Dec 26,2022 23:22

  • ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

ప్రజాశక్తి-ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మండంల పరిధిలోని (కాచవరం) దొనబండ వద్ద ఓ పసికందు ముళ్ల పొదల్లో కనిపించింది. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన మహమ్మద్‌ షాబాజ్‌ గుడివాడకు చెందిన దివ్య అనే యువతితో కొంతకాలంగా హైదరాబాద్‌లో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో దివ్య గర్భవతి కాగా ఈ నెల 23వ తేదీన పురిటి నొప్పులు రావడంతో హైదరాబాద్‌లోని మోడరన్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ దివ్య ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే దివ్యకు మూర్ఛ రావడంతో ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దివ్య మృతిచెందింది. దివ్య మతదేహాన్ని తీసుకుని మినీ అంబులెన్స్‌లో హైదరాబాద్‌ నుంచి ఆమె స్వగ్రామం గుడివాడకు వస్తుండగా మార్గమధ్యలో దొనబండ వద్ద ముళ్లపొదల్లో షాబాజ్‌ పసికందును వదిలి వెళ్లిపోయాడు. అటుగా వెళ్తున్న గాజులు విక్రయించే మహిళ పసికందు ఏడుపు విని దగ్గరికి వెళ్లి చూసింది. పొదల్లో పసికందును గుర్తించి వెంటనే స్థానిక ఆశ వర్కర్‌కు అప్పగించింది. స్థానిక వీఆర్వో, ఆశ వర్కర్లు ఇబ్రహీంపట్నం పోలీసులకు సమాచారం అందించారు. సీఐ పి.శ్రీను, ఎస్సై శ్రీను సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. దారుణానికి పాల్పడ్డ పసికందు తండ్రి షాబాజ్‌ను పట్టుకున్నారు. పసికందును సంరక్షణ నిమిత్తం చైల్డ్‌లైన్‌కు అప్పగించారు.