ప్రజాశక్తి - ఆదోని
ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెలరోజులు గడిచినా నేల పదునయ్యే వర్షం రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రుతుపవనాల ప్రభావంపైనే ఆధారపడి వర్షాలు కురుస్తున్నాయి. గత నెల 3న కేరళలో రుతుపవనాలు తీరం దాటాయి. 8న ఆంధ్రప్రదేశ్‌లో రుతుపవనాలు ప్రవేశించాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రుతుపవనాలు ప్రభావం చూపకపోవడంతో విస్తారమైన వర్షం కురువని పరిస్థితి. అక్కడక్కడ మోస్తారు వర్షం కురిసినా నేల పూర్తిస్థాయిలో పదును కాలేదని రైతులు చెబుతున్నారు. ఇప్పటికీ వాతావరణం చల్లబడలేదు. వేసవిని తలపించే విధంగా వేడి గాలులు వీస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే 10 శాతం కూడా విత్తనం నాటుకోలేదని రైతులు వాపోతున్నారు. ఈఏడాది గడ్డు పరిస్థితి తప్పదా అంటూ రైతులు తలలు పట్టుకుంటున్నారు.
అరకొరగానే వర్షపాతం
- ఆదోని డివిజన్‌లో 31.8 మిల్లీమీటర్ల వర్షపాతం
ఆదోని రెవెన్యూ డివిజన్‌లో సోమవారం తెల్లవారుజామున 31.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని అధికారులు వెల్లడించారు. కోసిగి 14.4, మంత్రాలయం 9.8, గోనెగండ్ల 3.2, నందవరం 1.8, ఎమ్మిగనూరు 1.2, ఆదోని 0.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. డివిజన్ మొత్తంగా 31.8 మిల్లీమీటర్ల వర్షం కురిసి సగటున 3.5 మిల్లీమీటర్లు నమోదైంది.
బ్లాక్‌లో విత్తనం
ఆదోని పట్టణంలో కొందరు విత్తన వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. బోరుబావుల కింద మిరప పంట మంచి దిగుబడి రావడంతో ఆ పంట సాగు చేసేందుకు రైతులు ఉత్సాహం చూపుతున్నారు. అవసరాన్ని గ్రహించిన వ్యాపారులు మిరప విత్తనాలు బ్లాక్‌లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. సింజంట కంపెనీ 10 గ్రాముల ప్యాకెట్ ఎంఆర్‌పి కన్నా అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఒక్కో ప్యాకెట్ రూ.1800లకు విక్రయిస్తున్నారని, ఎలా సాగు చేసేదంటూ రైతులు వాపోతున్నారు. ఎకరాకు పది ప్యాకెట్లు అవసరమని రైతులు చెబుతున్నారు. స్టాక్ వివరాలను వ్యాపారులు బహిర్గతం చేయకుండా జాగ్రత్త పడుతూ విత్తనం లేదని బొంకుతున్నారు. సంబంధిత అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా పరిష్కరించే వారే కరువయ్యారని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ముఖం చాటేసిన వరుణుడు










