ప్రజాశక్తి-చింతూరు
రానున్న జూలై, ఆగస్టు నెలలో వచ్చే వరదలకు ముందస్తు చర్యలు చేపట్టాలని కోరుతూ సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఐటీడీఏ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు ఎర్రంశెట్టి శ్రీనివాసరావు. సీసం సురేష్, పల్లపు వెంకట్ మాట్లాడుతూ గతేడాది వరదల వల్ల నిర్వాసితులు తీవ్ర ఇబ్బంది పడ్డారని, అందువల్ల ఈ ఏడాది వరద ప్రమాద హెచ్చరికలను ముందుగానే తెలియజేస్తూ ఉండాలని కోరారు. వరదల సమయంలో వాహనాలు, రవాణా సౌకర్యం కల్పించి తరలించాలని, ముందుగానే పడవలను లాంచీలను గ్రామాల వద్దకు చేర్చి ఉంచాలని, వరద బాధితులకు సరిపడా ముందస్తు షెల్టర్లు ఏర్పాటు చేయాలని, షెల్టర్లు, జనరేటర్లు, కిరోసిన్, కొవ్వొత్తులు సిద్ధం చేయాలని డిమాండ్ చేశారు. యుద్ధ ప్రాతిపదికన చటి నుండి సింగన్నగూడెం రెడ్ క్రాస్ వరకు, తుమ్మల, వేకవారిగూడెం మీదుగా బురదగుడం వరకు, కుందులూరు నుండి కొండపల్లి గమలకోట చదలవాడ మీదుగా తులసిపాక వరకు, ఏడుగురాళ్లపల్లి నుండి తాటిలంక మీదుగా బొదునూరు కోతులుగుట్ట వరకు, కూనవరం మండలం పొట్లవాయ గూడెం నుండి బొదునూరు వరకు రోడ్లు వేయాలని, ఉన్నవాటికి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. చింతూరు ఐటిడిఎకు పూర్తిస్థాయి ప్రాజెక్టు అధికారిని నియమించాలని కోరారు. అనంతరం ఐటీడీఏ అధికారికి డిమాండ్స్‌తో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మల్లం సుబ్బమ్మ, ముర్రం రంగమ్మ, పోడియం లక్ష్మణ్, కారం సుబ్బారావు, పల్లపు పెద్ద రాములు, శ్యామల తమ్మయ్య, పాండు చిన్న నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
ఎటపాక : వరద సహాయక చర్యలు ముందస్తుగా చేపట్టాలని సిపిఎం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ వేణుగోపాల్‌కి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి ఐ వి మాట్లాడుతూ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో గత వరదల సమయంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని తెలిపారు. అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తుగా చేపట్టాలన్నారు. ఎఎన్‌ఎంలకు, హెల్త్ వర్కర్లకు, అంగన్వాడీలకు హెల్త్ ట్రైనింగ్ ఇవ్వాలని, పాముకాటు, కుక్కకాటు మందులు అందుబాటులో ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆకిశెట్టి రాము, సోయం వీరమ్మ, నూతలపాటి సుధాకర్ రావు, అపకా సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.
సిపిఎం ప్రజా ప్రతినిధుల నిరాహార దీక్ష
విఆర్.పురం : ముందస్తుగా వరద సహాయక చర్యలు చేపట్టాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యాన ఆ పార్టీ ప్రజాప్రతినిధులు సోమవారం విఆర్.పురం మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. ఎంపిపి కారం.లక్ష్మితో పాటు సిపిఎం సర్పంచ్‌లు, ఎంపిటిసి సభ్యులకు సిపిఎం జిల్లా నాయకులు పూనెం సత్యనారాయణ, మండల కార్యదర్శి సోయం చినబాబు పూలదండలు వేసి దీక్షలను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ మండలంలోని రామవరం, ములకనపల్లి, పెద్దమట్టపల్లి, రేఖపల్లి, శ్రీరామగిరి, జీడిగుప్ప ప్రాంతాలలో బఫర్ స్టాక్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వరదల సమయంలో మండల కేంద్రంలో కరెంట్ లేకపోవడం వల్ల ప్రజల నుండి అధికారులు సమాచారం తెలుసుకోవాలన్నా సాధ్యం కావడం లేదని, అందువల్ల చింతూరు నుంచి కుందులూరు మీదుగా పాత విద్యుత్ లైన్ ఉండేదని, ఆ లైన్‌ను పునరుద్ధరించి పెద్దమట్టపల్లి, రేఖపల్లి, వరకు కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత వరదలకు నష్టపరిహారం ఇవ్వని కుటుంబాలకు తక్షణమే చెల్లించాలన్నారు. సాయంత్రం మండల తహశీల్దారు ఎన్.శ్రీధర్ దీక్షా శిబిరం వద్దకు వచ్చి వినతిపత్రం స్వీకరించారు. పై డిమాండ్లను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అనంతరం ప్రజాప్రతినిధులకు నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి సభ్యులు పూనెం ప్రదీప్ కుమార్, సర్పంచ్‌లు పులి సంతోష్ కుమార్, వెట్టి లక్ష్మి, పూనెం సరోజిని, గొల్లగూడెం వార్డు సభ్యులు కట్టం లక్ష్మి, నాళ్లరపు భారతి, పంకు సత్తిబాబు, పొడియం శ్రీరామూర్తి, వడ్లది రమేష్, కారం సుందరయ్య, కుంజ నాగిరెడ్డి, చిక్కాల రామారావు, నాళ్లరపు ప్రకాశరావు, కుర్షం నాగేశ్వరరావు, ఆసు లక్ష్మయ్య, ముసలి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.










