
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్) యురాలజీ వార్డులో రూ.రెండు కోట్ల పరికరాన్ని ఆప్తమాలజీ వార్డులో మూలనపడేసిన ఉదంతం గురువారం వెలుగుచూసింది. ఆపరేషన్ అవసరం లేకుండా కిడ్నీలో రాళ్లు తొలగించే ఈ మిషన్ అందుబాటులో లేకపోవడంతో యూరాలజి వార్డుకు వస్తున్న రోగులకు తిరిగి వెళ్లిపోతున్నారు. ఈ విషయం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్‌కుమార్ దృష్టికి రావడంతో ఆయన పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైనచోట పరికరాన్ని ఎందుకు వుంచడంలేదని అధికారులపై మండిపడ్డారు. ఆ పరికరాన్ని వెంటనే యురాలజీ వార్డుకు తరలించాలని ఆదేశించారు. యురాలజీ వార్డులో ఖాళీగా ఉన్నా స్టోర్ రూమ్‌లో ఈ పరికరాన్ని ఏర్పాటు చేసి రోగులకు అందుబాటులో ఉంచాలన్నారు. వార్డులో నెలకొన్న సమస్యలను సూపరింటెండెంట్‌కు ఆ విభాగం ఇన్‌ఛార్జి హెచ్‌ఒడి డాక్టర్ మనోహర్ వివరించారు. ఎన్‌ఎంసి ప్రకారం సర్జరీ అయిదో విభాగం తాత్కాలికంగా తీసుకోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. యురాలజీ విభాగంలో మహిళల కోసం వార్డును అప్పగించాలని రాతపూర్వకంగా కోరాలని సూపరింటెండెంట్ సూచించారు. స్టోర్ రూమ్‌లో ఉన్న సామగ్రిని లేబర్ రూమ్‌లోకి మార్చాలని సిఎస్‌ఆర్‌ఎంఒ డాక్టర్ సతీష్ కుమార్‌ను ఆదేశించారు. నిరూపయోగంగా ఉన్న ఒక గదిని శుభ్రం చేసి రంగులేసి అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు కేటాయించాలని చెప్పారు. ఇదే వార్డులో నిరూపయోగంగా ఉన్న మరో గదిలోని సిమెంట్ దిమ్మెను తొలగించాలన్నారు. ఈ గదిని యురాలజీ రోగులకు ప్రిపరేషన్ రూమ్‌గా వాడాలని సూచించారు. వార్డులోని ఎస్‌ఒటిని పరిశీలించారు. నిరూపయోగంగా ఉన్న లేప్రోస్కోపిక్ మిషన్‌కు మానిటర్‌ను తక్షణమే అమర్చాలన్నారు. రూ.పది లక్షల విలువైన వేజల్ సీలర్ అనే డయాదర్మీ పరికరాన్ని మారమ్మతులు చేసి గైనకాలజీ విభాగానికి పంపించాలని చెప్పారు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌లు చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ డిఎస్‌ఎస్ శ్రీనివాస ప్రసాద్, నర్సింగ్ సూపరింటెండెంట్ సమీనా బేగం పాల్గొన్నారు.