Oct 10,2021 12:51

ఆ రాత్రి డాన్స్‌ అయిపోయిన తరువాత ఎప్పుడూ వచ్చే ఆటోలో ఇల్లు అనబడే ఒక చిన్న గదిలోకి రొప్పుతూ వచ్చి పడ్డారు.. 'అబ్బ పిచ్చి పిచ్చిగా ఆకలివేస్తోంది తొందరగా బిరియాని పొట్లం విప్పు' అంది సోనీ.
'నాకు అసలు ఏమీ తినాలని లేదు. ఇల్లు, అమ్మ, తమ్ముడు అందరూ గుర్తొస్తున్నారు. ఎప్పటికన్నా ఈ సుడిగుండపు జీవితంలోంచి బయటపడతామా సోనీ?' అని గట్టిగా ఏడ్చింది.
'ప్లీజ్‌ నీరూ ఏడవకు, నాకు భయమేస్తోంది. ధైర్యంగా ఉండు. మనం కావాలని తప్పు చేయడం లేదు. బతకడానికి వేరే దారి లేక అంతే. ఎప్పటికన్నా వస్తాయి మంచిరోజులు. ఈ కాస్త తినేసి, నిద్రపో అంది.'
కొంతసేపు ఒకళ్లనొకళ్లు ఓదార్చుకుంటూ ఉండిపోయారు.
వారం రోజులు గడిచాయి.

                                                                   ***

రాత్రి పదైంది. సిటీలోని ఓ హాస్పిటల్‌. అందులో ఐసియు వార్డుకి ఆనుకొని ఉన్న హాల్లో నీరూ, సోనీ కూర్చొని ఉన్నారు. వాళ్ల దగ్గరకు ఒక నర్స్‌ వచ్చి 'మీరు తీసుకొచ్చిన పేషెంట్‌కి ట్రీట్‌మెంట్‌ మొదలైంది' అని చెప్పి వెళ్లిపోయింది. 'సిస్టర్‌.. ఆ అబ్బాయి సేఫే కదా?' '48 గంటలు అబ్జర్వేషన్‌లో ఉండాలి' అని చెప్పేసి వెళ్లిపోయింది. 'నీరూ! అప్పుడే 10 గంటలైంది వెళ్లిపోదామే.. ఇప్పటికే భూషణం ఎన్నిసార్లు ఫోన్‌ చేశాడో తెలుసుగా?' వాడు పెట్టే హింస తలుచుకుంటూ అంది భయంగా సోనీ.
'ఎహే ఉండు.. నీకు అన్నిటికీ భయమే! పాపం చిన్నపిల్లాడు.. ఎలా వదిలేసి వెళతాం? వీడిని చూస్తే ఊళ్లో ఉన్న తమ్ముడే గుర్తొస్తున్నాడు. ఒక పనిచేద్దాం, కొంచెం సేపు చూసి, రిసెప్షన్‌లో చెప్పేసి వెళ్లిపోదాం! మిగతా వివరాలు వాళ్లు తెలుసుకుంటారులే!' అంది.
కొంతసేపు గడిచాక వాళ్లిద్దరూ అక్కడ నుంచి వెళ్లిపోయారు.
పైన జరిగిన సంభాషణల తాలూకు పూర్వాపరాలు తెలియాలంటే కొన్ని గంటలు వెనక్కి వెళ్లాలి.

