Mar 01,2023 23:50

ఐటిడిఎ ఎదుట నిరసన తెలుపుతున్న ఆశ్రమ పాఠశాలల వర్కర్లు

ఆర్థిక స్థోమత, నైపుణ్యం లేని వారికి మినహాయింపు ఇవ్వాలని వినతి
ప్రజాశక్తి-చింతూరు

స్మార్ట్‌ ఫోన్లు కొనుగోలు చేసే అర్థిక స్థోమత, వాటిని ఉపయోగించే నైపుణ్యం లేని ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న కుక్‌, కమాటి, వాచ్‌మెన్లు, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి ముఖ హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని బుధవారం చింతూరు ఐటిడిఎ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యాన నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు ఎఎస్‌ఆర్‌ రంపచోడవరం జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ముఖ హాజరు ప్రవేశ పెట్టడంతో చింతూరు, రంపచోడవరం ఐటిడిఎల పరిధిలోన ఆశ్రమ పాఠశాలల వర్కర్లు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉన్న సిబ్బందే పని చేయాల్సి వస్తుందని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వర్కరు పోస్టులను భర్తీ చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ హామీ మేరకు వేతనాలు పెంచాలని, సీనియార్టీ ప్రకారం వర్కర్లను క్రమబద్ధీకరించాలని, కళాశాల హాస్టల్‌లో పనిచేస్తున్న వర్కర్లను అవుట్‌ సోర్సింగ్‌లోకి మార్చాలని కోరారు. యూనిఫారం, ఇతర రక్షణ పరికరాలు, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, డ్యూటీ చేస్తూ చనిపోయిన వర్కర్లకు జీవో ప్రకారం రూ.2 లక్షలు చెల్లించాలని, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. వీటిపై కలెక్టర్‌ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి పోడియం లక్ష్మణ్‌, గిరిజన సంఘం జిల్లా నాయకులు సీసం సురేష్‌, ఆశ్రమ స్కూల్స్‌ వర్కర్లు కారం చంద్రమ్మ, దుర్గారావు, వీరాస్వామి, చెల్లమ్మ, రాములమ్మ, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.