Jan 24,2023 23:09

ప్రజాశక్తి-విజయవాడఅర్బన్‌: ముఖ ఆధారిత హాజరులో ఉద్యోగులు అనేక ఇబ్బందులు గురవుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆ ఇబ్బందులన్నీ తొలగించాలని జేఏసీ చైర్మన్‌ ఎ.విద్యాసాగర్‌ కోరారు. ముఖ ఆధారిత హాజరుపై విజయవాడ నగరంలోని వివిధ డిపార్ట్మెంట్‌ ఉద్యోగులుతో విజయవాడ నగర శాఖ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ ఆధారిత హాజరు వల్ల ఫీల్డ్‌ వర్క్‌ చేసే పరిస్థితి లేదని, ఫీల్డ్‌లో ఉన్న స్టాఫు సిగల్‌ ప్రాబ్లం వల్ల హాజరు నమోదు చేయలేకపోతున్నారని, అలాగే సెలవులకు సంబంధించిన ఆప్షన్స్‌ కూడా ముఖ ఆధారిత యాప్‌లో ఇంతవరకు పొందుపరచలేదని, ఏదైనా రోజున అత్యవసరంగా సెలవు పెట్టుకోవాలంటే ఆ సదుపాయం లేదని తెలిపారు. నాలుగో తరగతి ఉద్యోగులు ఆండ్రాయిడ్‌ ఫోన్‌ లేనివారు అనేక ఇబ్బందులు పడుతున్నారని హాజరు వేళలో సపరేట్‌ గా ఉన్న వాచ్మెన్‌ లాంటి ఉద్యోగులకు ఎటువంటి ఏర్పాటు కల్పించలేదని తెలిపారు. ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్‌ డిఏలు, పెండింగ్‌ డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోకుండా మీనవేషాలు లెక్కిస్తుందన్నారు. ఉద్యోగులకు సంబంధించి సంవత్సరం కాలంగా పెండింగ్లో బిల్లులన్నింటినీ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. విజయవాడ నగర శాఖ అధ్యక్షుడు శ్రీ రామ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా సహాధ్యక్షుడు పి.రమేష్‌, కోశాధికారి సతీష్‌, ఉపాధ్యక్షులు రాజబాబు, విశ్వనాథ్‌, బీవీ రమణ పాల్గొన్నారు.