                                                                  ***

అప్పుడు సమయం సాయంత్రం 7 గంటలు.
బస్సు దిగారు నీరూ, సోనీ.
అక్కడ నుంచి క్యాబ్‌ తీసుకొని, వెళ్లాలి.
ఇద్దరి ఫోన్లకీ మెసేజ్‌ బీప్‌ వచ్చింది. ఓపెన్‌ చేసి చూసుకున్నారు. లొకేషన్‌ షేర్‌ చేసి, క్యాబ్‌ కోసం ట్రై చేస్తున్నారు. పీక్‌ అవర్స్‌ అవడంతో అస్సలు దొరకడం లేదు. ఆల్మోస్ట్‌ గంట నుంచి ట్రై చేస్తున్నారు. ఊహు.. టైం గడుస్తోంది. ఇంతలో పెద్దగా ఉరుములు మెరుపులతో వాన కూడా మొదలయ్యింది. సమయం రాత్రి 8 గంటలు. ఇంతలో అక్కడకి వచ్చిన ఒక ఆటో వీళ్లను చూసి ఆగింది. 'మేడం ఎక్కడకు వెళ్లాలి?' అని అడిగాడు. వీళ్లు వెళ్లాల్సిన ఏరియా చెప్పారు. 'దూరమేగానీ వస్తాను మేడం.. 200 ఇవ్వండి!' అన్నాడు.
'ఇప్పుడు ఈ వానలో తడుస్తూ ఎంతసేపు ఉంటాం? వెళ్లిపోదాం సోనీ!' నెమ్మదిగా అంది నీరూ.
రెండొందలు ఫరవాలేదు అనుకొని, ఇద్దరూ కూర్చున్నారు. నీరూ, సోనీ ఇద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారు. కొంచెం దూరం వెళ్లాక ఆటో నెమ్మదిగా వెళ్లడం మొదలెట్టింది. అంతేకాకుండా అతను సీట్లో అసహనంగా అటు ఇటూ కదులుతూ డ్రైవ్‌ చేస్తున్నాడు. కబుర్ల మధ్యలో సోనీ అది గమనించి, నీరూకు చెప్పింది. వెంటనే 'ఏరు ఆటో అబ్బాయి! ఏంటీ అలా డ్రైవ్‌ చేస్తున్నావు?' అని గట్టిగా అడిగింది 'ఏం లేదు మేడం.. కడుపులో వికారంగా ఉండి, కొంచెం తల తిరుగుతోంది' అన్నాడు. దాంతో వీళ్లకి అనుమానం వచ్చింది.. తాగి నడుపుతున్నాడని ఇద్దరూ గుసగుసగా అనుకున్నారు. 'కాలేజీ అబ్బాయిలా ఉన్నాడు. అప్పుడే తాగుడుకి అలవాటు పడ్డాడు ఛీ, ఛీ!' అనుకున్నారు. ఇంతలో సడెన్‌గా ఒకచోట ఆపి, వాంతి చేసుకున్నాడు. అది చూసేసరికి వాళ్లు ఇది ఆ బాపతే అని నిర్ధారణకు వచ్చి, ఇక ఇందులో వద్దు వేరే ఆటో మాట్లాడుకుందామని కిందకు దిగబోతున్నారు.
అంతలో, ఆ అబ్బాయి వీళ్లు దిగడం చూసి 'మేడం దిగకండి, నేను జాగ్రత్తగా తీసుకొని వెళతాను. మీరిచ్చే పైసలతో మా అమ్మకి మందులు కొని తీసుకెళ్లాలి' అని దీనంగా అన్నాడు.
అది విని, కొంచెం వెనక్కు తగ్గారు. అప్పుడు దగ్గరగా అతనిని చూసింది సోనీ. ఇందాక అంతగా గమనించలేదుగానీ బాగా చిన్న పిల్లాడు.. 19 ఏళ్లు ఉంటాయేమో! తెల్లగా, సన్నగా ఉన్నాడు. మొహంలో పసితనం వీడలేదు. తాగావా అని అడగలేక 'నీకు ఒంట్లో బాగా లేదేమో? అందుకని వేరే ఆటో మాట్లాడదాము అనుకుంటున్నాము.. సరే పద' అని మళ్లీ లోపలకి ఎక్కి, కూర్చొన్నారు.
అప్పుడు అతనిని మాటలలో దింపింది సోనీ, 'నీ పేరు ఏంటి? మీరు ఎంతమంది?' అని అడిగారు.. అని దానికి సమాధానంగా 'నా పేరు అఫ్జల్‌ మేడం. మేము మొత్తం ఆరుమందిమి. పెద్దోడిని కూడా, పైసలు కమాయించే వాడిని కూడా నేనే'.
'అదేంటి మీ అమ్మానాన్న ఏమయ్యారు?' అని ఇద్దరూ ఒకేసారి ప్రశ్నించారు.
'మానాన్న దిల్‌సుఖ్‌ నగర్‌ బాంబు పేలుళ్లలో చనిపోయుండు. అమ్మకి గుండెజబ్బు ఉండే, తమ్ముళ్లు, చెల్లెళ్లు చిన్నవాళ్లు. ఇక నేనే, నాన్న ఆటో నడుపుతున్నా.'
'నువ్వు చదువుతున్నావా?' అని అడిగింది నీరూ.
'ఆ మేడం! ప్రైవేటుగా డిగ్రీ చదువుతున్నాను. అది అయ్యాక బ్యాంకు ఎగ్జామ్స్‌ కూడా రాస్తాను మేడం. మీరు కూడా ఏదైనా ఉద్యోగాలు ఉంటే చెప్పండి మేడం' అని అన్నాడు.
'సరే నీ ఫోన్‌ నెంబరు చెప్పు. ఏదైనా ఉంటే చూస్తాను' అంది నీరూ. ఫోన్‌ నెంబర్‌ ఇచ్చే లోపల మళ్లీ ఆటోని ఆపి, వాంతి చేసుకున్నాడు. ఆ తరువాత ఆటోని ఆనుకొని, నిస్త్రాణంగా వాలిపోయాడు. పాపం జాలి వేసింది ఆ అబ్బాయిని చూస్తే 'ఏం చేస్తాం.. వెళ్లిపోదాం' అనుకొని ఇద్దరూ ఆటో దిగి, రెండడుగులు వేశారు. కానీ వాళ్ల మనసొప్పలేదు. హాస్పిటల్‌కి తీసికొని, వెళదాం అనుకున్నారు. అప్పుడే అక్కడకి వచ్చిన ఇంకో ఖాళీ ఆటోను చూసి, ఆపారు. అతను వీళ్లతో మాట్లాడుతూనే 'ఏం జరిగింది మేడం?' అని అడిగాడు.
