
ప్రజాశక్తి-తాడేపల్లి : పని ఒత్తిడి, అధికారుల వేధింపుల కారణంగా మృతి చెందిన ఆశా కార్యకర్త కృపమ్మ కుటుంబానికి న్యాయం కోసం చేపట్టిన పోరాటం ఫలించింది. యూనియన్ నాయకులతో శనివారం చర్చించిన అధికారులు పలు డిమాండ్లను అంగీకరించడంతో ఆందోళనను విరమిస్తున్నట్లు నాయకులు ప్రకటించారు. అయితే అంతకుముందు స్థానిక ప్రకాష్‌నగర్ వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్ సమీపంలో ఎపి ఆశ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆశాలు ఆందోళన చేపట్టగా సిఐ శేషగిరిరావు తన సిబ్బందితో వచ్చి యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కె.ధనలక్ష్మి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజీతో పాటు పలువుర్ని తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌కు బలవంతంగా తరలించారు. కృపమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు పోలీస్‌స్టేషన్ ముందే రోడ్డుపై బైటాయించారు. సిఐటియు నాయకులతో పాటు ఆశ కార్యకర్తలు, టిడిపి పట్టణ అధ్యక్షులు వి.వెంకట్రావు ఆందోళనలో పాల్గొన్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు యూనియన్ పిలుపు నేపథ్యంలో శనివారం ఉదయమే ఆశా కార్యకర్తలు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వచ్చేందుకు సిద్ధమవడంతో పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఉదయం ఆరు గంటలప్పుడు ధనలక్ష్మిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ వ్యాన్‌లోకి ఎక్కించారు. అడ్డుపడిన ఆశ కార్యకర్తలను పక్కకు నెట్టివేశారు. ఆమెను ఎక్కడకు తీసుకెళ్తున్నారో మధ్యాహ్నం వరకూ వెల్లడించలేదు. మరో గంట తర్వాత సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజీ, తాడేపల్లి పట్టణ కార్యదర్శి వి.దుర్గారావు, నాయకులు బి.వెంకటేశ్వర్లు, కె.కరుణాకరరావు, కె.బాబూరావు, టిడిపి పట్టణ కార్యదర్శి వి.వెంకట్రావులతో పాటు మరో నలుగురు ఆశ కార్యర్తలను అరెస్టు చేసి దుగ్గిరాల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులకు, నాయకులకు, ఆశ కార్యకర్తలకు పెనుగులాట జరిగింది. పరిస్థితి ఉధృతంగా మారుతుందనుకున్న అధికారులు జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడారు. నల్లపాడు పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లిన ధనలక్ష్మిని తిరిగి తాడేపల్లి తీసుకొచి జిల్లా అధికారులతో చర్చించారు. చర్చల అనంతరం ధనలక్ష్మి మాట్లాడుతూ ఇది ఆశా కార్యకర్తల పోరాట విజయమని చెప్పారు. మెడికల్, మెటర్నటీ సెలవులతో పాటు పండుగలు, ఆదివారాలకూ సెలవులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు, ఐద్వా రాష్ట్ర నాయకులు డి.శ్రీనివాసకుమారి, సిపిఎం నాయకులు డి..వెంకటరెడ్డి మాట్లాడుతూ ఆశా కార్యకర్తలతో గొడ్డు చాకిరి చేయిస్తున్నారని మండిపడ్డారు. పైగా రూ.10 వేల వేతనాలతో కుటుంబాలు ఎలా గడుస్తాయని ప్రశ్నించారు. ఈ సమస్యలపై ఆశాలు స్ఫూర్తి, ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ప్రజాశక్తి - దుగ్గిరాల : అధికారుల ఒత్తిడి వల్లనే ఆశ వర్కర్ రేపూడి కృపమ్మ విధి నిర్వహణలో కుప్పకూలి మరణించారని, ఆమె మృతికి ప్రభుత్వం బాధ్యత వహించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజీ డిమాండ్ చేశారు. తాడేపల్లిలో ఆందోళన చేస్తున్న వారిని దుగ్గిరాల పోలీస్‌స్టేషన్‌కు తరలించగా వీరిని సిపిఎం, ప్రజాసంఘాల నాయకులు జె.బాలరాజు, ఎన్.యోగేశ్వరరావు ఎం.నాగమల్లేశ్వరరావు, సిహెచ్ పోతురాజు, టిడిపి నాయకులు వి.శ్రీకష్ణ ప్రసాద్, ఎన్.చిరంజీవి, వి.సుధాకర్, ఎన్.రవి పరామర్శించారు. ఈ సందర్భంగా నేతాజి మాట్లాడుతూ నాయకులు లేకుండా అందరిని బెదిరించి కృపమ్మ అంతక్రియలు నిర్వహించాలనే ఉద్దేశంతో అక్రమ అరెస్టులు చేశారన్నారు. ఆశ వర్కర్లకు సెలవులేమీ ఇవ్వడం లేదని, ప్రభుత్వ పరంగా బీమ సౌకర్యాలు కల్పించడం లేదని చెప్పారు. ఈ అంశాలపై రెండేళ్లుగా పోరాడుతున్నా ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడం దారుణమని విమర్శించారు.