జనవరి 26 తర్వాత 'ఇక రైతు ఉద్యమం పని అయిపోయినట్టే' నని మోడీ భక్తులు ప్రచారం చేసుకున్నారు. కాని మరోసారి వారి ప్రచారం వొట్టి బూటకమని తేలిపోయింది. బిజెపి ప్రభుత్వం, దాని భజనబృందం ఆశించినట్టు రైతు ఉద్యమం బలహీనపడలేదు సరికదా మరింత బలంగా, మరింత లోతుగా, మరింత దేశవ్యాప్త విస్తృతితో ముందుకు సాగుతోంది. మార్చి 6వ తేదీన 100వ రోజుకు చేరిన ఉద్యమం ఢిల్లీ సరిహద్దుల్లో సింఘూ, టిక్రీ, ఘాజీపూర్, షాజహాన్‌పూర్, పాల్వాల్ ప్రాంతాల వద్ద భారీగా తరలివచ్చిన రైతులతో శాంతియుతంగా ధర్నాలు నిర్వహించి విజయం సాధించేవరకూ విశ్రమించేది లేదంటూ విస్పష్టంగా తన దృఢ దీక్షను మరోమారు ప్రకటించింది. ఉద్యమానికి నాలుగు నెలలు పూర్తవుతున్న సందర్భంగా మార్చి 26న దేశవ్యాప్త బంద్‌కు సమాయత్తం అవుతోంది. బంద్ కు అన్ని వైపుల నుండీ మద్దతు వెల్లువెత్తుతోంది.
ఉద్యమాన్ని మరింత బలంగా కొనసాగించాలంటే దేశంలోని మారుమూల గ్రామాలకు విస్తరించాలని ఉద్యమ నేతలు భావించారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ సమ్మేళనాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. మహారాష్ట్ర నుండి, కర్ణాటక నుండి రైతు యాత్రలు సాగుతున్నాయి. తాజాగా గుజరాత్‌లోనూ ఈ సమ్మేళనాలు మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాష్ట్రస్థాయి రైతు ఉద్యమ వేదికలు ఏర్పడ్డాయి. రాష్ట్రవ్యాప్త ప్రచారానికి పూనుకున్నాయి. తమిళనాడు, కేరళ ఎన్నికలలో రైతు ఉద్యమం ఒక ప్రధాన ప్రచారాంశం అయింది.
బలపడుతున్న కార్మిక - కర్షక ఐక్యత
ఒకవైపు పోరాటంలో నిమగమైఉన్నా రైతు ఉద్యమకారులు దేశంలో జరుగుతున్న కార్మికుల, ఉద్యోగుల పోరాటాలకు తాము కూడా తోడు నిలవాలని భావించారు. మార్చి 15న ప్రైవేటీకరణ వ్యతిరేక దినాన్ని పాటించాలన్న కేంద్ర కార్మిక సంఘాల పిలుపుకు రైతు ఉద్యమం మద్దతు ప్రకటించింది. ఆ రోజున దేశ వ్యాప్తంగా రైతాంగం, కార్మికులు ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణకు, వ్యవసాయం కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పెట్రో ధరల పెరుగుదలను కూడా వారు నిరసించారు. మార్చి 15, 16 తేదీల్లో జరిగిన బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు, 17న జరిగిన సాధారణ బీమా ఉద్యోగుల సమ్మెకు, 18న జరిగిన జీవిత బీమా ఉద్యోగుల సమ్మెకు రైతు ఉద్యమం సంఘీభావం తెలిపింది. ఉమ్మడిగా రాబోయే కాలంలోనూ ఉద్యమాలు చేపట్టాలన్న నిర్ణయానికి కార్మిక, కర్షక ఉద్యమ నేతలు వచ్చారు.
ధర్మ యుద్ధం - ప్రజలందరి పోరాటం
ఇప్పుడు రైతులు పోరాడుతున్నది కేవలం ఆ నల్ల వ్యవసాయ చట్టాల రద్దు కోసం మాత్రమే కాదు. వాళ్ళు దేశంలో విపరీతంగా పెరిగిపోయిన సంపద అసమానతల మీద పోరాడుతున్నారు. రాజకీయాలలో ప్రజల మధ్య చీలికలు తెచ్చే శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. రైతాంగ ఆత్మహత్యల మీద, ఆదాయాల్లో ఉన్న అసమానతల మీద, కార్పొరేట్ల గుత్తాధిపత్యం మీద...వాళ్ళిప్పుడు పోరాడుతున్నారు. వ్యవసాయంలో స్త్రీలు పోషించే పాత్రకు తగిన గుర్తింపు కోసం పోరాడుతున్నారు. సమాజం లోని అన్ని తరగతుల ప్రజల సమస్యలపై వారు పోరాడుతున్నారు. ఇదొక ధర్మయుద్ధం అని సంయుక్త కిసాన్ మోర్చా నేతలు ప్రకటించారు.
