Sep 14,2023 20:37

ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్‌ : జిల్లాలోని వినాయక చవితి వేడుకల్లో కీలకమైన పందిళ్లు, మండపాల ఏర్పాటు కోసం సంబంధిత పోలీస్‌ స్టేషన్‌లో ముందస్తు అనుమతి తప్పనిసరని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రానున్న వినాయక చవితి వేడుకలు సందర్భంగా పాటించాల్సిన నిబంధనలు, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు వివరించారు. పోలీస్‌ అనుమతి లేకుండా విగ్రహలు ఏర్పాట్లు చేయరాదన్నారు. వీటితో పాటు ఫైర్‌, విద్యుత్‌ శాఖల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఏవైనా మార్పులుంటే తక్షణమే స్ధానిక పోలీస్‌లకు తెలియపర్చాలన్నారు. పందిళ్లు, మండపాల వద్ద శబ్ధకా లుష్య క్రమబద్దీకరణ, నియంత్రణ నింబంధనల ప్రకారం స్పీకర్లను ఉపయోగించాలన్నారు. వినాయక పందిళ్లు గాని, విగ్రహం పెట్టే ప్రదేశం గానీ రోడ్డుపైన ఉండరాదు. ఉత్సవాల్లో బాణా సంచాను ఉపయోగించరాదని, ఊరేగింపు సమయంలో పోలీసుల అనుమతి లేకుండా వేషధారణలు, డిజెలు తదితరాలకు అనుమతి లేదని పేర్కొన్నారు. సాలూరు : రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారమే పట్టణంలో వినాయక చవితి సంబరాలు నిర్వహించుకోవాలని టౌన్‌ సిఐ సిహెచ్‌ శ్రీనివాసరావు సూచించారు. గురువారం టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ, ప్రయివేటు స్థలాల్లో వినాయక చవితి మండపాలు ఏర్పాటు చేసినట్లయితే సంబంధించిన స్థలం యజమాని అనుమతి విధిగా తీసుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో టౌన్‌ ఎస్‌ఐ భాస్కరరావు వున్నారు. గరుగుబిల్లి: వినాయక చవితి వేడుకలలో కీలకమైన పందిళ్లు, మండపాలు ఏర్పాటు కోసం పోలీస్‌ స్టేషన్‌లో అనుమతి తీసుకోవాలని ఎస్‌ఐ ఎం. రాజేష్‌ తెలిపారు. రానున్న వినాయక చవితి వేడుకలు సందర్భంగా పాటించాల్సిన నియమ నిబంధనలు, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు తెలియజేసారు. సీతానగరం : ఈ నెల 18 నుంచి వినాయక చవితి ఉత్సవాలకు పోలీసులు అనుమతులను తప్పక తీసుకోవాలని ఎస్‌ఐ కే నీలకంఠం అన్నారు. గురువారం పత్రిక విలేకరులతో మాట్లాడుతూ ఉత్సవాల నిర్వహణకు పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు.