Nov 16,2022 22:16

రేపటి నుంచి వాహనాల రాకపోకలకు అనుమతి
ప్రజాశక్తి - భీమడోలు

               ఏలూరు కాలువపై గుండుగొలను వద్ద రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న బెయిలీ బ్రిడ్జి నిర్మాణపు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. బ్రిడ్జి మీదుగా శుక్రవారం ఉదయం నుంచి రాకపోకలకు అనుమతిస్తామని రోడ్లు, భవనాల శాఖ పర్యవేక్షక ఇంజినీర్‌ జివి.భాస్కరరావు తెలిపారు. భీమడోలు సహాయ ఇంజనీర్‌ భాస్కర్‌రావు ఆధ్వర్యంలో కొనసాగుతున్న బెయిలీ వంతెన నిర్మాణపు పనులను బుధవారం ఉదయం ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ కిషోర్‌బాబుతో కలిసి ఆయన పరిశీలించారు. 30 మీటర్ల పొడవు, ఆరు మీటర్ల వెడల్పుతో నిర్మించే వంతెనపై ఎనిమిది టన్నుల వరకు బరువు గల తేలికపాటి వాహనాలు ప్రయాణించేందుకు అనుమతిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గుండుగొలను వద్ద ఏలూరు కాలువపై 120 సంవత్సరాల క్రితం నిర్మించిన వంతెన కొంతకాలం క్రితం కూలిపోయిన సంగతి తెలిసిందే. దీంతో రాకపోకలు నిలిచి గుండుగొలనుతోపాటు ఏలూరు రూరల్‌, దెందులూరు, భీమడోలు మండలాలకు చెందిన కొల్లేరు ప్రాంత గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ దశలో స్పందించిన ఉంగుటూరు ఎంఎల్‌ఎ పుప్పాల వాసుబాబు శిథిలమైన బ్రిడ్జి స్థానంలో నూతన వంతెన నిర్మాణానికి అనుమతులు సాధించారు. ప్రజలకు ఇబ్బందుల్లేకుండా ఉండేలా తాత్కాలిక ఏర్పాట్లలో భాగంగా బెయిలీ వంతెన నిర్మాణానికి చర్యలు చేపట్టారు. దీనిపై గుండుగొలను ఉపసర్పంచి ముదుండి సూర్యనారాయణరాజు ఆధ్వర్యంలో గ్రామస్తులు సమస్యను ఎంఎల్‌ఎ దృష్టికి తెచ్చారు. అదే సమయంలో ఆ గ్రామస్తులు బెయిలీ వంతెన త్వరితగతిన ఏర్పాటు చేయాలని కోరుతూ సాధన కమిటీ ఆధ్వర్యాన రాయబారాలు కూడా చేశారు. దీనిపై స్పందించిన ఎంఎల్‌ఎ పెనుగొండ వద్ద ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న బెయిలీ వంతెన సామగ్రిని గుండుగొలను వద్ద వినియోగించేందుకు అనుమతి సాధించారు. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కె.సుబ్బరాజు స్పందించి గుండుగొలను వద్ద బెయిలీ వంతెన ఏర్పాటు చేసే వరకూ ఆ పనుల్లో వ్యక్తిగతంగా పాల్గొని పర్యవేక్షించారు. ఎంఎల్‌ఎ సోదరుడు, వైసిపి నియోజకవర్గ నేత పుప్పాల కార్తీక్‌, ఉప సర్పంచి ముదుండి సూర్యనారాయణరాజు వంతెన నిర్మాణపు పనులను బుధవారం పర్యవేక్షించారు. కార్యక్రమంలో వైసిపి ఎస్‌సి సెల్‌ నేత గొటికల మురళి పాల్గొన్నారు.