Feb 28,2021 11:40

నిల్వ పచ్చడి..
కావాల్సిన పదార్థాలు : ములక్కాయలు- రెండు, చింతపండు- 50 గ్రాములు, ఆవాలు- టేబుల్‌ స్పూన్‌, మెంతులు- పావు టీస్పూన్‌, నూనె- నాలుగు టేబుల్‌స్పూన్లు, పచ్చి శనగపప్పు, మినపప్పు- టీస్పూన్‌ చొప్పున, జీలకర్ర- అర టీస్పూన్‌, వెల్లుల్లి రెబ్బలు- పది, ఎండు మిరపకాయలు - నాలుగు, కరివేపాకు- కొద్దిగా, పసుపు- అర టీస్పూన్‌, ఇంగువ- పావు టీస్పూన్‌, కారం- టేబుల్‌ స్పూన్‌, ఉప్పు- టేబుల్‌ స్పూన్‌.
తయారుచేసే విధానం :

  •  ములక్కాయలను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. తర్వాత చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి.
  • చింతపండును వేడినీటిలో నానబెట్టాలి. కొద్ది సమయం తర్వాత అందులో పీచు, పిక్కలను తీసివెయ్యాలి. తర్వాత మిక్సీలో మెత్తగా వేసి పక్కన పెట్టుకోవాలి.
  • ఒక పాన్‌ తీసుకుని అందులో ఆవాలు, మెంతులను వేసి, దోరగా వేయించాలి. వాటిని మిక్సీలో మెత్తగా చేసి, పెట్టుకోవాలి.
  • పాన్‌లో నూనె వేసుకుని, వేడెక్కాక మునక్కాయల ముక్కలను తక్కువ మంటలో ఐదు నిమిషాలు వేయించాలి. మునక్కాయ ముక్కలు కొంచెం వేగితే చాలు. వాటిని ఒక ప్లేట్‌లోకి తీసి పెట్టుకోవాలి.
  • ఇప్పుడు అదే నూనెలో పచ్చి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేయాలి. అందులోనే వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచి వేయాలి. తర్వాత ఎండు మిరపకాయలు వేయాలి. తాలింపును రెండు నిమిషాలు వేగించాలి. తర్వాత కరివేపాకును అందులో వేసి వేగనివ్వాలి.
  • ఇందులోనే పసుపు, ఇంగువ వేయాలి. తర్వాత మిక్సీ వేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును వేయాలి. ఐదు నిమిషాలు తక్కువ మంటలో ఉడికించాలి. అందులోని నీళ్లు ఆవిరై, చింతపండు గుజ్జు దగ్గరపడ్డ తర్వాత స్టౌ ఆపి చల్లారనివ్వాలి.
  • ఒక బౌల్‌లో కారం, ఉప్పు, మిక్సీ పట్టుకున్న మెంతులు, ఆవాల పొడిని వేసి, కలపాలి. అందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న ములక్కాయ ముక్కలను వేయాలి. అందులో తాలింపు పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసి కలుపుకోవాలి.
  • ఇలా కలుపుకున్న మిశ్రమం 24 గంటలు తర్వాత వాడుకోవాలి. అంతే పచ్చడి రెడీ అయినట్లే. ఒకవేళ కారం, ఉప్పు, నూనె సరిపోకపోతే మరలా కలుపుకోవచ్చు.
ములగతో మజా.. మజా..

పచ్చిమామిడి కాయతో..
కావాల్సిన పదార్థాలు : పచ్చి మామిడికాయలు - రెండు, ములక్కాయలు - నాలుగు, ఉల్లిపాయలు - రెండు, పచ్చి మిరపకాయలు - ఐదు, ఆవాలు, జీలకర్ర - టీ స్పూను చొప్పున, కరివేపాకు - రెండు రెబ్బలు, వెల్లుల్లి రేకలు - నాలుగు, కారం - రెండు టీ స్పూన్లు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
తయారుచేసే విధానం : 

  • ' పచ్చి మామిడికాయల్ని పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకోవాలి. ములక్కాయలను కావాల్సిన సైజులో ముక్కలుగా కోసి పెట్టుకోవాలి.
  • ఉల్లిపాయల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
  • స్టౌ మీద గిన్నె పెట్టి సరిపడా నూనె పోయాలి. కాగాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లిరేకలు వేయాలి.
  • అందులోనే పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత ఉప్పు, కారం వేసి బాగా కలపాలి.
  • దీనిలో ములక్కాయ ముక్కలు వేసి, రెండు నిమిషాలు మగ్గనివ్వాలి. అందులోనే మామిడికాయ ముక్కలూ వేసి ఉడకనివ్వాలి.
  • ఇప్పుడు సరిపడా నీళ్లు పోసి, పది నిమిషాలు పులుసుని మరిగించాలి. ముక్కలు బాగా మెత్తబడ్డాక దించేయాలి.