'ముందు ఇతని ఆటోలోనే ఎక్కాము. ఇక్కడకు వచ్చేసరికి అతనికి ఒంట్లో బాలేదు. ఏదైనా హాస్పిటల్‌కు తీసుకొని వెళ్లాలి!' అని అంటూ ఉండగానే అతనే ఆటో దిగి వచ్చి, అతన్ని చూసి 'అరె అఫ్జల్‌, స్పృహలో లే!' అంటూ వాళ్ల వైపుకి తిరిగి 'ఏమైందో ఏమో?' అని అతనిని మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇంతలో సోనీ ఫోన్‌ మోగింది, అవతల నుంచి తిట్టిన తిట్లకి ఆమెలో అవమానం, బాధ చోటుచేసుకున్నాయి. వాటిని దిగమింగుతూ 'ఇదిగో వచ్చేస్తున్నాం!' అని భయపడుతూ నెమ్మదిగా సమాధానం చెప్పింది.
'ఏమైంది?' అన్నట్లు చూసింది నీరూ.
'అడ్డమైన బూతులూ తిట్టాడు ఇద్దరినీ!' సోనీ అంది. 'సర్లే మంచిగా మాట్లాడితే ఆశ్చర్యపోవాలి కానీ, ఇదెప్పుడూ ఉండేదే!' అంది నీరూ.
'ఇప్పుడు ఎలా వుంది బేటా?' అని అడిగాడు ఆటో అతను కరీం. 'దాహం వేస్తోంది.. నా ఆటో, నా ఆటో ఎలా? అమ్మికి ఆపరేషన్‌కి డబ్బులు కావాలి' అంటూ ఏదో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అతని వల్ల కావటం లేదు.
'నీ ఆటోని నేను చూస్తానులే!' అంటూ పక్కనే ఉన్న షాప్‌ అతను చెప్పాడు.
నీరూ తన బాగ్‌లో ఉన్న నీళ్ల బాటిల్‌ తీసి ఇచ్చింది. ఆటో అతను తాగించాడు. మొత్తానికి అందరూ కలిసి అఫ్జల్‌ని హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. అక్కడ రిసెప్షన్‌లో ఇది అర్జెంట్‌ కేసుగా తీసుకోమని చెప్పారు. అక్కడ ఉన్న వాళ్లు ఫార్మాలిటీస్‌ అన్నీ అడుగుతూ ఉంటే.. ఇద్దరూ ఒకేసారి చెప్పారు 'మాకు ఏమీ తెలియదు. అతని ఆటో ఎక్కాం. అంతలో ఇలా జరిగింది. వెంటనే హాస్పిటల్‌కి తీసుకొచ్చాం అంతే' అన్నారు. చూసిన ఒక డాక్టర్‌ రిసెప్షన్‌ వాళ్లతో ఏదో మాట్లాడాడు. వెంటనే వాళ్లు నీరూ, సోనీలతో అన్నారు. 'అబ్బాయిని అడ్మిట్‌ చేసుకుంటాం. అక్కడ కౌంటర్‌లో డబ్బు కట్టండి!' అన్నాడు.
నీరూ కౌంటర్‌ దగ్గరకు వెళ్లి పర్సులో ఉన్న రెండు వేలూ కట్టేసింది. రశీదు తీసుకుంటూ 'మనచేతిలో ఉన్నది, చేయగలిగినది ఇదే సోనీ!' అంది.
'అవును, పాపం చిన్నపిల్లాడు!' జాలిగా అంది.
'కష్టపడకపోతే పొట్ట నిండేదెట్లా మరి వాళ్లకి? చిన్న, పెద్ద భేదం లేదు. అబ్బ! నిజంగా తలచుకుంటేనే ఎంత బాధగా ఉందో' అంది నీరూ.
పక్క నుంచి 'వాళ్ల అమ్మ ఆపరేషన్‌ కోసం తిండి తినకుండా, వట్టి చాయి నీళ్లు తాగుతూ పైసలు కూడబెడుతున్నాడు పాపం. అదే వాడి కొంపముంచింది' అన్నాడు కరీం. ఇంతలో అతనికి ఫోన్‌ వచ్చింది, 'అమ్మా నాకు ఒక సవారీ ఉంది. వాళ్లను దింపి, నేను వాడింటికి వెళ్లి, వాళ్ల అమ్మను తీసుకొని వస్తాను' అని చెప్పి కరీం వెళ్లిపోయాడు.
నిజుఙవఅ ్‌ష్ట్రవ రఎaశ్రీశ్రీవర్‌ aష్‌ శీట షaతీఱఅస్త్ర టశీతీ aఅశ్‌ీష్ట్రవతీ జూవతీరశీఅ ఱర శ్రీఱసవ a సతీశీజూ శీట షa్‌వతీ - ఱ్‌ షఱశ్రీశ్రీ ఎaసవ తీఱజూజూశ్రీవర ్‌ష్ట్రతీశీబస్త్రష్ట్రశీబ్‌ ్‌ష్ట్రవ వఅ్‌ఱతీవ జూశీఅసు అన్న వాక్యాలు ఎదురు గోడ మీద మెరుస్తూ కనిపించాయి. అది చూసిన ఇద్దరి కళ్లలో ఒకే భావం మెదిలింది.
సమయం రాత్రి తొమ్మిది గంటలు. కరీం ద్వారా విషయం తెలుసుకున్న ఆటో అబ్బాయి తల్లి, చెల్లెళ్లు హాస్పిటల్‌కి పరిగెత్తుకొని వచ్చారు.
అక్కడ నర్స్‌ చెప్పింది 'మీ అబ్బాయికి ట్రీట్మెంట్‌ ఇస్తున్నారు. మీరు బయటే కూర్చోండి. ఇప్పుడే లోపలకి వెళ్లడానికి లేదు' అంది. అప్పుడు గుర్తుకొచ్చింది తన కొడుకును ఎవరో ఇద్దరు ఆడవాళ్లు హాస్పిటల్‌కు తీసుకొచ్చారని, 'మానవత్వంతో స్పందించి, నీ కొడుకు ప్రాణాన్ని నిలబెట్టారు.వాళ్లిద్దరూ బెహన్‌' అన్న కరీం మాటలు, ఆ తల్లి గుండెలో ప్రాణదీపాన్ని వెలిగించాయి. వెంటనే కరీంని అడిగింది 'వాళ్లేరని?'.
'అదే వాళ్లకోసం అంతా వెతికాను. కానీ ఎక్కడా లేరు రజియా బెహన్‌' అని కరీం చెప్పాడు.
'దేముడులాగే వీళ్లు కూడా కనిపించకుండా, నిశ్శబ్దంగా చేసిన సాయం, విలువ కట్టలేనిది. నా బిడ్డని బతికించిన ఆ అల్లాకి వేల వేల కృతజ్ఞతలు. జన్మజన్మలకి వాళ్లకి ఋణపడి ఉంటాను' అంటూ ఆ కన్నతల్లి అక్కడ లేని ఆ ఇద్దరికీ మనసారా రెండు చేతులూ జోడించి, వాళ్లకు ఎప్పుడూ మంచి జరగాలని ప్రార్థించింది.

