Jun 02,2023 19:22
సమావేశంలో మాట్లాడుతున్న తెర్నేకల్‌ సురేందర్‌ రెడ్డి

ప్రజాశక్తి - దేవనకొండ
ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పత్తికొండ పర్యటన విజయవంతమైందని వైసిపి నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని తెర్నేకల్‌ గ్రామంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెర్నేకల్‌ సురేందర్‌ రెడ్డి, వైసిపి సీనియర్‌ నాయకులు మధుసూదన్‌ రెడ్డి, సర్పంచి అరుణ్‌ కుమార్‌ మాట్లాడారు. పట్టణంలో రైతు భరోసా ద్వారా రైతుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమం విజయవంతం చేసినందుకు మండల ప్రజలకు, గ్రామస్తులకు, వైసిపి కార్యకర్తలకు, నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నాలుగేళ్ల వైసిపి పాలనలో పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు తెలిపారు. ఓ వైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి చేస్తూ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తున్న ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. రైతులు అభివృద్ధి చెందేందుకు పెట్టుబడి సహాయం కింద రైతు భరోసా, రైతు గ్రూపులకు రాయితీతో యంత్ర సేవా పథకం కింద వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్లు అందించినట్లు తెలిపారు. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా రాయితీతో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచడం హర్షించదగ్గ విషయమన్నారు.
అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా పోటీకి సిద్ధం : కర్నూలు పార్లమెంట్‌ నియోజవర్గ స్థాయిలో ఉంటూ వైసిపి ఆవిర్భావం నుంచి పార్టీలో పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. మంచి గుర్తింపు పొందిన తనకు వైసిపి అధిష్టానం అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఆలూరు నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు తాను సిద్ధమని తెర్నేకల్‌ గ్రామ సీనియర్‌ వైసిపి నాయకులు సూదన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఎంపిపి లక్ష్మీదేవి భర్త లుమాంబ, ఎంపిటిసి నామాల శ్రీనివాసులు, ఉప సర్పంచి భర్త బెల్‌ ఈరన్న, మాజీ ఎంపిటిసిలు చాప వీరన్న, రాఘవేంద్ర, వైసిపి యూత్‌ నాయకులు రామ్‌ నాయుడు, పులి నరేష్‌ పాల్గొన్నారు.