
ప్రజాశక్తి-విజయనగరం : నగరంలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి జిల్లాకు రాక ఖరారైంది. ఈ విషయాన్ని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి వెల్లడించారు. ముఖ్యమంత్రి ఈనెల 15న ఉదయం 10.30 గంటలకు హెలికాప్టర్‌లో జెఎన్‌టియు సమీపంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు చేరుకుంటారని, 10.45 గంటలకు వైద్య కళాశాల ప్రాంగణానికి చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. అనంతరం వైద్య కళాశాల ప్రారంభానికి సంబంధించిన శిలాఫలకం ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్, స్కిల్ ల్యాబ్‌లను సందర్శిస్తారని తెలిపారు. అనంతరం బయోకెమిస్ట్రీ ల్యాబ్, అనాటమీ మ్యూజియం పరిశీలిస్తారని పేర్కొన్నారు. 11.30 గంటలకు లెక్చర్ హాలుకు చేరుకొని రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఐదు ప్రభుత్వ వైద్యకళాశాలల్ని వర్చ్యువల్‌గా ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులు సందేశాలు ఇస్తారని, అనంతరం ఐదు కళాశాలల వైద్య విద్యార్ధులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారని తెలిపారు. అనంతరం హెలిపాడ్‌కు చేరుకొని జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో సమావేశం అవుతారని పేర్కొన్నారు. కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, ఎస్‌పి ఎం.దీపిక, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్‌లు ఏర్పాట్లను పరిశీలించి ఆయా వేదికలకు ఇన్‌ఛార్జిలుగా వ్యవహరిస్తున్న అధికారులకు సూచనలు చేశారు. ల్యాబ్‌లను సంబంధింత పరికరాలు, ప్రదర్శన అంశాలతో సిద్ధంచేయాలని కళాశాల ప్రిన్సిపాల్ డా.పద్మలీలను ఆదేశించారు. లెక్చర్ హాలులో ప్రధాన కార్యక్రమ వేదిక వద్ద వీడియో కాన్ఫరెన్సింగ్, ప్రత్యక్ష ప్రసారం, తదితర ఏర్పాట్లపై సూచనలు చేశారు. వైద్య మౌళిక సదుపాయాల సంస్థ అధికారులు ఎస్.ఇ. శివకుమార్, ఇఇ బి.ఎన్.ప్రసాద్ తదితరులు కళాశాల ప్రాంగణంలో చేస్తున్న ఏర్పాట్లపై వివరించారు. ఆర్‌డిఒ ఎం.వి.సూర్యకళ, కార్పొరేషన్ కమిషనర్ శ్రీరాములు నాయుడు, ఎస్.డి.సి. సూర్యనారాయణ, తహశీల్దార్ కె.శ్రీనివాసరావు తదితర అధికారులు పాల్గొన్నారు.
హెలీప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించిన ఉపసభాపతి, జెడ్‌పి చైర్మన్
విజయనగరం టౌన్ : ముఖ్యమంత్రి పర్యటనకు త్వరితగతిన అన్ని ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జెడ్‌పి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధికారులకు ఆదేశించారు. బుధవారం జెఎన్‌టియు సమీపంలోని హెలిప్యాడ్ స్థలాన్ని, వైద్యకళాశాల పనులను వారు పరిశీలించారు. ఇప్పటి వరకూ చేసిన ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. హెలీప్యాడ్ ప్రదేశం నుంచి కళాశాలకు వచ్చే వరకూ ఏర్పాట్లు పక్కాగా చేయాలని సూచించారు. జిల్లా ప్రజల చిరకాల కోరికైన వైద్యకళాశాలను నెరవేర్చినందుకు ముఖ్యమంత్రికి కతజ్ఞతలు తెలియజేసేలా వివిధ కార్యక్రమాలు రూపొందించాలని చెప్పారు. కార్యక్రమంలో ఆర్‌డిఒ సూర్యకళ, వైద్యకళాశాల ప్రిన్సిపాల్ పద్మలీల, ఇతర అధికారులు ఉన్నారు.
ముమ్మరంగా పనులు
ముఖ్యమంత్రి పర్యటన ఖరారైన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. వైద్య కళాశాల భవనానికి ఎపిఎంఎస్‌ఐడిసి ఆధ్వర్యంలో వందలాది కార్మికులు తుదిమెరుగులు దిద్దుతున్నారు. కళాశాల ప్రాంగణంలో పచ్చదనం పెంచేలా పనులు చేపట్టడంతోపాటు వైద్య కళాశాల ప్రధాన ప్రవేశద్వారం నిర్మాణ పనులు, ప్రాంగణంలో అంతర్గత రోడ్ల నిర్మాణం, భవనానికి రంగులు అద్దడం, పరిశుభ్రం చేసే పనుల్లో సుమారు 800 నుంచి 1000 మంది వరకు కార్మికులు పాల్గొంటున్నట్టు వైద్య మౌళిక సదుపాయాల సంస్థ ఎం.డి. మురళీధర్ రెడ్డి తెలిపారు.










