
బిట్టు ఐదోతరగతి చదువుతున్నాడు. ఎప్పుడూ తరగతి ఫస్ట్ వస్తుంటాడు. కొన్ని రోజుల్లోనే తనకంటే ఎవ్వరూ బాగా చదవలేరని, ఎవ్వరూ తనకు మించి ర్యాంకు కొట్టలేరనే భావన బిట్టులో అహంకారం పెరిగేలా చేసింది. కష్టపడి చదివేతత్వంతోపాటు మెల్లమెల్లగా అహంకారమూ అదేస్థాయిలో అతనిలో పెరగసాగింది.
అదే తరగతిలోకి నాని కొత్తగా వచ్చాడు. అందరితో మంచిగా ఉంటాడు. కానీ అతనికి ముక్కు మీదే కోపం. ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళతో మాట్లాడడు, వాళ్ళను పట్టించుకోడు. ఎప్పుడూ పాఠాలన్నీ ఆచరణాత్మకంగా అనుసరించడం నానికి చాలా ఇష్టం. అయితే చదివిన పాఠాలను రాయడం మాత్రం నచ్చదు. జవాబులు చెప్పడం వచ్చినా.. రాయడం సరిగా రాకపోవడంతో చాలీచాలని మార్కులతో పాస్ అవుతూ ఉంటాడు. అది గ్రహించిన బిట్టు, నానిని వెక్కిరించడం మొదలెట్టాడు. అంతే బిట్టుతో మాట్లాడటం మానేశాడు నాని. అయినా బిట్టు ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. ఓ రోజు తరగతి గదిలో కూర్చుని చదువుతున్న నానిని చూసిన బిట్టు తన స్నేహితులతో 'మొద్దు ఎంత చదివినా.. నాలాగా ఫస్ట్‌ర్యాంకు ఎప్పటికీ తెచ్చుకోలేడు. అది తెలియక తెగ చదివేస్తున్నాడు మొద్దుగాడు' అన్నాడు. అది విన్న బిట్టు స్నేహితులు పెద్దగా నవ్వసాగారు. ఎన్ని మాటలంటున్నా నాని పట్టించుకోవటం లేదు. అయినా బిట్టు ఇంకా ఇంకా అంటూనే ఉన్నాడు. అప్పటిదాకా తనను తాను నియంత్రించుకున్న నాని ఒక్కసారిగా కోపంతో పళ్ళు కొరుకుతూ బిట్టుని కొట్టడానికి వెళ్ళాడు. బిట్టు పరుగులు తీశాడు. నాని, బిట్టుని పట్టుకుని ఎలాగైనా కొట్టాలని వెంబడించాడు. అది చూసిన బిట్టు స్నేహితులు వాళ్ళ మాస్టారుతో జరిగింది చెప్పారు.
ఈలోగా బిట్టుని వెంబడిస్తున్న నాని కాలికి ఓ ముల్లు గుచ్చుకోవడంతో కిందపడ్డాడు. అది గమనించిన బిట్టు ఈలోగా మెల్లగా తప్పించుకున్నాడు. ఇంతలో కిందపడ్డ నానిని కూర్చోబెట్టి మాస్టారు 'ఏం జరిగింది?' అని అడిగారు. బిట్టు తనకి చదువు రాదంటూ చాలారోజుల నుంచి వెక్కిరిస్తున్నాడని, తనకు కోపం వచ్చి, బిట్టుని కొట్టాలనుకున్నానని చెప్పాడు. కాలికి ఉన్న ముల్లు తీశాక బిట్టు ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుని, కసిగా కొడతానన్నాడు. అది విన్న మాస్టారు 'ఏది? నీ కాలికి ఉన్న ముల్లు బయటకు తీద్దాం!' అంటూ ముల్లుని బయటకు తీసే ప్రయత్నం చేశారు.
ముందుగా పక్కనే ఉన్న ఓ పూలమొక్క నుంచి ఓ పువ్వు తెంపి, నాని కాలిమీద ఆ పువ్వుతో పాముతూ కాలికి ఉన్న ముల్లుని తియ్యటానికి వింతగా ప్రయత్నించారు మాస్టారు. అది గమనించిన నాని 'అదేంటి సార్! ముల్లును పువ్వుతో తీయటానికి ప్రయత్నిస్తున్నారు. ముల్లును ముల్లుతో తీస్తేనే వస్తుందని మా నాన్నమ్మ చెప్పింది' అంటాడు. మాస్టారు వెంటనే నవ్వుతూ ఆ పువ్వు కాడకు ఉన్న ఓ ముల్లును తెంపి దానితో నాని కాలికి ఉన్న ముల్లును తీసి నవ్వుతూ ఇలా అన్నారు. 'నీ కాలికి గుచ్చుకున్న ముల్లును పువ్వుతో తియ్యాలనుకోవటం ఎంత మూర్ఖత్వమో అలానే బిట్టు నీకు చదువు రాదని వెక్కిరిస్తున్నాడన్న కోపంతో అతన్ని కొట్టడమూ అంతే. నువ్వు కొడితే బిట్టు వెక్కిరించడం మానేస్తాడు అనుకోవటం కూడా అంతే మూర్ఖత్వం. ఈరోజు బిట్టుని నువ్వు కసితీరా కొట్టేస్తే, నీ కోపం తగ్గిపోవచ్చేమో కానీ ముందు ముందు బిట్టు వెక్కిరింతలు మాత్రం ఇంకా ఎక్కువైపోతాయి!'
'అయితే బిట్టు నన్ను వెక్కిరించకుండా ఉండాలంటే నేనేమి చెయ్యాలి మాస్టారు?' అంటూ అమాయకంగా అడిగాడు నాని. అప్పుడు మాస్టారు ఇలా అన్నారు 'ముల్లును ముల్లుతోనే తియ్యాలి.. అంటే బిట్టు నీకు చదువు రాదని వెక్కిరించకుండా ఉండాలంటే నువ్వు పట్టుదలతో కష్టపడి, చదివి అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి'. అది విన్న నాని 'అలాగే మాస్టారు! ఇక నుంచి బాగా కష్టపడి చదివి, అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటాను' అని ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పటినుంచి నానిలో కొత్త ఉత్సాహం కనిపించింది. కష్టపడి చదవటం మొదలెట్టాడు. అలానే పరీక్షల్లో బిట్టుకన్నా మంచి మార్కులతో క్లాసు ఫస్ట్ వచ్చాడు. అది చూసిన బిట్టు తన అహంకారం విడిచి తాను చేసిన తప్పు తెలుసుకున్నాడు. తనను క్షమించమని అడిగాడు, ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు.
- ఆదిత్య పట్నాయక్,
8984433779