
ప్రజాశక్తి-అనకాపల్లి
రాష్ట్ర మంత్రులు, వైసిపి ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, తుదకు సలహాదారులతో అందరికీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై నమ్మకం పోయిందని, ఆ విషయం తేటతెల్లమైన తర్వాతే నన్ను నమ్మండి అని బ్రతిమలాడుకుంటురని టిడిపి అనకాపల్లి జిల్లా అధ్యక్షులు బుద్ద నాగ జగదీశ్వరరావు ఎద్దేవా చేశారు. టిడిపి కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ గంగవరం పోర్టును రూ.646 కోట్లకు ఎందుకు అమ్మేశారో పరిశ్రమల మంత్రి అమర్నాథ్ ప్రజలకు జవాబు చెప్పే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ, ఉత్తరాంధ్ర సృజల స్రవంతికి ప్రాజెక్టును వైసిపి ప్రభుత్వం నిర్వీర్యం చేసినా ఉత్తరాంధ్ర మంత్రులు నోరు మెదపకుండా, చంద్రబాబు పేరు చెప్పుకొని బతికేస్తున్నారని తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజల కోసం నిధులు అడిగే దమ్ము ధైర్యము మంత్రులకు ఉందా? అని ప్రశ్నించారు. గత నాలుగు సంవత్సరాలుగా బట్టన్ నొక్కడం అప్పులు తేవడం, పత్రికా ప్రకటనలకు, ప్రైవేటు ఫ్లైట్లకు వేల కోట్లు చెల్లించడం చేశారన్నారు. అరకొరగా ఉన్న జీవీఎంసీ నిధులు 125 కోట్లను అభివృద్ధి పేరుతో జి20 సమావేశాలకు ఖర్చు చేశారని తెలిపారు. ప్రభుత్వం ఇవ్వవలసిన నిధులు ఇవ్వకుండా జీవీఎంసీని దివాలా తీయిస్తున్నారని విమర్శించారు. విలేకరుల సమావేశంలో టిడిపి నాయకులు నడిపల్లి గణేశ్వరరావు, కుప్పిలి జగన్, బోడి వెంకటరావు, కోట్ని రామకృష్ణ పాల్గొన్నారు.