Jul 26,2023 22:20

కె.గోపాలపురం-ఎస్‌.గోపాలపురం మధ్యలో కాజ్‌వేపై ప్రవహరిస్తున్న మహేంద్ర తనయా వరద నీరు

- వాయుగుండం ప్రభావంతో జిల్లాలో విస్తారంగా వర్షాలు
- మహేంద్రతనయలో పెరిగిన వరద ప్రవాహం
- పాతపట్నంలో నీట మునిగిన కాజ్‌వే
- రాష్ట్రంలోనే అత్యధికంగా తామాడలో వర్షపాతం
- శ్రీకాకుళంలో జలమయమైన ఆర్‌టిసి కాంప్లెక్స్‌
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: 
బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. కొన్నిచోట్ల భారీ వర్షపాతం నమోదైంది. ఒడిశాలో కురుస్తున్న వర్షాలతో మహేంద్రతనయ నదిలోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో పంట పొలాలు నీటమునిగాయి. శ్రీకాకుళంలో భారీగా వర్షం కురవడంతో ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. ఆర్‌టిసి కాంప్లెక్స్‌లోకి నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో జిల్లాలో ఒక్కసారిగా సగటు వర్షపాతం అమాంతంగా పెరిగింది. పలు ప్రాంతాలు వర్షాభావ పరిస్థితుల నుంచి గట్టెక్కాయి.
వాయుగుండం ప్రభావంతో జిల్లాలో పలుచోట్ల కుండపోత వర్షం కురిసింది. లావేరు మండలం తామాడలో రాష్ట్రంలోనే అత్యధిక వర్షం కురిసింది. సాయంత్రం ఏడు గంటల సమయానికి 187.75 మి.మీ అత్యధిక వర్షపాతం నమోదైంది. ఎచ్చెర్లలో 140.5 మి.మీ వర్షం కురిసింది. నరసన్నపేటలో 109.5 మి.మీ, రణస్థలం మండలం పైడిభీమవరంలో 107.5 మి.మీ, ఆమదాలవలస మండలం మెట్టక్కివలసలో 92 మి.మీ, కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో 91 మి.మీ, ఆమదాలవలసలో 88.25 మి.మీ వర్షం కురిసింది. శ్రీకాకుళంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంతంలో 87.25 మి.మీ, నరసన్నపేటలో 86.75 మి.మీ వర్షం పడింది. ఇచ్ఛాపురం మండలం బొడ్డపడలో అత్యల్పంగా 2.5 మి.మీ వర్షం పడింది. వంశధార, నాగావళిలో నదులు సాధారణ స్థితిలోనే ప్రవహిస్తున్నాయి. హిరమండలం గొట్టాబ్యారేజీలోకి 8,500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, అంతే పరిమాణంలో కిందికి వదులుతున్నారు. కుడి, ఎడమ కాలువలకు నీటిని ఆపేశారు.
పాతపట్నంలో నీట మునిగిన కాజ్‌వే
ఒడిశాలో కురుస్తున్న వర్షాలతో మహేంద్రతనయలో 450 క్యూసెక్కుల వరద ప్రవాహం పెరిగింది. మహేంద్రతనయ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పాతపట్నం సమీపంలోని కాజ్‌వేపై నుంచి భారీ వరద నీరు ప్రవహించింది. దీంతో కె.గోపాలపురం, హెచ్‌.గోపాలపురం గ్రామాలకు పాతపట్నం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. పాతపట్నం గ్రామంలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో జనం ఇబ్బందులు పడ్డారు.
శ్రీకాకుళం నగరాన్ని ముంచెత్తిన వాన
శ్రీకాకుళం నగరంలో ఉదయం నుంచి రాత్రి వరకు పలుదపాలుగా కురిసిన వాన శ్రీకాకుళం నగరాన్ని ముంచెత్తింది. వీధులన్నీ వర్షపునీటితో నిండిపోయాయి. ప్రధాన రోడ్లపై వర్షపు నీరు పొంగిపొర్లింది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. కత్తెరవీధి, మండలవీధి, పి.ఎన్‌ కాలనీ, విశాఖ బి కాలనీ, డిసిసిబి కాలనీలు వర్షపు నీరు పోటెత్తింది. జిల్లా కేంద్రంలోని పలు ప్రధాన రహదారులు సైతం నీట మునిగాయి. కళింగరోడ్డు, పాతబస్టాండ్‌, లకీëటాకీస్‌ ప్రాంతం, వన్‌వే ట్రాఫిక్‌ రోడ్డు, జిటి రోడ్డు, కృష్ణాపార్కు, రైతుబజారు తదితర రోడ్లతో పాటు పలు వీధులు, కాలనీలు జలమయమయ్యాయి. హడ్కోకాలనీలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో జనం అవస్థలు పడ్డారు.
