Aug 03,2023 22:52

తహశీల్దార్‌ చలమయ్యను నిలదీస్తున్న రైతులు

- ధ్వంసం చేసిన పంట పొలాలను పరిశీలించిన సిపిఎం నాయకులు
- రైతులతో కలిసి వేసిన వరినాట్లు
- రెండో రోజూ కొనసాగిన పంటల ధ్వంసం
- అడ్డుకునేందుకు వెళ్లిన సిపిఎం నాయకుల అరెస్టు
ప్రజాశక్తి - నౌపడ: 
మూలపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అదానీ పోర్టు కోసం బుల్డోజర్‌తో ధ్వంసం చేసిన పంట పొలాలను పరిశీలించి, నాట్లు వేసిన సిపిఎం నాయకులు మూలపేటలో పర్యటించి గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సమయంలోనే రెండో రోజూ అధికారులు పంటలను ధ్వంసం చేశారు. దీంతో అక్కడకు వెళ్తున్న సిపిఎం నాయకులను పోలీసులు అడ్డగించడం, బలవంతంగా అరెస్టులు చేయడం... అధికారులను నాయకులు, రైతులు నిలదీయడం... పంట ధ్వంసాన్ని తట్టుకోలేక మహిళ సొమ్మసిల్లి పడిపోయిన ఘటనలతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
రెవెన్యూ అధికారులు ధ్వంసం చేసిన పంట పొలాలను సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి, జి.సింహాచలం, జిల్లా కమిటీ సభ్యులు ఎన్‌.షణ్ముఖరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొల్లి ఎల్లయ్య, సిఐటియు జిల్లా కార్యదర్శి హెచ్‌.ఈశ్వరరావు పరిశీలించారు. మూలపేటలో పర్యటించి బాధిత రైతులు, మహిళలతో మాట్లాడారు. ఇప్పటివరకు భూసేకరణను వ్యతిరేకిస్తూ 43 మంది రైతులు 48 ఎకరాలు ప్రభుత్వానికి ఇవ్వలేదని రైతులు చెప్పారు. వీరిలో కొంతమంది పంట వేసుకోగా, అధికారులు దౌర్జన్యంగా బుల్డోజర్లతో పంటను తొక్కించేశారని సిపిఎం నాయకులు వద్ద పలువురు మహిళలు వాపోయారు. నిర్వాసితులకు పూర్తిస్థాయి పరిహారం చెల్లించకుండా పనులు ఎలా చేస్తారని సిపిఎం నాయకులు ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్‌లో బిజెపి బుల్డోజర్‌ సంస్కృతిని అదానీ కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందని విమర్శించారు. అధికారులైనా, ఎవరైనా రాజ్యాంగ పరిధిలో నడుచుకోవాలి తప్ప దానికి భిన్నంగా వ్యవహరించకూడదని గుర్తుచేశారు. రైతులు వారి సొంత భూముల్లో వరి పంటను వేసుకుంటే తొక్కించడం రాజ్యాంగ, చట్ట విరుద్ధమన్నారు. ఇప్పటికైనా బలవంతపు భూసేకరణను ఆపాలని, రైతులపై నిర్బంధాన్ని ఆపాలని డిమాండ్‌ చేశారు. భూములు ఇవ్వని రైతులపై దౌర్జన్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం బుల్డోజర్‌తో నాశనం చేసిన మూడు ఎకరాల పంట పొలాన్ని గ్రామస్తులతో కలిసి వెళ్లి వరినాట్లు వేశారు.
రెండో రోజూ కొనసాగిన దౌర్జన్యకాండ
మూలపేటలో ఒకవైపు సిపిఎం నాయకులు బాధిత రైతులతో మాట్లాడుతుండగా, మరోవైపు టెక్కలి సిఐ చంద్రమౌళి నేతృత్వాన పోలీసు బందోబస్తు మధ్య తహశీల్దార్‌ చలమయ్య, రెవెన్యూ అధికారులు రెండో రోజూ బుల్డోజర్‌తో పంట పొలాలను ధ్వంసం చేశారు. దీంతో మాజీ సర్పంచ్‌ జీరు భీమారావు, జీరు సుందరరావు, గ్రామస్తులు తహశీల్దార్‌ను నిలదీశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకే చేస్తున్నామని చెప్పారు. తన పొలంలో పంటను బుల్డోజర్లతో తొక్కించడాన్ని తట్టుకోలేక కోట అమ్మన్నమ్మ సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను టెక్కలి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. పంటల ధ్వంసం విషయాన్ని తెలుసుకున్న సిపిఎం నాయకులు అడ్డుకునేందుకు బయలుదేరగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో వారికి, పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ప్రాజెక్టు నిర్మిస్తే తొలుత పునరావాసం కల్పించాలని, పూర్తిస్థాయి పరిహారం చెల్లించాలని ఏదీ లేకుండా పచ్చని పంట పొలాలను ఎందుకు నాశనం చేస్తున్నారని తహశీల్దార్‌ను సిపిఎం నాయకులు నిలదీశారు. ధ్వంసాన్ని అడ్డుకునేందుకు పోలీసులను ప్రతిఘటించి వెళ్తుండగా పోలీసులు బలవంతంగా వారిని అరెస్టు చేసి నౌపడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారిని విడుదల చేశారు.