ప్రజాశక్తి - బుట్టాయగూడెం
త్వరలో వర్షాకాలం రానున్న నేపథ్యంలో పోలవరం నిర్వాసిత గ్రామాలను మరోసారి గోదావరి వరదలు ముంచెత్తే ప్రమాదం ఉందని, సహాయ కార్యక్రమాల కోసం ముందస్తు చర్యలు తీసుకుని యంత్రాంగాన్ని సమాయత్తం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం బుట్టాయగూడెం ఆదివాసీ విజ్ఞాన కేంద్రంలో సిపిఎం ముఖ్య కార్యకర్తల సమావేశంకు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తెల్లం రామకృష్ణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం జూలైలో గోదావరికి వచ్చిన వరదల నష్టాల నుండి ప్రజలు ఇప్పటి వరకూ కోలుకోలేదన్నారు. పోలవరం మునక ప్రాంతాల్లోని ఎనిమిది మండలాల ప్రజలు ఎలాంటి అభివృద్ధికీ, సంక్షేమానికీ నోచుకోక అడవుల్లో చెట్లు, పుట్టలపాలై బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికాకముందే గత జూలైలో వరదలతో వందలాది గ్రామాలు మునిగిపోయాయని, వరదల్లో మునిగిపోయిన గ్రామాల ప్రాతిపదికపై పోలవరం నిర్వాసితుల పునరావాసానికి చర్యలు తీసుకోవాలని ఆనాటి నుండి సిపిఎంతో సహా వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెడచెవిన పెట్టాయని కేంద్రం, ఏజెన్సీ గిరిజన ప్రజలకు ఎలాంటి సహాయం అందించకుండా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.
పునరావాసానికి నిధులు ఇవ్వలేదని, రాష్ట్ర ప్రభుత్వం రీసర్వే పేరుతో మరో 32 గ్రామాలను కొత్తగా చేర్చి 41.15 మీటర్ల వద్ద మునుగుతాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రామాలకు వాస్తవంగా గత వరదల్లో మునిగిన గ్రామాలకు పొంతనే లేదన్నారు. గత వరదల సమయంలో 150 గ్రామాలు ముంపునకు గురయ్యాయని, పునరావాస కాలనీలు సైతం ఈ వరదల్లో మునిగాయనే వాస్తవాన్ని గమనిస్తే ఈ కాంటూరు లెక్కలన్నీ తప్పుల తడకలేనని విమర్శించారు. కాంటూరు లెక్కలు తప్పని గత వరదలే ప్రామాణికమన్నారు. శాస్త్రీయ ప్రాతిపదికపై రీసర్వే చేసి దాని ఆధారంగా అన్ని గ్రామాలకు పూర్తిస్థాయి పునరావాస చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సిఎం జగన్ అధికారంలోకి రావడంతోనే నష్టపరిహారాన్ని 6.5 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచుతామని వాగ్దానం చేశారే కానీ, నేటి వరకూ అమలు చేయలేదన్నారు. ఈ నాలుగేళ్లలో భూముల విలువ మరింత పెరిగినా, ఆ విలువల ప్రకారం ఎకరాకు రూ.20 లక్షలు ఇవ్వాలన్నారు.2023 సెప్టెంబర్ వరకూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ పునరావాస ప్యాకేజీని అందించాలని కోరారు.నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని సిపిఎం ఆధ్వర్యంలో అల్లూరి జిల్లా ఎటపాక మండలం నెల్లిపాకలో జూన్ 20 నుండి జూలై పదో తేదీ వరకూ విజయవాడకు మహాపాదయాత్ర నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను పునరావాస కేంద్రాలకు తరలించి ఏళ్లు గడుస్తున్నా కనీసం సదుపాయాలు కల్పించలేదన్నారు. కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ తాగునీరు, ట్రాక్టర్ ట్యాంకర్‌తో నిర్వాసితులకు సరఫరా చేస్తున్నారనిచెప్పారు. పునరావాస కాలనీలకు శ్మశాన వాటికలు లేవని, బడి, అంగన్వాడీ, ఆసుపత్రి, షాపింగ్ కాంప్లెక్స్ తక్షణమే నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈనెల 12న తహశీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్ష చేపడుతు న్నామని చెప్పారు. ఈ పాదయాత్రకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు మొడియం నాగమణి, జిల్లా కమిటీ సభ్యులు జి.వెంకట్రావు, టి దుర్గారావు, వై.నాగేంద్రరావు, టి ముత్యాలమ్మ, డి.రమేష్, ఎం.జీవరత్నం, టి.సత్యనారాయణ, పి.మంగరాజు, కె.శ్రీనివాస్, ఎ.ఫ్రాన్సిస్, ఎం.దుర్గారావు, పి.నాగేశ్వరావు, ఎస్.బుల్లెమ్మ, ఎస్.రాంబాబు పాల్గొన్నారు.