ఖాప్ పంచాయితీలు కావు.. ఇప్పుడవి మహా పంచాయితీలు
కులాలవారీగా ప్రజలలో వేలాది సంవత్సరాలుగా ఉన్న చీలికలను ముందుకు తెచ్చి రైతు ఉద్యమాన్ని చీలికలు, పేలికలు చేయాలని బిజెపి పన్నిన కుట్రలను రైతులు గ్రహించారు. ఒక చోట అది కేవలం 'జాట్'ల ఉద్యమంగా ఉందని, ఇంకొక చోట 'షెకావత్'ల ఉద్యమమే తప్ప ఇంకెవరూ లేరని, మరో చోట ఇది కేవలం 'మీనా'ల ఉద్యమమేనని - ఇలా బిజెపి నాయకులు తప్పుడు ప్రచారం చేశారు. మొదట్లో ఖాప్ పంచాయితీల ద్వారా రైతులను కదిలించే ప్రయత్నాలు జరిగాయి. కాని కేవలం ఒక కులానికి చెందిన వారిని మాత్రమే కదిలించడంతో విజయం రాదని, అన్ని కులాల వారిని కలిపే సమీకరణలు అవసరమని రైతు నేతలు గుర్తించారు. అందుకే ఇప్పుడు ప్రతీ చోటా మహా పంచాయితీలు నిర్వహిస్తున్నారు. వాటిలో అన్ని కులాలవారినీ కదిలించి ఐక్యపరుస్తున్నారు. హిందూ-ముస్లిం-క్రైస్తవ-సిఖ్ ఐక్యతను ప్రబోధిస్తున్నారు. దళితులను సాదరంగా స్వాగతిస్తున్నారు. అన్ని తరగతుల శ్రామిక ప్రజలనూ సమీకరించే ''కిసాన్-మజ్దూర్ ఏక్తా జిందాబాద్'' నినాదం ఇప్పుడు ఉద్యమ నినాదంగా మారింది.
''మోడీ ప్రభుత్వం పెట్టిన బారికేడ్లను తొలగించి ఢిల్లీ నిరసనలను కొనసాగిస్తున్నాం, నీటి ఫిరంగులను, బాష్పవాయు గోళాలను తిప్పికొట్టాం. అలాగే ఇప్పుడు మన మధ్య ఐక్యతకు అడ్డుగోడల్లా ఉన్న కుల, మత విభేదాలనూ తొలగిద్దాం.'' అని కిసాన్ నేతలు పిలుపిచ్చారు. ''దళితుల ఇళ్ళల్లో ఛోటూరామ్ ఫోటోలు పెట్టండి. అగ్రవర్ణాల వారి ఇళ్ళల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోలు పెట్టండి.'' అని నేతలు విజ్ఞప్తి చేశారు. హిందువులకు, ముస్లింలకు మధ్య మత విభేదాల చిచ్చు రగిల్చి గత రెండు తడవల ఎన్నికలలో లబ్ధి పొందిన బిజెపి నేతలకు ఇప్పుడు వారివారి నియోజక వర్గాలలోనే బహిష్కరణలు, నిరసనలు ఎదురవుతున్నాయి. ముజఫర్‌నగర్ నుంచి ఎం.పిగా ఎన్నికై కేంద్రంలో మంత్రి పదవి కూడా చేపట్టిన సంజీవ్ బాల్యన్ తన నియోజకవర్గ రైతులను ''చైతన్యవంతుల్ని'' చేద్దామని వెళ్ళి వారి నిరసన వేడికి తట్టుకోలేక వెనుదిరగవలసి వచ్చింది. అక్కడ గతంలో పరస్పరం వైరంతో వ్యవహరించిన హిందువులు, ముస్లింలు ఇప్పుడు ఐక్యమై మంత్రిని వెళ్ళగొట్టారు. తన కుల, మత విద్వేష రాజకీయాలతో రైతు ఉద్యమంలో చీలికలు సృష్టించాలని బిజెపి చేసిన, చేస్తున్న కుట్రలను సమైక్య రైతు ఉద్యమం విజయవంతంగా తిప్పికొడుతోంది.
