ప్రజాశక్తి - ఆస్పరి
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా పర్యటన వల్ల ప్రజాధనం వృథా తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు కెవి.నారాయణ పేర్కొన్నారు. సోమవారం ఆస్పరిలో సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతమైన ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో సాగు, తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. వేదవతి రిజర్వాయర్ పనులు ప్రారంభించి, కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని తెలిపారు. హంద్రీనీవా ద్వారా పిల్ల కాలువలు నిర్మించి సాగునీరు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కరువు ప్రాంతాల ప్రజలకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని, వేదవతి ప్రాజక్టు పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఆదోని, పత్తికొండ రెవెన్యూ డివిజన్ పరిధిలోని రైతులు జింకల వల్ల తీవ్రంగా నష్టపోతున్నా ముఖ్యమంత్రి జగన్ కనీసం హామీ కూడా ఎవ్వలేదని తెలిపారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దేవరగట్టులో జింకల పార్కు ఏర్పాటు చేయాలని కోరారు. సిపిఎం మండల కార్యదర్శి హనుమంతు, మండల నాయకులు బాలకృష్ణ, రంగస్వామి, రామాంజినేయులు, మధు రెడ్డి, రామాంజినేయులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నారాయణ










