంటే 2852.26 ఎకరాల భూమిపై ప్రభుత్వానికున్న హక్కు కాస్తా శాశ్వతంగా వదులుకుని, భూమంతా ఆ సంస్థకు ధారాదత్తం చేయడమే. 20 ఎకరాల పురాతన ముడసర్లోవ పార్కును, ఎన్నికైన పాలకమండలి మాట కూడా ఖాతరు చేయకుండా పిపిపి పేరుతో ప్రైవేటు వారికి ఇచ్చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇళ్ల పట్టాల పేరుతో బలవంతపు భూసేకరణకు పూనుకుంది. విశాఖ నగరంలోని 11 వేల ఎకరాలకు చెందిన పంచగ్రామాల భూసమస్యను అధికారం లోనికి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చి, రెండు సంవత్సరాలు గడిచినా ఆ దిశలో ఒక్క ప్రయత్నం కూడా చేయలేదు. విశాఖ స్టీల్‌ప్లాంటు ప్రవేటీకరణను అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించడం ఆహ్వానించదగినదే అయినా, దాని ప్రత్యామ్నాయంగా ఏడు వేల ఎకరాల స్టీల్‌ప్లాంటు భూములను అమ్మాలని, అవసరమైతే స్టీల్‌ప్లాంటు వాటాలు అమ్మకానికి పెట్టాలనే...అడగకుండానే కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన సలహాలు ...అంతిమంగా ప్లాంట్ బలహీనపడడానికే దారితీస్తాయి. శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ వ్యాధి సూపర్ స్పెషాలటి ఆసుపత్రికి స్వయంగా ముఖ్య మంత్రే 2019 లోనే శంకుస్థాపన చేసినా నేటికీ పునాది దశ దాటి ముందుకు వెళ్లలేదు. ప్రతిష్టాత్మక విజయనగరం ఎంఆర్ కాలేజి మూసివేతకు యాజమాన్యానికి సహకరిస్తోంది. గిరిజన ప్రాతంలో కలుషిత నీటితో ప్రజల మరణాలు, రహదార్లు లేక నాటు పడవ ప్రమాద మరణాలు, డోలి మోతలు కొనసాగుతూనే ఉన్నాయి. విశాఖ జిల్లా పాడేరు, అనకాపల్లి, విజయనగరం లలో మెడికల్ కాలేజీల ఏర్పాటు స్వాగతించవలసిందే కానీ, వీటికి సరిపడా నిధులు సమకూర్చకపోతే, నీటి ప్రాజెక్టుల గతే వీటికి కూడా పడుతుందా అనే సందేహం కలగక మానదు.
వెరసి ఈ రెండేళ్ల కాలంలో కూడా ఉత్తరాంధ్ర మరింత వెనుకబాటులోకే నెట్టబడింది. అభివృద్ధి సాధించడానికి కేవలం పథకాలు, ప్రణాళికలు, ప్రకటనలు, ఆదేశాలే చాలవు. వాటన్నింటిని ఆచరణలో పెట్టగలిగే నిధులు కూడా అవసరం. సంక్షేమ పథకాలు తాత్కాలిక ఊరటను మాత్రమే ఇస్తాయి. ప్రజల ఆదాయాలు పెరిగే మార్గాల ద్వారా మాత్రమే రాష్ట్ర ఆర్థిక మంత్రి స్థిరమైన శాశ్వత అభివృద్ధి సాధ్యం. ఇప్పటికీ రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలన్నీ అమలు చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. రాష్ట్ర ప్రజల హక్కుగా ఉన్న ప్రత్యేక హోదా, విభజన చట్టం అమలు, అభివృద్ధి నిధులు వంటివి సాధించుకునేలా కేంద్రంపై ఒత్తిడి తేవడం నేడవసరం. అందుకు ప్రజల సహకారం తీసుకోవాలి. అలా కాకుండా మరిన్ని అప్పులు చేయడం, ప్రజలపై భారాలు వేసే మార్గాన్నేగనుక రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకుంటే అది అంతిమంగా ప్రజలకు శాపంగానే పరిణమిస్తుంది.
- / వ్యాసకర్త ఉత్తరాంధ్ర వేదిక ప్రధాన కార్యదర్శి /