వెల్లివిరుస్తున్న సౌహార్ద్రత
తన పొలంలో వేసిన చెరుకు పంట కోతకు రావడంతో....పోరాట కేంద్రం నుండి వెనక్కి వెళ్ళి కోతలు పూర్తి చేసుకుని తిరిగి వచ్చాడు రాజన్ జావలా అనే రైతు. అతను ఆ చెరుకునంతా పోరాట కేంద్రానికి తీసుకువచ్చి అక్కడ ఉన్నవారందరికీ చెరుకురసం సరఫరా చేస్తున్నాడు. ఆ విధంగా చేస్తున్నవారింకా చాలామంది ఉన్నారని అతడు తెలిపాడు. ఇంటింటికీ తిరిగి పాలు సేకరించి పోరాట కేంద్రాలకు తెచ్చి అక్కడ ఉద్యమకారులకు టీ కాచి ఇస్తున్న వారు కూడా చాలామంది ఉన్నారు. ఇక గ్రామాల్లో ఉండిపోయినవారు ఉద్యమ కేంద్రాల వద్ద ఉన్నవారి పొలాల్లో కోతలకు, నాట్లకు సహకరిస్తున్నారు. రాజస్థాన్-హర్యానా సరిహద్దులో భరత్‌పూర్ వద్ద మహా పంచాయితీ జరపడానికి 25,000 మంది పట్టే స్థలం అవసరమైంది. ఏపుగా ఎదిగిన గోధుమ పంట ఉన్నా, ఆ పొలాలను సభ కోసం చదును చేసి స్వచ్ఛందంగా ఇవ్వడానికి రైతులు ముందుకొచ్చారు. 'వ్యవసాయ పనులూ ఆగవు, ఉద్యమమూ ఆగదు' అంటున్నారు రైతులు.
నిర్బంధాలకు భయపడేది లేదు
బిజెపి పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలు రైతు ఉద్యమకారులపై కేసులు పెడుతున్నాయి. ఇప్పటికి 100 మందికి పైగా జైళ్ళలో ఉన్నారు. రైతు నాయకుల పైనే 35 కేసులు ఇప్పటి వరకూ బనాయించారు. శాంతియుతంగా ఆందోళన సాగితే అందుకెటువంటి అభ్యంతరమూ ఉండబోదని సుప్రీం కోర్టు మొదట్లోనే స్పష్టం చేసింది. కాని రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు విరుద్ధంగా నిర్బంధానికి పూనుకుంటున్నాయి. అయితే 'ఈ నిర్బంధాలు మా ఉద్యమాన్ని ఎంతమాత్రమూ నిరోధించలేవు' అని రైతు ఉద్యమకారులు ప్రకటిస్తున్నారు.
ఉద్యమానికి బాసటగా ప్రత్యామ్నాయ మీడియా
ప్రింట్ మీడియాతో సహా ప్రధాన స్రవంతి మీడియా రైతు ఉద్యమ వార్తలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడంలేదు. ప్రభుత్వ ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోంది. అయితే, ఒక కొత్త తరం యువ జర్నలిస్టులు ముందుకొచ్చారు. నిరసన వార్తలను, నాయకుల ప్రసంగాలను, ఇంటర్వ్యూలను చిన్న చిన్న వీడియోలుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇంటర్నెట్‌లో వాటికి విశేష ప్రాచుర్యం లభిస్తోంది. వాటిని చూసేవారు, లైక్ చేసేవారు లక్షల్లో ఉన్నారు. ఆన్‌లైన్ న్యూస్ మీడియా కూడా రైతు ఉద్యమాన్ని బాగా ప్రచారం చేస్తోంది. నేడు భారతదేశ రైతాంగ ఉద్యమం అంతర్జాతీయంగా ప్రచారం పొందింది. బ్రిటన్ లో లక్ష మంది పౌరులు పాల్గొన్న సంతకాల ఉద్యమం కలిగించిన ఒత్తిడితో బ్రిటన్ పార్లమెంటు ఒకరోజు భారతదేశంలో జరుగుతున్న రైతు ఉద్యమం మీద చర్చించింది. చర్చలో పాల్గొన్న ఎంపీలందరూ మోడీ ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. అమెరికా, కెనడా, ఫ్రాన్స్ తదితర దేశాలలో మన రైతు ఉద్యమానికి మద్దతు పెరుగుతోంది.
