Oct 06,2023 23:00

ఎసిడిపిఒ మాణిక్‌రావుకు వినతిపత్రం ఇస్తున్న యూనియన్‌ నాయకులు

ప్రజాశక్తి - నరసరావుపేట : ముఖ హాజరు యాప్‌ ద్వారా గర్భిణులకు, బాలింతలకు పోషకాహారం ఇచ్చే సమయంలో ఫొటోలు తీసి పోషణ యాప్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం తెచ్చిన యాప్‌ సరిగా పని చేయకపోవడంతో అంగన్వాడీలు మానసిక ఒత్తిడితో అనారోగ్యానికి గురవుతున్నారని ఎపి అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పెర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విధానాన్ని తక్షణమే తొలగించాలని కోరుతూ స్థానిక బీసీ కాలనీలోని పీడీ కార్యాలయంలో సూపరింటెండెంట్‌ గోపాల్‌రెడ్డి, ఎసిడిపిఒ మాణిక్యరావుకు నాయకులు శుక్రవారం వితనిపత్రం ఇచ్చారు. ఈ సంద్భంగా యూనియన్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కెపి మెటిల్డాదేవి, జి.మల్లీశ్వరి మాట్లాడుతూ అంగనాడీల సమస్యలపై అనేకసార్లు విన్నవించినా పరిష్కరించడం లేదని, పైగా కొత్త సమస్యలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్‌నెట్‌ సమస్య కారణంగా ముఖ హాజరు యాప్‌లో వివరాలు సరిగా నమోదుకు కావడం లేదని, ఈ నేపథ్యంలో రిజిస్టర్‌లో నమోదు చేసి లబ్ధిదారుల నుండి సంతకం చేయించి పోషకాహారం పంపిణీ చేసే అవకాశం కల్పించాలని కోరారు. ముఖ హాజరుకు వ్యతిరేకం కాదని, హాజరు వేసే విధానం, యాప్‌ పనితీరు సరిగా లేనందున వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఈ యాప్‌ విధానం దేశంలో ఎక్కడా లేదన్నారు. ఈ నెల 9న శాఖ కమిషనర్‌ అధికారులతో యూనియన్‌ నాయకులతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామని చెప్పారని తెలిపారు. కార్యక్రమంలో నరసరావుపేట ప్రాజెక్ట్‌ కార్యదర్శి నిర్మల, సిఐటియు పట్టణ కార్యదర్శి షేక్‌ సిలార్‌ మసూద్‌ పాల్గొన్నారు.