Apr 22,2023 00:16

ఉపాధ్యాయుడు జోజప్పను ఆస్పత్రికి తరలించే ప్రయత్నంలో తోటి ఉపాధ్యాయులు, ఉపాధ్యాయుడు జోజప్ప (ఫైల్‌)

ప్రజాశక్తి - నరసరావుపేట : పదో తరగతి జావాబు పత్రాల మూల్యాంకనం విధుల్లో ఉండగా ఉపాధ్యాయుడు గుండెపోటుతో మృతి చెందిన పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో శుక్రవారం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండల కేంద్రానికి చెందిన పి.జోజప్ప (50) ఎస్‌జిటి ఉపాధ్యాయునిగా పని చేస్తున్నారు. గతంలో పల్నాడు జిల్లా శావల్యాపురం, ముప్పాళ్ల మండలాల్లో పని చేసిన జోజప్ప ప్రస్తుతం రొంపిచర్ల మండలం వీరవట్నం ఎస్సీ కాలనీలోని ఎంపిపి పాఠశాలలో పని చేస్తున్నారు. 19వ తేదీ నుండి పదో తరగతి పరీక్షల మ్యూల్యాంకనం నేపథ్యంలో నరసరావుపేటలోని వినుకొండ రోడ్డులో గల సెయింట్‌ ఆన్స్‌ పాఠశాలలో మూల్యాంకనం విధులు కేటాయించారు. అప్పటి నుండి విధులకు హాజరవుతున్న జోజప్ప శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో భోజనం చేసిన అనంతరం అక్కడే కుప్పకూలారు. గమనించిన తోటి ఉపాధ్యాయులు వెంటనే కారులో స్థానిక ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని మృతుని స్వగ్రామానికి తరలించారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. జోజప్ప మృతిపట్ల యుటిఎఫ్‌ పల్నాడు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి.ప్రేమ్‌కుమార్‌, జి.విజయసారథి సంతాపం తెలిపారు. అనారోగ్యంతో ఉండి స్పాట్‌ వాల్యూవేషన్‌ విధుల నుండి వెసులుబాటు కోరిన ఉపాధ్యాయులకు ఆ అవకాశం ఇవ్వాలని కోరారు. తీవ్రమైన ఎండలను తట్టుకునేలా మూల్యాంకన కేంద్రాల్లో వసతులు ఏర్పాటు చేయాలన్నారు.