                                                                   ***

హుషారుగా ఆ ఇద్దరు డాన్స్‌ చేస్తుంటే, అక్కడ కూర్చున్న కస్టమర్స్‌ ఆనందంతో ఊగిపోతూ, వాళ్ల మీదకి డబ్బులు విసురుతున్నారు. 'కొంచెం ఆలస్యమైనా ఈ రోజు కలెక్షన్‌ చాలానే ఉంటుంది.. ఇద్దరూ భలే హుషారెక్కిస్తున్నారు జనాలకి!' కిక్కిరిసిన కస్టమర్స్‌ని చూస్తూ తృప్తిగా అనుకున్నాడు బార్‌ ఓనర్‌ .
మత్తుతో ఊగిపోతున్న జనం.. ఎడాపెడా మీద పడుతున్న కరెన్సీ నోట్లు.. అతి చిన్న బట్టలతో ఒళ్లు చూపిస్తూ రెండర్థాల పాటకి డాన్స్‌ చేస్తున్నా.. మేనేజర్‌ తిట్టిన తిట్లు వాళ్లని బాధించడం లేదు. ఒక్కసారి పెద్ద మొత్తం రెండువేల రూపాయిలు ఇచ్చేశామనీ అనుకోలేదు. పైగా డబ్బుదేముంది ఎంత తక్కువ బట్టలు వేసుకొని డాన్స్‌ చేస్తే, అంత ఎక్కువ డబ్బులు వస్తాయి. కానీ తమ మూలాన ఒక ప్రాణం నిలబడిందన్న తృప్తి, ఆనందం వాళ్ళ కళ్ళల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.


మణి వడ్లమాని
96520 67891