Mar 03,2023 22:27

తెగుళ్ల కారణంగా తగ్గిన దిగుబడులు
ప్రజాశక్తి - ముదినేపల్లి

             మండలవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మినుము తీత పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మండలంలో రెండో పంట దాళ్వా సాగు లేకపోవడంతో రైతులు మినుము సాగు చేపట్టారు. ప్రస్తుతం మినుము పంట కోతకు రావడంతో పది రోజులుగా మండలంలోని అన్ని గ్రామాల్లో మినుము తీత పనులు సాగుతున్నాయి. రైతులు కూలీలతో మినుము తీత పనులు చేయిస్తున్నారు. పలు గ్రామాల్లో మినుము పంట తీత పనులు ఒకపక్క జరుగుతుండగా, మరికొన్ని గ్రామాల్లో తీసిన మినుమును నూర్పిడి చేసే పనులు ముమ్మురంగా సాగుతున్నాయి. దీంతో ప్రస్తుతం రైతులు, కూలీలు పనుల్లో తలమునకలై ఉన్నారు. రెండు పూటల పని చేసే కూలీకి కూలి సొమ్ముగా రూ.500 చెల్లిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే కూలీలకు ఆటో ఛార్జీలకు అదనంగా రూ.50 నుంచి రూ.వంద వరకూ ఇస్తున్నారు. మండలవ్యాప్తంగా 12 వేల ఎకరాల్లో మినుము సాగు రైతులు చేపట్టగా 40 శాతం వరకు మినుము తీతలు జరిగినట్లు మండల వ్యవసాయాధికారి బి.వేణుమాధవ్‌ చెప్పారు. గతేడాది మినుము సాగు ఆశాజనకంగా ఉన్నా ఈ ఏడాది తెగుళ్ల కారణంగా కొంతమేర దిగుబడులు తగ్గాయన్నారు. ఎకరానికి ఐదు నుంచి ఆరు క్వింటాళ్లు వరకూ దిగుబడులు వస్తున్నట్లు చెప్పారు.