ఆర్‌టిసి కాంప్లెక్స్‌ జలమయం
శ్రీకాకుళం నగరంలో కురిసిన భారీ వర్షానికి ఆర్‌టిసి కాంప్లెక్స్‌ నీటమునిగింది. కాంప్లెక్స్‌లోకి సమీప ప్రాంతం నుంచి వర్షపు నీరు చేరడంతో కాంప్లెక్స్‌ ప్రాంగణం జలమయమైంది. దీనికితోడు కాలువలు పొంగిపొర్లడంతో మోకాలు లోతు మేర వర్షపు నీరు చేరింది. కాంప్లెక్స్‌లోకి ఏకంగా వర్షపు నీరు చొచ్చుకుపోయింది. మురుగునీటిలోనే ప్రయాణికులు, ఆర్‌టిసి సిబ్బంది రాకపోకలు సాగిస్తూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఖరీఫ్‌ సాగుకు సానుకూలం
జిల్లాలో పడుతున్న వర్షాలు ఖరీఫ్‌ సాగుకు సానుకూలంగా మారనున్నాయని వ్యవసాయశాఖ అధికారులు చెప్తున్నారు. జిల్లాలో ఖరీఫ్‌ ప్రారంభమైన జూన్‌ ఒకటో తేదీ నుంచి ఈనెల 26 వరకు సాధారణంగా 282.3 మి.మీగా వర్షపాతం నమోదవుతుంది. ప్రస్తుతం 328.4 మి.మీ వర్షం కురిసి 16.3 శాతం అదనంగా వర్షపాతం నమోదైంది. జిల్లాలోని 30 మండలాలకు గానూ 16 మండలాలు అధిక వర్షపాతం నమోదైన కేటగిరీలో ఉన్నాయి. తొమ్మిది మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా, ఐదు మండలాలు వర్షపాతం లోటు జాబితాలో ఉన్నాయి. ఈనెల 24వ తేదీ నాటికి జిల్లాలో ఏడు మండలాల్లో అధిక వర్షపాతం, 11 మండలాల్లో సాధారణ వర్షపాతం జాబితాలో ఉండేవి. వర్షపాతం లోటు జాబితాలో 11, తీవ్ర వర్షపాత లోటు కేటగిరీలో ఒక మండలం ఉండేది.
మండలం ప్రాంతం వర్షపాతం (మి.మీ)
శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా కళాశాల 78.75
శ్రీకాకుళం బలగ 76.75
రణస్థలం గరికపాలెం 67.75
శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల 65.75
రణస్థలం పైడిభీమవరం 63.25
లావేరు లావేరు 60.50
శ్రీకాకుళం ఆర్‌అండ్‌బి గెస్ట్‌హౌస్‌ 61.75
గార గార 58.25
గార తూలుగు 58
ఆమదాలవలస తిమ్మాపురం 56
ఆమదాలవలస మెట్టక్కివలస 53.75
ఆమదాలవలస ఆమదాలవలస 52.75
సరుబుజ్జిలి విజయరామపురం 40.0
లావేరు లావేరు 46.75
నరసన్నపేట నరసన్నపేట 34.75
కోటబొమ్మాళి నిమ్మాడ 22
టెక్కలి రావివలస 21.0
సంతబొమ్మాళి సంతబొమ్మాళి 26.25
హిరమండలం గొట్టాబ్యారేజీ 20.75
కోటబొమ్మాళి కోటబొమ్మాళి 20.75
జి.సిగడాం జి.సిగడాం 19.50
నందిగాం మదనాపురం 17.0
సోంపేట బాతుపురం 15.25
మందస హరిపురం 14
బూర్జ కొల్లివలస 12.75
కవిటి రాజపురం 12.75
పలాస పలాస 11.5
కంచిలి ఎం.ఎస్‌ పల్లి 11