''నా ఆఖరి కోర్కెను తీర్చండి''
48 ఏళ్ళ రాజ్‌బీర్‌సింగ్ హర్యానా లోని హిస్సార్ కు చెందిన రైతు. తన రెండెకరాల పొలంలో వరి, గోధుమ పండిస్తాడు. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వంద రోజులైనా మోడీ ప్రభుత్వం రైతుల డిమాండ్లను అంగీకరించకపోవడంతో నిరాశ చెంది ఆ రోజునే ఉరి వేసుకుని చనిపోయాడు. తన సూసైడ్ నోట్‌లో ''చనిపోతున్న నా ఆఖరి కోర్కెను నెరవేర్చండి. ఆ మూడు వ్యవసాయ చట్టాలనూ రద్దు చేయండి'' అని రాశాడు. ఢిల్లీ సరిహద్దుల్లో ఆత్మహత్యకు పాల్పడిన ఎనిమిదో రైతు రాజ్‌బీర్. ఇప్పటివరకూ ఈ ఉద్యమంలో 280 మంది రైతులు అమరులయ్యారు.
దేశం కోసం పోరాడాను.. ఇదా నాకిచ్చే బహుమానం?
82 ఏళ్ళ గురుముఖ్‌సింగ్ పంజాబ్ లోని ఫతేపూర్‌సాహిబ్ గ్రామానికి చెందిన రైతు. 22 సంవత్సరాలు ఆర్మీలో ఉన్నాడు. 1962 ఇండో-చైనా యుద్ధంలో, 1965 ఇండో-పాకిస్థాన్ యుద్ధంలో, 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో పాల్గొన్నాడు. 1984లో పదవీ విరమణ చేసి వ్యవసాయం చేసుకుంటున్నాడు. మొన్న జనవరి 26న ఢిల్లీ వద్ద జరిగిన అల్లర్లతో ఎటువంటి సంబంధమూ లేకపోయినా (నిజానికి ఆ అల్లర్లు కేంద్ర ప్రభుత్వం పన్నిన కుట్రలో భాగం) గురుముఖ్‌సింగ్‌ను నిర్బంధించి 16 రోజులు జైలులో ఉంచారు. ప్రస్తుతం బెయిల్ మీద విడుదల అయ్యాడు. కాని ఆ తప్పుడు కేసు ఇంకా ఉంది. ''నేను దేశం కోసం మూడు యుద్ధాల్లో పోరాడాను. నాకు ఆర్మీలో ఎంతో గౌరవం ఇచ్చారు. నాకు 10 పతకాలు వచ్చాయి. కాని ఇప్పుడు మోడీ ప్రభుత్వం నన్ను ఉగ్రవాదినంటోంది. నా జీవితపు చివరి రోజుల్లో ఇదేనా నాకు దక్కింది? ఈ అవమానాన్ని నేనెలా భరించగలను?'' అని గురుముఖ్ వాపోతున్నాడు. అతడి ప్రశ్నకు మోడీ-షా ల వద్ద సమాధానం ఉందా?
ఎన్నికలలో ఓడించి బుద్ధి చెప్పండి - నేతల పిలుపు
అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సంయుక్త కిసాన్ మోర్చా నేతలు ఆ రాష్ట్రాలలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల పర్యటన పూర్తయింది. ఆ రాష్ట్రాలలో బిజెపిని ఓడించి బుద్ధి చెప్పాలని రైతులకు, ప్రజలకు ఉద్బోధిస్తున్నారు.
షాకిచ్చిన సత్యపాల్ మాలిక్
మేఘాలయ గవర్నర్‌గా ఉన్న సత్యపాల్ మాలిక్ రైతు ఉద్యమానికి తన మద్దతు బహిరం గంగా ప్రకటించాడు. ''రైతులు వొట్టి చేతులతో ఢిల్లీ నుండి వెనక్కి పోకూడదు. వారిపై ఎటువంటి బలప్రయోగమూ కూడదని నేను ప్రధానికి, హోం మంత్రికి చెప్పాను. రైతులను కెలకవద్దు. వాళ్ళు వెనక్కి తగ్గరు. ఒకవేళ తగ్గవలసివస్తే ఆ అవమానాన్ని 300 ఏళ్ళదాకా మరిచిపోరు'' అన్నాడు మాలిక్. మరో జాతీయోద్యమమే సాగుతోందా అన్న రీతిలో నడుస్తున్న రైతు ఉద్యమానికి బాసటగా నిలుద్దాం. 26వ తేదీన జరిగే బంద్‌ను జయప్రదం చేద్దాం.
* కార్తికేయ










