Oct 02,2023 00:23

జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ లక్ష్మానాయక్‌

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : ఐదేళ్ల లోపు చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం ముమ్మరంగా జరుగుతున్నట్టు జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ భూక్యా లక్ష్మా నాయక్‌ తెలిపారు. జాతీయ వ్యాధి నిరోధక టీకాల ప్రోగ్రాం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచేందుకు కృషి చేస్తున్నామన్న ఆయన ప్రజాశక్తికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలు తెలిపారు.
జిల్లా జనాభా, వారిలో చిన్నారులు ఎంతమంది?
జిల్లా జనాభా 23 లక్షలు కాగా ఇందులో ఐదేళ్లలోపు చిన్నారులు దాదాపు 1,45,000 మంది ఉన్నారు. అప్పుడే పుట్టిన బిడ్డ వయసు నుండి ఐదేళలలోపు పిల్లలకు అందరికీ తొమ్మిది రకాల వ్యాధి నిరోధక టీకాలను అందిస్తున్నాం. టీకాల ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతోంది.
ఏయే టీకాలు, ఎప్పుడువేయించాలి?
జాతీయ వ్యాధి నిరోధక టీకాల పంపిణీ కార్యక్రమంలోనే గర్భిణులకు టిడి టీకాలు మూడు డోసులు ఇస్తాం. గర్భిణిగా ఉన్నప్పుడు నాలుగో నెల నుండి నెల రోజుల గ్యాప్‌తో మూడు డోస్‌ల టిడి వ్యాక్సిన్‌ ఇస్తారు. డెలివరీ తరువాత తొలి దశలో తల్లి, బిడ్డలకు ధనుర్వాతం రాకుండా టీకా వేయించడం ద్వారా ఇరువురికి కాపాడగలుగుతాం. ముఖ్యంగా మిషన్‌ ఇంద్రధనస్సు అనే ప్రోగ్రామ్‌ ద్వారా దశలవారీగా ఐదేళ్లలోపు పిల్లలకు ఇవ్వాల్సిన వ్యాధి నిరోధక టీకాలన్నీ కూడా ఇస్తూ ప్రజలలో వీటిపై అవగాహన కల్పిస్తున్నాం. వ్యాధి నిరోధక టీకాల షెడ్యూల్‌ను బట్టి అప్పుడే పుట్టిన శిశువు (ఫస్ట్‌ డే) వయసు వారికి ఓపివి '0' డోస్‌ వేస్తారు. అదే రోజు బీసీజీ అనే వ్యాక్సిన్‌ కూడా ఇస్తారు. హెపటైటిస్‌ బి కూడా అదే రోజు ఇస్తారు. ఆ తర్వాత ఆరువారాల వయస్సు ఉన్నప్పుడు ఓరల్‌ పోలియో ఒక డోస్‌, ఆర్‌వివి ఒక డోసు, ఎఫ్‌ఐసిబి ఒక డోస్‌, పెంటావాలెంట్‌ మొదటి డోసు, పిసివి డోస్‌ ఇస్తారు. అదేవిధంగా 10 వారాల వయసు లో ఓరల్‌ పోలియో వ్యాక్సిన్‌ రెండో డోసు, ఆర్‌వివి రెండో డోసు, పెంటావాలంట్‌ రెండవ డోసు ఇవ్వాలి. ఆ తర్వాత 14 వారాల వయస్సులో ఓరల్‌ పోలియో వ్యాక్సిన్‌ మూడో డోసు, ఆర్‌వివి మూడవ డోస్‌, ఎఫ్‌ఐపివి రెండవ డోసు, పెంటావాలెంట్‌ మూడోవ డోసు, పిసివి రెండవ డోస్‌ ఇస్తారు. 9 నుంచి 12 నెలల మధ్య వయస్సులో బిడ్డకు ఎంఆర్‌ మొదటి డోస్‌, పిసివి బూస్టర్‌ డోస్‌ మొదటి డోసు ఇస్తాం. 16-24 నెలల మధ్య ఆ బిడ్డకు ఒపివి బూస్టర్‌ బూస్టర్‌ డోర్‌ డోసు ఇస్తాం.
గరిష్టంగా ఎన్నేళ్ల వరకు టీకాలు ఇస్తారు?
16 ఏళ్ల వయస్సు వచ్చే వరకు వివిధ రకాల టీకాలు అందిస్తున్నాం. బిడ్డ వయస్సు ఐదు నుండి ఆరేళ్ల మధ్య ఉన్నప్పుడు ఆ బిడ్డకు ఇవ్వాల్సిన టీకాలలో డిపిటి బూస్టర్‌ డోస్‌ రెండవది ముఖ్యమైంది. మొత్తంగా పిల్లల విషయంలో వ్యాధి వచ్చిన తరువాత చికిత్స చేయించుకోవడం కంటే వ్యాధి రాకుండా జాగ్రత్తలు పడటమే ఎంతో ముఖ్యం. అంటే వ్యాధులు వచ్చినప్పుడు శారీరకంగా ఆర్థికంగా ఇబ్బందులు పడటం కంటే ముందే అవి రాకుండా వాటి నివారణ కోసం ప్రివెంటివ్‌ పర్పస్‌ వ్యాక్సిన్స్‌ తీసుకోవడం ద్వారా శరీరంలో డిఫెన్స్‌ మెకానిజాన్ని పెంచడం కోసం ఈ వ్యాక్సిన్‌ తీసుకోవడం ఎంతో ముఖ్యం. అప్పుడే పుట్టిన బిడ్డ వయసు నుండి ఐదేళ్లలోపు తొమ్మిది రకాల వ్యాధి నిరోధక టీకాలను ఇవ్వడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచి సమాజంలో రాబోయే కాలంలో వారి సంపూర్ణ ఆరోగ్యానికి పునాది వేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఆ తర్వాత 10 సంవత్సరాల నుండి 16 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నప్పుడు వేయవలసిన టీకాలు అదేవిధంగా కౌమార దశలో ఉన్నవారికి రోగ నిరోధకత కోసం టిడి (డిఫ్తీరియా నుండి రక్షించుటకు) వ్యాక్సిన్‌ ఇస్తారు.
జిల్లా స్థాయిలో ఎవరు పర్యవేక్షిస్తారు?
జాతీయ వ్యాధి నిరోధక టీకాల ప్రోగ్రాం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా అమలు చేస్తున్నారు. జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తుంటారు. క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది, ఆశావర్కర్లు, ఎఎన్‌ఎంలు టీకాల కార్యక్రమంలో కీలక భూమిక పోషిస్తారు.