Jul 10,2023 00:07

పొలాల్లో నిలిచిన నీరు

ప్రజాశక్తి - దుగ్గిరాల : వర్షాలకు ముందే పొలాల్లోకి నీరు చేరింది. బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో పంటలు ఎలా వేసుకోవాలో తెలియక రైతులు అవస్థలు పడుతున్నారు. దుగ్గిరాల మండల పరిధిలోని మంచికలపూడిలో సిసిఎల్‌ ఫ్యాక్టరీ, రైల్వే ట్రాక్‌ మధ్యలో సుమారు 100 ఎకరాలకుపైగా పొలాలున్నాయి. వీటిల్లోకి ఖరీఫ్‌లో వరి, అనంతరం బెండ, మొక్కజొన్న పంటలు సాగు చేస్తుంటారు. ఈ పొలాలకు మోరంపూడి సమీపంలోని కాల్వ నుండి నీరు వస్తుంది. ఈ నీరు మగ్గిన కాల్వ ద్వారా బయటకు వెళుతుండేది. ఈ ఏడాది మూడో రైల్వేలైను వేసే క్రమంలో నీరు బయటకు వెళ్లే తూమును పూడ్చేయడంతో వందల ఎకరాల్లో నీరు బయటకు వెళ్లే మార్గం లేక పొలాల్లోనే నీలిచింది. రెండో పంట ముగియడంతో ఖరీఫ్‌కు విత్తనాలు వేసుకునేందుకు పంటలు సిద్ధం చేసుకోవాలంటే పొలాల్లో నీరు అడ్డుగా ఉంది. మరోవైపు వర్షాలు లేక రైతులు ఇంకా నార్లు పోసుకోలేదు. ఇప్పుడు నీరు నిలిచిపోవడంతో సాగు కష్టమవుతోంది. సీజన్‌ దాటిపోతుందనే భయం రైతుల్లో నెలకొంది. సీజన్‌కు ముందే నీరు నిలిచిపోవడంతో ఇక వర్షాలు వస్తే ఆ ప్రాంతం మొత్తం చెరువులా మారుతుందని, సాగు కష్టమవుతుందని రైతులు ఆందోళనతో ఉన్నారు. ఉపాధి హామీ పనులు చేయించినా ఈ పొలాలకు సంబంధించిన కాల్వపై అధికారులు దృష్టి సారించలేదు. ఇప్పటికైనా స్పందించి నీరు బయటకు వెళ్లే విధంగా ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.
నీరు బయటకు పోయేలా చూడాలి
వై.బ్రహ్మేశ్వరరావు, రైతు సంఘం మండల కార్యదర్శి.

మంచికలపూడిలోని పొలాల్లో నిలిచినపోయిన నీరు బయటకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలి. సాగుకు ముందే పొలాలు ముంపునకు గురైతే పంటలు ఎలా వేసుకోవాలి. నీరు బయటకు వెళ్లే మార్గం లేదని తెలిసినా అధికారులు స్పందించకపోవడం సరికాదు. దీనిపై అధికారులు వెంటనే స్పందించి నీరు బయటకు పోయేలా చర్యలు తీసుకోకుంటే ఆందోళనకు దిగుతాం.