మాంసం :
కావాల్సిన పదార్థాలు : మాంసం - అరకేజీ, మునక్కాయలు - రెండు, ఉల్లిపాయలు - రెండు, పచ్చిమిర్చి - రెండు, కారం - టీస్పూన్‌, పసుపు - పావు టీస్పూన్‌, ధనియాల పొడి - టేబుల్‌ స్పూన్‌, జీలకర్ర - టీస్పూన్‌, గసగసాలు - టీస్పూన్‌, అల్లంవెల్లుల్లి పేస్టు - టీ స్పూన్‌, నూనె - తగినంత, లవంగాలు - ఐదు, దాల్చినచెక్క - చిన్నముక్క, యాలకులు - రెండు. 
తయారుచేసే విధానం..

  • ములక్కాయల ఈనెలు తీసి ముక్కలు కట్‌ చేయాలి. ఒక పాన్‌లో నూనె వేసి కాగాక, ములక్కాయ ముక్కలు వేసి, కాసేపు వేయించి పక్కన పెట్టుకోవాలి. గసగసాలు కూడా వేయించి, పొడిచేసుకోవాలి.
  • ఇప్పుడు కుక్కర్‌ తీసుకొని, నూనె వేసి కాస్త వేడయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తర్వాత అల్లంవెల్లుల్లి పేస్టు వేయాలి. కాసేపు వేగిన తరువాత అందులోనే శుభ్రం చేసి, కడిగిపెట్టుకున్న మాంసం వేసి కలియబెట్టాలి. కొంచెం ఉడికాక కారం, పసుపు, ధనియాల పొడి, గసగసాల పొడి, తగినంత ఉప్పు వేయాలి. చిన్నమంటపై పది నిమిషాల పాటు వేగనివ్వాలి.

తరువాత రెండు గ్లాసుల నీళ్లు పోసి కుక్కర్‌ మూత పెట్టాలి. మూడు విజిల్స్‌ వచ్చేంత వరకూ ఉడికించాలి. ఆవిరి పోయిన తర్వాత కుక్కర్‌ మూత తీసి, మునక్కాయ ముక్కలు వేసి కలియబెట్టాలి. చిన్నమంటపై కాసేపు ఉడకనివ్వాలి. మునక్కాయలు ఉడికాక కొత్తిమీర చల్లి, దింపుకోవాలి.

ములగతో మజా.. మజా..

చేపలతో..

కావాల్సిన పదార్థాలు : కొరమీను చేప ముక్కలు - అరకేజీ, కారం- నాలుగు టీ స్పూన్లు, ధనియాల పొడి - రెండు టీ స్పూన్లు, చింతపండు గుజ్జు - అరకప్పు, కొబ్బరి పేస్ట్‌ - అరకప్పు, పచ్చిమిర్చి - పది (కచ్చాపచ్చాగ దంచాలి), ములక్కాయలు - రెండు (చిన్న ముక్కలుగా కట్‌ చేయాలి), నూనె- అరకప్పు, జీలకర్ర పొడి - టీ స్పూన్‌, ఎండుమిర్చి- ఐదు, కరివేపాకు - రెమ్మ, పసుపు - అర టీస్పూన్‌, ఉప్పు- తగినంత.
తయారుచేసే విధానం : 

  • చేప ముక్కలను శుభ్రంగా కడిగి, పక్కన పెట్టుకోవాలి.
  • స్టౌ మీద పాన్‌ పెట్టి, రెండు టీ స్పూన్ల నూనె వేయాలి. అది వేడెక్కాక అందులో కొబ్బరి పేస్ట్‌, పచ్చిమిర్చి, ధనియాల పొడి, కారం, పసుపు తగినంత ఉప్పు వేయాలి. ఇలా రెండు నిమిషాలు వేయించాలి.
  • తర్వాత రెండు కప్పుల నీళ్లు పోసి, మూతపెట్టాలి.
  • ఈ మిశ్రమం కాస్త చిక్కపడ్డాక అందులో కట్‌ చేసిన ములక్కాయ ముక్కలు, చింతపండు గుజ్జు పోసి, సన్నటి సెగ మీద ఉడికించాలి.
  • ఇది ఉడుకుతుండగా మధ్యలో చేప ముక్కల్నీ జత చేసి, మూతపెట్టాలి.
  • ఈ మిశ్రమమంతా చిక్కబడుతుండగా దించి, వేరొక పాన్‌లో మిగిలిన నూనె వేయాలి. నూనె వేడెక్కాక అందులో జీలకర్రపొడి, కరివేపాకు, ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టాలి.
  • వేయించిన తాలింపును ఉడికించిన కూరలో కలిపి, గిన్నెను తిప్పుతూ కలపాలి. గరిటెతో కలపకూడదు.