Apr 24,2023 23:13

ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

ప్రజాశక్తి-గుంటూరు : పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం జరుగుతున్న స్థానిక స్టాల్‌ బాలికల హైస్కూల్‌ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి సోమవారం సందర్శించారు. జవాబు పత్రాలను భద్రపరచిన స్ట్రాంగ్‌ రూమ్‌ను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఉపాధ్యాయులు మూల్యాంకనం చేస్తున్న గదులను పరిశీలించి గాలి, వెలుతురు ఉండేటట్లు చూడాలన్నారు. అవసరమైన పక్షంలో వేసవి తాపాన్ని దష్టిలో పెట్టుకొని కూలర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి శైలజను ఆదేశించారు. మూల్యాంకన కేంద్రంలో వసతులు ఎలా వున్నాయని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. మూల్యాంకనం విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు మరుగుదొడ్ల సౌలభ్యంపై ఆరాతీశారు. మరుగుదొడ్లు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని, తాగునీటి వసతి అందుబాటులో ఉండేటట్లు చూడాలన్నారు. 26వ తేది వరకు జరుగనున్న మూల్యాంకన ప్రక్రియ సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో డిఇఒతోపాటు అసిస్టెంట్‌ గవర్నమెంట్‌ ఎగ్జామినర్‌ వెంకటరెడ్డి, డిప్యూటీ డిఇఒ సుధాకర్‌రెడ్డి, ఉర్దూ డిప్యూటీ డిఐ ఖాసిం పాల్గొన్నారు.