రూ.3.30కోట్ల వ్యయంతో వంద టన్నుల సామర్థ్యం గల వంతెన నిర్మాణం
ప్రజాశక్తి - భీమడోలు
ఏలూరు కాలువపై, గుండుగొలను వద్ద శిథిలమై కూలిపోయిన వంతెన స్థానంలో నూతన వంతెన నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని ఉంగుటూరు ఎంఎల్‌ఎ వాసు బాబు తెలిపారు. రూ. 3.30 కోట్ల వ్యయంతో వంద టన్నుల సామర్థ్యం గల నూతన వంతెన నిర్మాణ పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం నిర్మాణ పనులు చేపట్టిన గుత్తేదారులతోనూ, జాతీయ రహదారుల రాజమండ్రి కార్యాలయ ప్రతినిధులతోనూ ఆయన మాట్లాడారు. వంతెన నిర్మాణ ప్రగతి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ పనులు నవంబర్ లేదా డిసెంబర్ నాటికి పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. ఒక సంవత్సరకాల వ్యవధిలోనే అనుమతులు లభించటం, నిర్మాణాలు ప్రారంభం, పూర్తి కావడం వెనుక సిఎం అందజేసిన సహాయ, సహకారాలు ఎంతైనా ఉన్నాయన్నారు. నిర్మాణ సమయంలో గుండుగొలను దాని పరిసర ప్రాంతాల వారికి ఇబ్బందులు లేకుండా చూసేందుకు రవాణా కోసం బెయీలీ వంతెనను నిర్మించామన్నారు. సాగు, తాగునీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రస్తుతం వంతెన పిల్లర్ పనులు పూర్తయ్యాయని, వాటి క్యాపింగ్ పనులు పూరైన తర్వాత వంతెన నిర్మాణ పనులు వేగవంతమవుతాయని తెలిపారు. ఈ వంతెన నిర్మాణం పూరైతే పర్యాటక కేంద్రంగా కొల్లేరు ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. ఇదేవిధంగా బ్రిటీష్‌కాలం నాటి గుండుగొలను-పోతునూరు-ఏలూరు జాతీయ రహదారి నిర్మాణం ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఏలూరు-కైకలూరు ప్రాంతాలకు దగ్గర మార్గం ఏర్పడుతుందన్నారు. ఆధ్యాత్మిక కేంద్రం కొల్లేరు పెద్దింట్లమ్మ దేవస్థానానికి వెళ్లేందుకు మంచి మార్గం ఏర్పడుతుందన్నారు. దీనితోపాటు ఆక్వారంగం అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచి ముదుండి సూర్యనారాయణ రాజు, వక్స్ బోర్డు డైరెక్టర్ జహీర్, గుండుగొలను వైసిపి గ్రామ సచివాలయాల కన్వీనర్ మురళి, ఎంపిపి కనుమాల రామయ్య పాల్గొన్నారు.










